విశ్వ నట చక్రవర్తి ... !
- July 03, 2024
కను బొమ్మలతోనే నవరసాలు పండించగల గొప్ప నటుడు… చార్లీ చాప్లిన్ వంటి గొప్ప నటుడితోనే ప్రసంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తి .. నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు నట యశస్వి ఎస్వీఆర్. ఈ పేరు ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. ఏ పాత్రలో అయిన ఇట్టే ఇమిడిపోయే మహా నటుడు. హస్యాన్ని అయినా.. కుటుంబకథా చిత్రమైన ..ఆయన పాత్ర ఉందంటే.. ఆ పాత్రకే పేరు వచ్చేది. నేడు సుప్రసిద్ధ నటుడు, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు గారి జయంతి.
ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు. 1918, జూలై 3న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో కోటీశ్వరనాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించారు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య నాయుడు ప్రముఖ రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. ఆయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగారు. మద్రాస్, విశాఖపట్నం, కాకినాడ పట్టణాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.
బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా పెద్దగా పని లేకపోవడం కారణంగా, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. విద్యార్ధి దశలోనే ఎస్వీఆర్ కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అతనుకు ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో ఎస్వీఆర్ అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో ఇరవై రెండేళ్ళ వయసులోనే అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. ఆయనకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటక రంగంలో సంపాదించిన అనుభవంతో బంధువైన బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. తన తొలి సినిమాలో రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో అవకాశాలు మళ్ళీ రాలేదు. కొన్ని సంవత్సరాలు తర్వాత బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఎ. వి.సుబ్బారావుకు ఇచ్చేశారు. బి.ఎ.సుబ్బారావుతో ఆయనకున్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కింది.
ఆ తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా ఎస్వీఆర్ నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగారు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు.
విజయ సంస్థలో ప్రవేశించడం ఎస్వీఆర్ కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైననేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ అందుకున్నారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరవాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన శకం మొదలైంది.
జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి నటుడిగా ఎస్వీఆర్ కీర్తి గడించారు. మన పౌరాణిక పాత్రలకు ఆయనలా జీవం పోసిన నటుడు మరొకరు లేరు. ఇప్పటికీ ఘటోత్కచుడు, దుర్యోధనుడు, రావణబ్రహ్మ పాత్రలను ఆయనంత ఎనర్జిటిక్ గా పోషించగల నటుడు పుట్టలేదు. అందుకు ఆయన చేసిన ఎన్నో పౌరాణిక పాత్రలే నిదర్శనం. పాత్ర స్వభావాన్ని, భావాన్ని.. కళ్లలోనూ.. శరీరంతోనూ ఏకకాలంలో పలికించిన మేరునటధీరుడు ఎస్వీఆర్.
తెరమీద అనితర సాధ్యమైన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించటంలో మహానటుడు. సంస్కృత పద భూయిష్టమైన సమాసాలతో కూడిన సంభాషణలను అర్థం చేసుకొని, అవలీలగా పలికిన స్వరభాషణుడు. సంభాషణలు పలకటంలో ఆ స్వరం ఓ మాయాజాలం. స్వరం తగ్గించి, సంభాషణలో, భావ వ్యక్తీకరణలో ఎవరికీ సాధ్యం కాని ఒకానొక ఒడుపు ప్రదర్శించటం ఒక్క ఎస్వీఆర్ కి మాత్రమే సాధ్యం.
బానిసలకింత అహంకారమా.. అంటూ ఎస్వీఆర్ ఘీంకరిస్తే ఆ నటనకు ప్రేక్షకులంతా బానిసలైపోయారు. సాహసం చేయరా డింభకా అని ఆదేశిస్తే హైహై నాయకా అనేశారు. ఇక పౌరాణికాల్లో భక్త ప్రహ్లాద ఆయన ప్రతిభకు ఓ మెచ్చుతునక. శ్రీహరిని ద్వేషించే దానవరాజుగా ఆయన నటన అనన్య సామాన్యం. నిజానికి ప్రహ్లాదుడిపై ప్రేక్షకుల్లో అంత సానుభూతి కలగడానికి కారణం ఎస్వీఆర్ కఠినమైన విలనీయే.
తెలుగు సినిమా గమనాన్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజిస్తే పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికంగా చూడొచ్చు. ఈ నాలుగు విభాగాల్లోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నట శిఖామణి ఎస్వీఆర్. పౌరాణికాల తర్వాత జానపదాల్లోనూ ఆయన నట విశ్వరూపం నేటికీ ఎందరికో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్స్ గా ఉన్నదంటే ఒప్పుకుని తీరాల్సిందే. ఆహార్య, ఆంగిక, వాచకాభినయాల్లో పాత్ర స్వభావాన్ని రంగరించి తెరపై ఆవిష్కరించిన పరిపూర్ణ నటుడు
గంభీరమైన విగ్రహం, దానికి తగ్గ స్వరం, సంభాషణ చతురత, నవరసాలను ప్రదర్శించే వదనం ఆయన సొత్తు. ఒకే సన్నివేశం లో భిన్న హావభావాలను క్షణ కాలం మార్చి, చూపించగల ప్రతిభ వారిది. నవ్వించడం లో ఎంత ఘటికుడో, ప్రేక్షకుల చే కన్నీరు పెట్టించే విషాదము పలికించగలడు. వారు తెలుగు గడ్డ పై పుట్టడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. భారతదేశ ఎల్లలు దాటి విదేశంలో ప్రశంసలు అందుకొని తెలుగు జాతి కీర్తిని పెంచారు. చిరంజీవిలా ప్రేక్షకుల, అభిమానుల గుండెల్లో కొలువయ్యారు.
ఎస్వీఆర్ జీవించింది కేవలం 54 ఏళ్ళు. కానీ 500 ఏళ్లకు సరిపడా కీర్తి సంపాదించగలిగారు, చనిపోయి 50 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు సత్కారాలు, పురస్కారాలు కాదు కళాకారునికి కావలసింది. కావలసింది ప్రేక్షకుల చప్పట్లు , అభినందనలు..ఆ విషయంలో ఎస్వీఆర్ గారిది ప్రథమ స్థానమే. ఆయన నటించిన పాత్రలు వేలాది అభిమానుల హృదయాల్లో నిత్యం నిలిచే ఉంటాయి.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!