సినిమా రివ్యూ: ‘కల్కి 2898 AD’

- June 27, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కల్కి 2898 AD’

600 కోట్ల బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌తో అతి భారీ అంచనాలతో రూపొందిన సినిమానే ‘కల్కి 2898ఏడీ’. నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి యూనివర్స్‌లో తాను అనుకున్న కథని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించగలిగాడా.? లేదా.? ప్రబాస్ సినిమాలపై హైప్ తప్ప.. రిలీజ్ తర్వాత తుస్సుమంటున్నాయన్న నెగిటివిటీని నాగ్ అశ్విన్ తన ‘కల్కి’తో పోగొట్టాడా.? లేదా.? తెలియాలంటే అస్సలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో కథ స్టార్ట్అవుతుంది. నా అన్నవాళ్లందర్నీ కోల్పోయి నిరాశలో వున్న అశ్వత్ధామ (అమితాబ్ బచ్చన్) కోపంతో రగిలిపోతూ పాండవులకు వారసులే వుండకూడదని తలంచి ఉత్తర కడుపులోని బిడ్డ పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో ఆ బిడ్డ చనిపోతుంది.ఇది యుద్ధ నీతికి వ్యతిరేకం అని కృష్టుడు, అశ్వత్ధామని శపిస్తాడు. ఆ శాపం కారణంగా కలియుగాంతం వరకూ చావకుండా బతికే వుంటావని, శరీరంలో చీము, నెత్తురు స్రవిస్తాయ్ కానీ శరీరం సుష్కించిపోతుందని చెబుతాడు. దాంతో ఆ శాపానికి ప్రాయశ్చిత్తం లేదా.? అని ప్రాధేయపడగా కలియుగాంతంలో మళ్లీ తాను జన్మిస్తానని, అమ్మ కడుపులో వున్న తనను కాపాడే బాధ్యత నీదే అని అశ్వత్థామ వద్ద వున్న మణిని లాగేసుకుంటాడు. కట్ చేస్తే కథ కాశీకి వెళుతుంది. కాశీలో పాపం పెరిగిపోయి వున్న వనరులన్నీ ఎండిపోయి ప్రజలు నానా కష్టాలు పడుతుంటారు. మరోవైపు కాంప్లెక్స్ అనే నగరాన్ని సుప్రీమ్ యాష్కిన్ (కమల్ హాసన్) ఏలుతుంటాడు. భూమ్మీద వున్న అన్ని వనరుల్నీ లాగేసుకుంటూ కాంప్లెక్స్‌కి నాయకుడిలా చెలామనీ అవుతుంటాడు. అదే క్రమంలో గర్భిణీ స్ర్తీల నుంచి సీరమ్ తీసుకునే ‘ప్రాజెక్ట్ కె’ అనే ప్రయోగం చేస్తుంటారు కాంప్లెక్స్‌లో. అందుకోసం కాశీలోని గర్భిణీ స్ర్తీలను కాంప్లెక్స్‌కి ఎత్తుకొచ్చి వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమతి (దీపికా పదుకొనె) కూడా కాంప్లెక్స్ గ్యాంగ్‌కి చిక్కుతుంది. అయితే, వారి నుంచి ఎలాగోలా తప్పించుకుంటుంది సుమతి. ఆమెని వెతికి పట్టుకుంటే ఊహించని యూనిట్స్ (డబ్బు) ఇస్తామని ప్రకటిస్తాడు సుప్రీమ్ అండ్ కో. డబ్బు కోసం ఏదైనా చేసి కాంప్లెక్స్‌కి వెళ్లిపోవాలని ధ్యేయంగా పెట్టుకుంటాడు భైరవ (ప్రబాస్). కాంప్లెక్స్ ప్రకటన తెలిసి సుమతిని ఎలాగైనా పట్టుకుని అప్పగించాలనుకుంటాడు. కాంప్లెక్స్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన సుమతిని అశ్వత్ధామ కాపాడతాడు. తమను కాపాడే తల్లి, దేవుడ్ని తన కడుపులో మోస్తున్న మాతృమూర్తి తమ లోకానికి వస్తుందని ఎదురు చూస్తుంటుంది మూడో లోకం షంబాలా. మరి, భయంకరమైన కాంప్లెక్స్ గూండాల నుంచి సుమతిని అశ్వత్ధామ కాపాడాడా.? ఆమె కడుపులో దేవుడు ప్రసవించాడా.? భైరవ తాను అనుకున్నది సాధించాడా.? తెలియాలంటే ‘కల్కి’ సినిమా ఖచ్చితంగా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ముఖ్యంగా ఈ సినిమాకి హీరో అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. 80 ఏళ్ల వయసులో ఆయన చేసిన పోరాట ఘట్టాలు అశ్వత్ఢామ పాత్ర (యంగ్ అండ్ ఓల్డ్ )లో ఆయన ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. నాగ అశ్విన్ ఆయన పాత్రను అంత చక్కగా తీర్చి దిద్దారు. అలాగే దేవుడ్ని తన కడుపులో మోస్తూ ఆ బిడ్డను కాపాడుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలు.. దీపికా పాత్రను నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాయ్. ఇక హీరోగా నటించిన  భైరవ పాత్రలో ప్రబాస్,  ఫ్యాన్స్‌ని పూర్తిగా సంతృప్తిపరిచేసినట్లే. ఈ మధ్య ప్రబాస్ సినిమాలు చాలా చాలా డిజప్పాయింట్ చేస్తున్నాయ్ ఫ్యాన్స్‌ని. దాన్నుంచి ‘కల్కి’ కంప్లీట్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఇంకా సీక్రెట్ కాస్టింగ్ చాలానే వుంది. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కొన్ని సెకన్ల పాటు కనిపిస్తాడు. భైరవని చిన్నతనంలో పెంచి పోషించిన పాత్రలో దుల్కర్ కనిపించాడు. అలాగే, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, శోభన, రాజేంద్రప్రసాద్, స్టన్నింగ్ రోల్స్ రాజమౌళి, ఆర్జీవీ, దర్శకుడు అనుదీప్, ఫరియా అబ్ధుల్లా, బ్రహ్మానందం తదితర పాత్రలు ఆయా పాత్రల పరిధి మేర అలా వచ్చి వెళ్లిపోతాయ్.

