ప్రజా బంధు-ఇరిగినేని
- July 20, 2024
ఈ పెద్దాయన గురించి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియక పోవచ్చు కానీ 1980 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి మరకలు అంటని అతి కొద్ది మందిలో ఒకరు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి లకు అత్యంత ఆత్మీయులు వీరు.ఇంతటి గొప్ప వ్యక్తి పేరు ఇరిగినేని తిరుపతి నాయుడు.ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మెట్టసీమలో కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ కనిగిరి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించారు.
దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు గుజ్జుల యల్లమందా రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తిరుపతి నాయుడు అతి పిన్న వయస్సు లోనే తన స్వగ్రామమైన మోపాడు గ్రామ సర్పంచిగా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1981లో కాంగ్రెస్ కంచుకోట కనిగిరి సమితికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి కనిగిరి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయుడు ఆనాటి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఏంతో కృషి చేశారు. అయితే ఎన్టీఆర్ పార్టీలో వీరంటే గిట్టని కొందరి చెప్పుడు మాటలు విని 1983 లో కనిగిరి టిక్కెట్ వీరికి కాకుండా వేరొకరికి ఇచ్చిన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు.1985లో ఎన్నికల్లో సైతం చంద్రబాబు నాయుడు కారణంగా టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ అనుచరుల ఒత్తిడి మేరకు టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
నాయుడు శక్తి సామర్ధ్యాలను గ్రహించిన అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికి తెలుగుదేశం పార్టీ హవాలో కనిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా ఉంది.అటువంటి సమయంలో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని తిరిగి బలోపేతం చేశారు.
1989లో కనిగిరి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే గా కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.కనిగిరి, పామూరు రోడ్ల విస్తరణ మరియు ఫ్లోరైడ్ బాధితులు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, ఎన్నో పనులు చేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనం లో ఓటమి పాలైన తిరిగి 1999, 2004లలో ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2009 లో రాజకీయాల నుండి విరమణ పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ మెట్టసీమ రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తన బంధువైన అప్పటి మంత్రి మాదాల జానకీరామ్ ద్వారా ఉమ్మడి ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకెళ్లడమే కాకుండా, ఫ్లోరైడ్ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సల కోసం పదుల సంఖ్యలో స్పెషల్ హాస్పిట్స్ ఏర్పాటు చేయించారు. ఫ్లోరైడ్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. 2004 లో వైఎస్ మంత్రి వర్గంలో చేరే అవకాశం వచ్చినప్పుడు కూడా యువతకు అవకాశం కల్పించాలని కోరుతూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
తన రాజకీయ జీవితంలో నాయుడు కుల మతాలకు అతీతంగా అందరి వాడుగా నిలిచి పోయారు. ఇరిగినేని అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు నాయకులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన నిరాడంబరమైన జీవితం. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఉన్న ఆస్తులను కరగ దీసుకున్నారు తప్పించి ఇప్పటి ప్రజా ప్రతినిధులు లాగా ఆస్తులు కూడ బెట్టలేదు. అవినీతికి ఆమడ దూరం నిలుస్తూ కనిగిరి, కందుకూరు, ఉదయగిరి , ఆత్మకూరు నియోజకవర్గాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన పనులు చేసేవారు.
బాబ్రీ అల్లర్లు జరిగిన సమయంలో కనిగిరిలో ఉన్న మైనారిటీ వర్గాలకు అండగా నిలిచారు. నాయుడు గారంటే వారికి చాలా గౌరవం. ఇప్పటికి వారు ఏ పార్టీకి ఓటేసిన వ్యక్తిగతంగా మాత్రం ఆయన అభిమానులుగానే కొనసాగుతున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచిన నాయుడు గారు చివరి వరకు విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నారు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించిన వ్యక్తి ఆయన.నిస్వార్థ ప్రజా జీవితానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి భావితరానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు తిరుపతి నాయుడు గారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







