పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..

- July 27, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..

పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారిగా స్టేడియంలో కాకుండా పారిస్ నగరంలోని సెన్ నదిపై ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కళ్లు జిగేల్ మనే లైటింగ్స్, వాటర్ విన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆయా దేశాల అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించారు.

గ్రీస్ దేశంతో ఆటగాళ్ల పడవ పరేడ్ ప్రారంభమైంది. ఫ్రెంచ్ అక్షరమాల ప్రకారం ఆయా దేశాలు పడవల్లో పరేడ్ నిర్వహించాయి. ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌కు గౌరవార్థంగా పరేడ్‌లో ముందు అవకాశం ఇచ్చారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ వచ్చింది. 84వ దేశంగా భారత్ పరేడ్ నిర్వహించింది.

టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. అధికారులు, అథ్లెట్లు మొత్తం 78 మంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఈ ఆరంభ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సంప్రదాయ దుస్తులను ధరించారు. ప్రతీ ఒక్కరు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకొని అభివాదం చేశారు. భారత సంస్కృతి ప్రతిబింబించేలా అథ్లెట్లు మహిళా అథ్లెట్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు. పురుష అథ్లెట్లు షెర్వానీలో మెరిసారు.

ఈ ఆరంభ వేడుకలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెన్ నదీ వెంబడి భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షం పడినా.. ఆరంభ వేడుకలు ఆగలేదు. భారత్ నుంచి మొత్తం 117 మంది పారిస్ ఒలింపిక్స్‌ బరిలో నిలిచారు. 16 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాలు, 48వ స్థానం రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో బరిలో నిలిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com