సాహితీ సార్వభౌముడు...!
- July 29, 2024
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె గొప్ప కవి గా, సాహితీవేత్తగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, పరిపాలనాధ్యక్షుడిగా, సినీ గేయ రచయితగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు వారి గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పర్చుకుని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నడిచే పుస్తకంగా ప్రపంచ ప్రసిద్ధి పొంది చదువుల తల్లి సరస్వతీ మాత ముద్దుల తనయుడుగా పేరు ప్రఖ్యాతులు పొందినారు. నేడు సాహితీ శిఖరం సినారె జయంతి.
సింగిరెడ్డి నారాయణరెడ్డి అలియాస్ సినారె ప్రజోత్పత్తి నామ సంవత్సర నిజాషాఢ పౌర్ణమి (గురుపూర్ణిమ)నాడు, అనగా1931, జులై 29వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని (రాజన్న సిరిసిల్ల) వేములవాడ సమీపంలోని హనుమాజీపేట గ్రామంలో బుచ్చమ్మ, మల్లారెడ్డి పుణ్య దంపతులకు జన్మించారు. సినారెలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, ఆశుగణం, గానశీలం ఉన్నాయి. చిన్నప్పటి నుండి మట్టిలో పుట్టిన జానపదగీతాలను ఆలపించే వారు. హరికథలు, బుర్రకథలంటే చెవికోసుకునేవారు. హరికథా కథనాన్ని అనుకరించేవారు ఆశువుగా సంగీతాత్మకంగా.వేములవాడ వాస్తవ్యులు చౌటి నరసయ్య హరికథాగానం నారాయణరెడ్డి కి ఛందస్సు పట్ల మక్కువ, అభిరుచి కలగడానికి ప్రేరకమైంది. ఆరేడు తరగతుల నుండే కవితలు వ్రాయడం మొదలుపెట్టారు. ఛందస్సంటే తెలియనిదశ అది.
ఆనాడు ఉర్దూ మాధ్యమంలోనే సిరిసిల్లలో మాధ్యమిక విద్యను, కరీంనగర్‌లో ఉన్నత విద్యను, ఆ తర్వాత హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఇంటర్ విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎ డిగ్రీని ఉర్దూలోనే సినారె అభ్యసించారు. అటు పిమ్మట ఉస్మానియాలోనే ఏం.ఎ తెలుగు మరియు ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయము ప్రయోగాలు’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. అది ఇప్పటికీ విద్యార్థులకు పరిశోధకులకు విశిష్ట ఆచూకీ గ్రంథంగా ఉపయోగపడుతున్నది.
ఆ తర్వాత సినారె సికింద్రాబాదులోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో, నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేశాడు. తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉద్యోగ విధులు నిర్వహించడమైనది. 1981లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, 1985లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా, 1989 లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఎంతో కాలం పని చేశారు. 1997లో భారత రాష్ట్రపతిచే రాజ్యసభ సభ్యుడిగా నియమించబడి తన సేవలను అందించారు.
తెలంగాణ పల్లె వాతావరణం సినారెలో కవితా రంగం పట్ల అభిరుచిని కలిగించింది. విశాలాంధ్రను సమర్ధించినప్పటికీ, తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానాన్ని వదులుకోలేదు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం పొందారు. సంప్రదాయ సాహిత్యాన్ని వంటబట్టించుకున్నప్పటికీ, తన కవిత్వాన్ని ఆధునిక పోకడలతో ఉరకలు వేయించారు. భిన్న సాహిత్య ప్రక్రియలతో అక్షర సేద్యం చేసి సాహితీ పంట పండించారు. సినారె తెలుగు తోటలో గజల్ పూలు పూయించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రధానంగా కవి అయినప్పటికీ, అనేక కవితలతో పాటు, పద్య గద్య కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, బుర్రకథలు, గజల్స్, వ్యాసాలు వంటి విభిన్న సాహిత్య ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు.
