రెవిన్యూ, వసతి మరియు ఐటి విభాగాలను సమీక్షించిన TTD EO

- June 18, 2024 , by Maagulf
రెవిన్యూ, వసతి మరియు ఐటి విభాగాలను సమీక్షించిన TTD EO

తిరుపతి: టీటీడీ రెవెన్యూ-పంచాయతీ రాజ్, రిసెప్షన్ మరియు ఐటి విభాగాలపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు మంగళవారం సమీక్షించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సి.వి.ఎస్.ఓ నరసింహ కిషోర్ లతో కూడి ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు. అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు.

శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ, టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.

తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదేపదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులని ఆదేశించారు.

అనంతరం నారాయణగిరి షెడ్‌ల వద్ద వైకుంఠం కంపార్ట్‌మెంట్‌ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రెవెన్యూ-పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన ఆయన, తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్‌లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO)ని ప్రత్యేకంగా నియమించాలని ఈఓ ఆదేశించారు.

ఆరోగ్యం, అన్నప్రసాదం, శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏ ఈ ఓ తో ఎప్పటి కప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని
ఆయన చెప్పారు.

ఈవో తనిఖీలు:

అనంతరం ఈవో, అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం జనతా క్యాంటీన్లు, హోటళ్లను పరిశీలించి యాత్రికులకు వడ్డించే తినుబండారాల ఖరీదు, బయట బోర్డులపై ప్రదర్శించిన ధరలను పరిశీలించారు.శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్లు, నారాయణగిరి అతిధి భవనాలు నెం.3, శేషాద్రి నగర్ కాటేజీలను ఆయన పరిశీలించారు.

ఈవోతో పాటు జేఈవో వీరబ్రహ్మం,సీవీఎస్‌వో నరసింహకిషోర్, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్ రెడ్డి,ఈఈలు శ్రీనివాస్,జగన్మోహన్ రెడ్డి,శ్రీహరి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టి.రవి తదితరులున్నారు.అంతకుముందు తనిఖీలు సమీక్షా సమావేశాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com