సాంకేతిక వర్గం పని తీరు:
ఈ సినిమాని ఏదో మామూలు సినిమాగా చెప్పలేము. నిజంగా విజువల్ వండరే అని చెప్పొచ్చు. ఇలాంటి ఓ విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు నాగ్ అశ్విన్ తీసుకున్న ఈ టైమ్ చాలా తక్కువే అని కూడా చెప్పొచ్చు. డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ స్టామినా గురించి ఓ ఐడియా వుంది కానీ, అది ఈ రేంజ్‌లో బయటపడుతుందనయితే ఊహించలేదు. సో, ‘కల్కి’ అటెంప్ట్‌కి నాగ్ అశ్విన్‌కి నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంత అసంత‌ృప్తి వుంది. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ లార్జ్ స్కేల్‌ని మ్యాచ్ చేయలేకపోయింది. బట్ ఓకే. ఎడిటింగ్ విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో కొన్ని కత్తెరలు పడాల్సి వుంది. సినిమాటోగ్రఫీ జోర్డ్యే స్టోజిల్జ్కోవిచ్ అద్భుతమైన విజువల్ అందించాడు. నిర్మాత అశ్వనీదత్ చెప్పినట్లుగానే ఈ సినిమాతో తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఉన్నతమైన నిర్మాణ విలువలు అందించారు. సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు తెలుగులో కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయ్ ఎందుకో. డబ్బింగ్ సినిమా ఫీల్ తీసుకొస్తాయ్.

ప్లస్ పాయింట్స్:
అశ్వత్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్, సెకండాఫ్, అమితాబ్ మరియు భైరవ మధ్య గూస్ బంప్స్ తెచ్చే ప్రతీ యాక్షన్ సన్నివేశం, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ట్విస్ట్..

మైనస్ పాయింట్స్:
బోరింగ్‌గా సాగిన ఫస్టాఫ్, వీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్యాప్ ఫిలింగ్స్ క్యారెక్టర్స్,

చివరిగా:
ఫ్లాస్ వెతక్కుండా మూడు కాలాల నేపథ్యమున్న ఓ డిఫరెంట్ విజువల్ వండర్‌ని ఎంజాయ్ చేయాలంటే ‘కల్కి 2898ఏడీ’ ధియేటర్ల‌లో నిరభ్యంతరంగా చూడొచ్చు.

Gulf & Asia-Pacific terrirtories distributed by Marudhar &FunAsia...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com