విలక్షణ నటుడు-కోట
- July 10, 2024
వెండితెర మీద విలన్‌గా ముచ్చెమటలు పట్టిస్తాడు.. తన మాటలతో అందరిని నవ్విస్తాడు. మధ్య తరగతి తండ్రిగా.. అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా.. హత్యలు చేసే గుండాగా.. కామెడీ విలన్‌గా.. ఇలా ఒక్కటేమిటి… ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. తెలుగు వారు అయిన.. వెండి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగునాట ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాస్ రావు భర్తీ చేశారనడంలో సందేహం లేదు. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాస్ రావుకు అభిమానులు కూడా ఎక్కువే. నేడు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు.
కోట శ్రీనివాసరావు 1947 జులై 10న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర్లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి కోట సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో ఉండేవారు. ఆయన కోట శ్రీనివాసరావుని తన లాగే డాక్టర్‌ని చేయాలని భావించారు. కానీ, మొదటి నుంచి కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న కోట శ్రీనివాసరావు, తొలుత రంగస్థలంపై నటించారు. ఎన్నో నాటికలు, నాటకాలను పదేపదే వేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయనకు 'ప్రాణం ఖరీదు' సినిమాలో అవకాశం వచ్చింది. 'ఎవరో కోట శ్రీనివాసరావుట... స్టేజి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చి నటించేస్తున్నాడు' అంటూ టాక్ మొదలైంది.
నటన పట్ల ఉన్న ఆసక్తి కారణంగా బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకున్న ఆయన, ఇక పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి పెట్టారు. అలా కొంతకాలం పాటు వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లిన ఆయనకి, ‘ప్రతిఘటన‘ సినిమాతో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో దుర్మార్గుడైన రాజకీయ నాయకుడిగా ‘కాశీ’ పాత్రలో ఆయన జీవించారు. కొత్త మేనరిజంతో సరికొత్త విలనిజానికి ఆయన తెరతీశారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అందులోని విలన్ పాత్రను గురించి మాట్లాడుకోవడం విశేషం .. అదే కోట ప్రత్యేకత.
ఇక అప్పటి నుంచి తెలుగు కథలో హీరోను టెన్షన్ పెట్టేసే ఒక పవర్ఫుల్ విలన్ దొరికిపోయాడు. విలన్ కేటగిరిలో వేషం ఏదైనా .. యాస ఏదైనా అందుకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ ను మార్చేస్తూ డైలాగ్స్ చెప్పడంలో కోట సిద్ధహస్తుడు. బాడీ లాంగ్వేజ్ కీ .. డైలాగ్ కి ఎక్స్ ప్రెషన్ ను మ్యాచ్ చేస్తూ, లోతైన ద్వేషం .. విరుగుడు లేని విలనిజం చూపించడంలో ఆయనకి ఆయనే సాటి. డైలాగ్ ను ఎలా విడగొట్టాలో .. సన్నివేశాన్ని ఎలా పదునెక్కించాలో ఆయనకి బాగా తెలుసు. ‘శత్రువు’ .. ‘గణేశ్’ తరహా సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి.
ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన 'ప్రతిఘటన' చిత్రం కోట శ్రీనివాసరావులోని నటనకి పరాకాష్టగా నిలిచింది. సమాజంలో అవినీతి, రాజకీయాల్లో నేరప్రవృత్తిపై దర్శకుడు టి.కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'ప్రతిఘటన'. విజయశాంతి నాయిక. కోట శ్రీనివాసరావు రాజకీయనాయకుడిగా తెలంగాణ మాండలికంలో అదరగొట్టారు. ఎంవీఎస్ హరనాథరావు పదునెక్కిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో...' అనే పాటకి నేపథ్య గాయని నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నటిగా విజయశాంతి కూడా నంది అవార్డుని స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా 'ప్రతిఘటన' అనేక అవార్డులను పొందింది. ఈ సినిమా కోట నట జీవితానికి గట్టి పునాదిని వేసింది.
