బిగ్ బుల్ ఆఫ్ ఇండియా... !

- July 05, 2024 , by Maagulf
బిగ్ బుల్ ఆఫ్ ఇండియా... !

స్టాక్‌ మార్కెట్‌ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న భయాలున్న భారత్‌కు పెట్టుబడి పాఠాలు నేర్పిన గురువు ఇక లేరు.. మార్కెట్‌లో డబ్బును ఎలా మదుపు చేయాలో సువర్ణ సూత్రాలను ఆయన లిఖించారు. మార్కెట్‌ కుంగిన సమయంలో పెట్టుబడికి వెనుకాడే చాలా మందిలోని భయాలను దూరం చేసి చూపించారు. కుంగిన సమయంలో మంచి షేర్లను ఒడిసిపట్టి.. పెరిగిన సమయంలో లాభాలను స్వీకరించే ఫార్ములాను భారత యువతకు పరిచయం చేసిన స్టాక్ మార్కెట్ దిగ్గజం, వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి గాంచిన స్వర్గీయ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. నేడు స్టాక్ మార్కెట్ బిజినెస్ మాగ్నెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జన్మదినం.

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును ప్రాంతం నుంచి ముంబయికి వలస వచ్చిన మార్వాడీ కుటుంబానికి చెందిన రాధేశ్యామ్‌ దంపతులకు 1960 జులై 5న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి  రాధేశ్యామ్‌ ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగి కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రాకేష్ కుటుంబం నివసించింది. చివరిగా తమ సొంతూరైన ముంబైలో స్థిరపడ్డారు. రాకేష్ తండ్రికి స్టాక్‌ మార్కెట్‌లో మదుపు(investment)చేసే అలవాటుంది. ఇంటి దగ్గర తన స్నేహితులతో ఆ విషయాల్ని తరచూ చర్చించేవారు. వారి మాటలు వింటూ పెరిగిన రాకేష్ సైతం స్టాక్ మార్కెట్ మీద ఆసక్తిని పెంచుకున్నారు.

17 ఏళ్లు వచ్చేసరికి మార్కెట్‌లో మదుపు చేయడం మొదలు పెట్టారు. ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. డిగ్రీ తర్వాత ట్రేడింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటానని తండ్రితో చెబితే... 'మనకి కుటుంబ వ్యాపారాలూ, తరగని సంపదా లేవు. నీకు ఇష్టమైన పని చేయడాన్ని కాదనను. అయితే, స్టాక్‌ మార్కెట్‌ రిస్కుతో కూడుకున్నది. నువ్వు అక్కడ నిలదొక్కుకుంటే సరే, లేకపోతే ఏంటన్నది కూడా ఆలోచించాలి. అందుకే సీఏ పూర్తిచెయ్యి' అని చెప్పారాయన. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో 1984 చివర్లో రాకేష్ సీఏ పూర్తి చేశాడు.

రాకేష్ 1985లో కేవలం ₹ 5,000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట టాటా పవర్‌, టాటా టీ షేర్లు కొన్నారు. ముఖ్యంగా టాటా టీ షేరు మూడు నెలల్లోనే మూడు రెట్ల లాభం వచ్చింది. ఆ లాభాలతో ఇనుము తవ్వకం జరిపే 'సెసా గోవా'లో నాలుగు లక్షల షేర్లు కొని ఏడాది తర్వాత పావు వాటా మాత్రమే ఉంచుకుని మిగతావి అమ్మేశా. ఆ డబ్బుని వేర్వేరు కంపెనీల్లో పెట్టగా. వాటిలో టైటాన్‌ అతనికి ఊహించని లాభాల్ని తెస్తూ వచ్చింది.

రాకేష్ మాటల్లోనే తన ప్రయాణం గురించి, భారత్‌ అభివృద్ధి వైపు జోరుగా పరుగులు తీస్తున్నపుడు మదుపరిగా ఉండటం అనుకూలించింది. 1993 నాటికి మార్కెట్‌లో నా షేర్ల విలువ రూ.200కోట్లకు పెరిగింది. రాజకీయ అనిశ్చితి, కార్గిల్‌ యుద్ధం, వైటూకే భయంవల్ల 1996-2002 మధ్య స్టాక్‌ మార్కెట్‌ సూచీ కొన్నేళ్లపాటు పడకేసింది. దాంతో 2002 నాటికీ నా షేర్ల విలువ రూ.250కోట్లుగానే ఉంది.

