ఎల్ కే అద్వానీకి అస్వస్థత..

- June 27, 2024 , by Maagulf
ఎల్ కే అద్వానీకి అస్వస్థత..

న్యూ ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్య సమస్యతో బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 96ఏళ్ల అద్వానీ వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు.ఎయిమ్స్ యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తనను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన క్షేమంగా ఉన్నారు. ఇటీవల, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీని కలిశారు. ఈ సమావేశాల్లో అద్వానీ సోఫాలో కూర్చొని కనిపించారు. ఈ ఏడాది మార్చి 30న లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్నతో సత్కరించిన సంగతి తెలిసిందే. అద్వానీ వయస్సు, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సన్మానాన్ని ఆయన నివాసంలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 2015 సంవత్సరంలో అద్వానీకి దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించిన లాల్ కృష్ణ అద్వానీ 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1942లో ఆర్‌ఎస్‌ఎస్‌లో వాలంటీర్‌గా చేరారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన పార్లమెంటరీ జీవితంలో ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. హోంమంత్రిగా కూడా పనిచేశారు. అతను అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికలకు ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు. ఆ తర్వాత 15వ లోక్‌సభలో సుష్మా స్వరాజ్‌ ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. బీజేపీను ప్రధాన రాజకీయ పార్టీగా జాతీయ స్థాయికి తీసుకురావడంలో లాల్ కృష్ణ అద్వానీ సహకారం చాలా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com