సీరియన్ విలన్‌గా రాణిస్తున్న సమయంలోనే జంధ్యాల హాస్య నటుడిగా కోట శ్రీనివాసరావును మరో కోణంలో చూపించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. డాక్టర్ రామానాయుడు నిర్మించిన 'అహ నా పెళ్లంట' చిత్రంలో పిసినారిగా కోట ప్రదర్శించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. 'సాహసం సేయరా డింభకా', 'చూపులు కలసిన శుభవేళ', 'ప్రేమా జిందాబాద్', 'హై హై నాయకా', 'బావ బావ పన్నీరు', 'జయమ్ము నిశ్చయమ్మురా'... ఇలా జంధ్యాల మార్క్ సినిమాల్లో హాస్యాన్ని పండించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రౌడీ అల్లుడు', 'సుందర కాండ', 'బొంబాయి ప్రియుడు', 'అన్నమయ్య' లాంటి చిత్రాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారు.
కామెడీనే కాదు .. కంటతడి పెట్టించడం కూడా కోటకి బాగా తెలుసు. మచ్చుకు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఒక వైపున కొడుకు అంటే ప్రేమ … మరో వైపున కోడలు అంటే కూతురంతటి అనురాగం .. కానీ ఆమెకి సంతానం కలగదని తెలిసి, వంశాంకురం కోసం తపించిపోయే పాత్రలో ప్రేక్షకులు కొత్త కోట శ్రీనివాసరావును చూస్తారు. కోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే. వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడి హిట్టయింది.
ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’లో ఈ జంట చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్లిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. ఇక ‘హలో బ్రదర్’ సినిమాలోని ‘తాడి మట్టయ్య’ పాత్ర కూడా ఆయన ఎమోషన్ కి సరిహద్దుగా నిలిచేదే. ఇలా ఒకటా .. రెండా .. 4 దశాబ్దాలకి పైగా ఆయన చేసిన ప్రయాణం గురించి 4 పేరాల్లోనో .. 4 పేజీల్లోనో చెప్పుకోలేం. కోట చేసిన విభిన్నమైన సినిమాలు … వైవిధ్యమైన పాత్రలను గురించి చెప్పుకోవాలంటే, అసమానమైన ఆయన అభినయంపై రాసిన ఒక గ్రంథం గురించి మాట్లాడుకోవడమే అవుతుంది.
సీరియస్ విలన్ గా … కామెడీ టచ్ తో కూడిన విలన్ గా .. కార్పొరేట్ విలన్ గా .. విలేజ్ స్థాయి విలన్ గా ఇలా విలనిజంలో కోట శ్రీనివాసరావు తన విశ్వరూపం చూపించారు. రంగస్థలంపై తనకి గల అపారమైన అనుభవంతో ఆయన ప్ర్రేక్షకులను కట్టిపడేశారు. విలనిజాన్ని కొత్తదనం దారుల్లో .. కొత్త తరం తీరాల్లో పరుగులు తీయించారు. ఆయన వంట్లో ఓపిక తగ్గేవరకూ ఆయనలోని విలనిజాన్ని ఎవరూ ఎదుర్కోలేపోయారు .. మరే విలన్ కూడా ఆయన దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. అందువల్లనే ‘పద్మశ్రీ’ పురస్కారం ఆయనను అలంకరించింది. 1999లో బీజేపీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
తెలుగు తెరకి మున్ముందు చాలామంది ప్రతినాయకులు పరిచయం కావొచ్చు. కోట ప్రభావం వాళ్లపై పడవలసిందే తప్ప, వాళ్ల ప్రతిభ కోటను మరిచిపోయేలా ఎప్పటికీ చేయలేదు. ఎందుకంటే ఇంతకాలం పాటు … ఇన్ని విలక్షణమైన విలన్ పాత్రలు మరొకరికి దక్కే అవకాశాలు లేవు .. రావు. అందుకే విలన్లు ఎందరు వచ్చినా కోట ఒక్కడే .. కోట అంటే కోటికి ఒక్కడే.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