మార్కెట్‌ పడినపుడు పెట్టుబడి పెంచడం, పైకెగిసినపుడు లాభాలు స్వీకరించడం నేను పాటించే నియమం. అందుకే సూచీ పడుతున్న సమయంలో అప్పుచేసి మరీ మార్కెట్‌లో పెట్టా. 2002 నాటికి నా షేర్లలో 40 శాతం అప్పులతో కొన్నవే. 2002-03లో మళ్లీ అనుకూల పవనాలు రావడంతో ఏడాదిలో మా షేర్ల విలువ రెట్టింపు కంటే ఎక్కువైంది. ఓవైపు ట్రేడింగ్‌ చేస్తూనే 'రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌' పేరుతో బ్రోకరేజీ సంస్థనూ ప్రారంభించా.

1990-91, 2002-03, 2020-21... ఆర్థిక సంవత్సరాల్లో నా షేర్ల విలువ దాదాపు రెట్టింపు అవుతూ వచ్చింది. స్థిరాస్తి, మైనింగ్‌, రిటైల్‌, ఆయిల్‌, వైద్యసేవలు, బ్యాంకింగ్‌, తయారీ, ఔషధతయారీ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొంటా. 2003-04లో సిమెంట్‌ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. దాన్ని ఊహించలేకపోయా. కాబట్టి నా ఆలోచనలూ వంద శాతం కచ్చితంగా ఉంటాయనుకోవడానికి లేదు.

'డి-మార్ట్‌' వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ, ఆయన సోదరుడు రమేష్‌, రాజీవ్‌ షా... మేమంతా చర్చించుకుని షేర్లను కొనుగోలు చేసేవాళ్లం. నా ఆస్తిలో అధిక భాగం మార్కెట్లో షేర్ల రూపంలోనే ఉంది. కొన్ని షేర్లతో నాది దశాబ్దాల అనుబంధం. రూ.1.5లక్షల కోట్ల విలువ చేసే టైటాన్‌ మార్కెట్‌ విలువలో నాకూ, రేఖకూ 4.8 శాతం వాటా(రూ.7200కోట్లు) ఉంది. టాటా మోటార్స్‌లో రూ.1500 కోట్లు, రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌లో రూ.1000 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని షేర్లలో డబ్బు పోగొట్టుకున్నా కానీ, దాన్ని అనుభవంగానే భావించాను తప్ప నష్టంగా చూడలేదు.

ట్రేడింగ్‌ చేసే తీరు మానసిక, వాస్తవ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ అంటేనే రిస్కు. నేను ఆ రిస్కుకి సిద్ధపడే వచ్చా. మార్కెట్‌లో రూ.5000 అప్పుచేసి పెట్టడమే జీవితంలో నేను చేసిన అతిపెద్ద రిస్కు. జ్యువెలరీ, బ్యాంకింగ్‌, ఫార్మా, హోటల్స్‌, అంకుర సంస్థలు ఇలా ప్రతి రంగం గురించీ లోతుగా తెలుసుకోవడం కష్టమే. అయినా నిత్యం సమాచారం సేకరిస్తూ కొత్తగా పెట్టుబడులు పెడతా. అలాగని పెద్ద ప్రణాళికలేవీ వేసుకోను.

ప్రతిసారీ విజయవంతం కాలేం. నేర్చుకుంటూనే ఉండాలి. అరుదుగా స్టాక్‌ మార్కెట్‌ బయటా పెట్టుబడులు పెడతా. నిర్మాతగా మారి బాలీవుడ్‌లో సినిమాలూ (ఇంగ్లిష్‌-వింగ్లిష్‌, షమితాబ్‌, కీఅండ్‌కా) తీశా. 'ఆకాశ' పేరుతో ఓ విమానయాన సంస్థని మొదలుపెడుతున్నా. దీన్లో నా పెట్టుబడి రూ.300కోట్లు(40 శాతం) ఉంటుంది.

