కార్గిల్ విజయ్ దివస్..!
- July 26, 2024
కార్గిల్ యుద్ధం..1999 మే-జూలై మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి ప్రతి భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మట్టికరిపించి.. ‘‘మా దేశాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి’’ అని పరోక్షంగా భారతీయులందరూ ఆ దేశానికి ఇచ్చిన హెచ్చరిక. దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్ నేమ్.. ‘ఆపరేషన్ విజయ్’. ఇక ఆ యుద్ధంలో అమర జవాన్ల పోరాటాన్ని స్మరించేందుకు భారత్ ఏటా జూలై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ్టికి ‘విజయ్ దివస్’కు 25ఏళ్లు కావడం విశేషం.
కార్గిల్ యుద్ధానికి మొదటి కారణం పాకిస్తాన్ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడటం.1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్థాన్ మధ్య శాంతియుత లాహోర్ ఒప్పందం జరిగింది. దీని ద్వారా జమ్మూకాశ్మీర్ విషయంలో రెండు దేశాలూ దౌత్యపరంగా, శాంతియుతంగా పరిష్కారం చూపుకోవాలని అనుకున్నాయి. కానీ పాకిస్థాన్ సైన్యం కుట్రలు పన్ని… ఉగ్రవాద మూకల్ని భారత భూభాగంలోకి పంపాయి. దానికి ‘ఆపరేషన్ బద్ర్’ అనే పేరు పెట్టాయి.
కాశ్మీర్, లఢక్ మధ్య లింక్ తెగ్గొట్టి… సియాచిన్ హిమ పర్వతాల నుంచీ భారత్ సైన్యాన్ని పంపేయాలన్నది పాక్ కుట్ర. మొదట్లో పాకిస్తాన్.. ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా వెల్లడించినప్పటికీ.. యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉన్నట్లు రుజువైంది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద ఈ యుద్ధం జరగడం వల్ల ఇరు దేశాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. గడ్డకట్టే చలిలో.. పర్వతాల్లో ఏ మాత్రం సహకరించని వాతావరణంలో.. దాదాపు 60రోజుల పాటు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌కు చెందిన 527మంది జవాన్లు వీరమరణం పొందారు.
హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ.. వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగు.
ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది.దీని పై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా.. పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999, మే 3న భారత సైన్యం రంగంలోకి దిగింది.
ఈ యుద్దం కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ (LOC) వెంబడి మే నుండి జూలై 1999 వరకు భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య జరిగింది.రెండు నెలల పాటు, కష్టతరమైన పర్వత భూభాగంలో తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. భారత సైన్యం పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టింది. ఆపరేషన్ విజయ్‌లో భాగంగా టైగర్ హిల్, ఇతర వ్యూహాత్మక స్థానాలను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంది.
కార్గిల్ యుద్ధ విజయం భారత సైన్యం ధైర్యసాహసాలకు, తిరుగులేని జాతీయ కర్తవ్యానికి నిదర్శనం. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని పాకిస్థాన్ కన్న కలలను కలలుగానే మిగిల్చింది కార్గిల్ యుద్ధం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రుసైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం, వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటమది. మన సైన్యం ధాటికి భారత భూభాగాలను ఆక్రమించాలని చూసిన పాకిస్థాన్ దళాలు తోకముడిచి, చివరికి సొంత దేశానికే పుట్టెడు అవమానాన్ని మిగిల్చాయి. నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళిగా జులై 26వ తేదీని "కార్గిల్ విజయ్ దివస్" ను భారత దేశమంతటా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