భారతీయుల తలసరి ఆదాయం ఇంకాస్త పెరిగితే చాలు విమానయానం చేసేవాళ్లు ఒక్కసారిగా రెట్టింపు అవుతారు. వారిని ఆకర్షించేలా అత్యంత చౌక ధరల విమానయాన సంస్థని వచ్చే ఏడాది తేబోతున్నాం. చాలామంది ఈ రంగంలో నష్టపోతున్న కంపెనీల్ని గుర్తు చేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లోనూ చాలామంది నష్టపోతున్నారని వాళ్లకి బదులిస్తున్నా. ఏటా లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారు. వారి ఆరోగ్యం, చదువులూ, ఉద్యోగాలూ, సరదాలూ, విలాసాలూ, కనీస అవసరాలే మనకు అవకాశాలు.  

భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం, యుద్ధాల్లాంటి ఒడుదొడుకుల్ని తట్టుకుని నిలబడింది, కరోనానూ దాటుతుంది. విదేశీ పెట్టుబడిదారులు డబ్బు పట్టుకుని ఇండియా వైపు చూస్తున్నారు. నేను యువతకు ఒకటే చెబుతా... దేశం గురించి ఆశావాదంతో ఉండండి. మనం అద్భుతమైన ప్రగతిని చూడబోతున్నాం. త్వరలోనే 10 శాతం వృద్ధి సాధిస్తాం. నేను అదృష్టాన్ని నమ్ముతాను. అయితే, మనం శ్రమించడం మానేయకూడదు. మెదడుకు పని చెప్పండి. రిస్కులకు సిద్ధపడండి. కాకపోతే అవి కోలుకోలేనివిగా ఉండకూడదు.

నా శ్రీమతి పేరు రేఖ. మా స్టాక్‌ బోక్రింగ్‌ సంస్థకు 'రాకేష్‌- రేఖ'లలోని ఆంగ్ల అక్షరాలను కలిపి 'రేర్‌' అని పేరు పెట్టా. నా విజయంలో తన పాత్ర కూడా ఉంది. తనకు సహనం, ఓపిక ఎక్కువ. అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం. కానీ అమ్మకు ఆరోగ్యం బాగాలేక మంచం పట్టి నపుడు తనే దగ్గరుండి అన్నీ చూసుకునేది. మాకో అమ్మాయి. మా పెళ్లి అయిన 17 ఏళ్లకు 2004లో పుట్టింది. 2009లో అబ్బాయిలు(కవలలు) పుట్టారు. పిల్లలకి మధ్య తరగతి జీవనశైలిని అలవాటు చేస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదివే స్కూల్లోనే చేర్పించా. ఒకప్పుడు వారాంతాల్లో రేసుల్లో పాల్గొనేవాణ్ని.

అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చేవాణ్ని. దాంతో నా భార్య ఇబ్బంది పడేది. పిల్లలు పుట్టాక వారాంతాలు వారికోసం కేటాయిస్తున్నా. జీవితంలో పశ్చాత్తాప్పడే అంశాలు ఏవైనా ఉన్నాయంటే నా అలవాట్లే. సిగరెట్లూ, మందూ ఎక్కువగా తాగేవాణ్ని. తిండిపైనా నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు సిగరెట్లు మానేశా. మందూ, తిండీ తగ్గించేశా. కానీ అప్పటికే వాటివల్ల కొంతమేర ఆరోగ్యం పాడైంది. గతాన్ని మార్చుకునే ఆస్కారం నాకు లేదు. కానీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం యువతకు ఉంది. అందుకే ఈ మాటలు చెబుతున్నా!

స్టాక్ మార్కెట్ ద్వారా సంపదను రెట్టింపు చేసుకోవచ్చనే ఆశను భారతీయుల్లో కల్పించిన స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2022 ,ఆగస్టు 14న     తన 62వ యేట ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.46వేల కోట్లు. దీన్లో సింహ భాగం స్టాక్‌ మార్కెట్‌ ద్వారానే సంపాదించారు. ఝున్‌ఝున్‌వాలా ప్రయాణం కేవలం ఔత్సాహిక మదుపర్లకే కాదు, కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శం. 


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com