తన 60 ఏళ్ళ సాహితీ ప్రస్థానంలో మొత్తం 80 పైచిలుకు రచనలను ప్రచురించి ప్రకటించారు. వీరి తొలిగ్రంథం ‘నవ్వని పువ్వు’. ఇది గేయనాటికల సంపుటి. 1953లో వచ్చింది. అక్కడి నుంచి ‘జలపాతం’ (ఇందులో త్రివేణి సంగమం లాగా పద్య, గేయ, వచన కవితలు ఉన్నాయి). ‘అజంతా సుందరి’, ‘వెన్నెలవాడ’, ‘రామప్ప’ వంటి గేయనాటిక సంపుటులు ‘రుతుచక్రం’ (ఋతువులపై కావ్యం), ‘నాగార్జున సాగరం’, ‘విశ్వనాథ నాయకుడు’, ‘కర్పూర వసంతరాయలు’ వంటి గేయ కథా కావ్యాలూ, ‘మంటలూ మానవుడు’, ‘మనిషి చిలక’, ‘ముఖాముఖి’, ‘మధ్యతరగతి మందహాసం’, ఉదయం నా హృదయం’, ‘మార్పు నా తీర్పు’, ‘తేజస్సు నా తపస్సు’ వంటి వచన కవితా సంపుటులు, ‘విశ్వగీతి’, ‘మృత్యువు నుంచి’, ‘భూమిక’, ‘మథనం’, ‘విశ్వంభర’ (ఇది సినారెకు జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టింది), ‘మట్టి మనిషి’, ‘ఆకాశం’ వంటి వచన కవితా దీర్ఘకావ్యాలూ, ‘మీరాబాయి’, ‘ముత్యాల కోకిల’ వంటి అనువాద రచనలూ, యాత్ర రచనలూ, విమర్శనా వ్యాస సంకలనాలు ఆయన రచనా సంపదలో ఉన్నాయి
ఆయన రాసిన అనేక గ్రంధాలు హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, మలయాళం మొదలగు ఇతర భాషలలోకి అనువాదాలు అయ్యాయి. 1953లో తాను రచించిన ‘నవ్వని పువ్వు’ తొలి రూపకాన్ని రాశాడు. ఇక అప్పటి నుండి తన సాహితీ ప్రస్థానాన్ని ఆపకుండా కొనసాగించారు. అజంతా సుందరి, జలపాతం, మంటలూ మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర వంటి అనేక కావ్యాలు గ్రంథాలు రాయడం జరిగింది. 1988లో సింగిరెడ్డి నారాయణ రెడ్డి రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి దేశంలో ఇచ్చే అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ’ పురస్కారం లభించింది. తెలుగు భాషలో ఈ ఘనత అందుకున్న మొదటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ కాగా, రెండో వ్యక్తి సినారె.
ఆచార్య ఎన్.గోపి మాటల్లో చెప్పాలంటే ‘విశ్వంభర అంటే భూమి ప్రపంచం అని అర్థాలున్నాయి. అది భూగోళం అనే మట్టి ముద్దను గురించిన కావ్యం మాత్రమే కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి ఆ వికాస క్రమంలో ఆ మనిషి చైతన్య స్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో తన సంబంధాన్ని గురించిన మట్టే విశ్వంభర… విశ్వంభరే మానవుడు… అంటాడు’. ఇదో సుదీర్ఘ కావ్యం. పౌరాణిక చారిత్రక ఘట్టాలు ధ్వనింపజేసే కావ్యం. జ్ఞానపీఠ అవార్డు సాధించిపెట్టిన విశ్వంభర మహాకావ్యం వలె సినారె కూడా విశ్వమానవుడు.
మానవీయతే ఆయన దృక్పథం. తెలంగాణ మాగాణంలో విరబూసిన సాహితీ కుసుమం సినారె సినీవినీలాకాశంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర పొందాడు. 1962లో గులేబకావళి చిత్రానికి ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అనే పాట తో సినీగేయ రచయితగా అరంగేట్రం చేశాడు. దాదాపు మూడు వేలకు పైగా సినిమాలకు పాటలు అందించి పాటలు రారాజుగా కీర్తి గడించాడు. 2009లో వచ్చిన అరుంధతి చిత్రంలో జేజమ్మ జేజమ్మ అని మకుటం కలిగిన పాట సినారె చివరి పాట. సినిమా పాటలు అనేకము రాసినా, ప్రతి పాటా దేనికదే సాటిగా నిలుస్తుంది. నేటి పాటల కన్నా సాహిత్యపు సొబగులతో కూడిన సినారె పాటలను ఇప్పటికీ ఇష్టపడేవారు కోకొల్లలు.
సినారె కవిత్వంలోనే కాదు.. నిజ జీవితంలో కూడా నిత్య యాత్రికుడే. ఆయన అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి మొదలగు అనేక దేశాలలో పర్యటించారు. అంతర్జాతీయ సమావేశాలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబింప చేశారు. సినారె అందించిన విశిష్ట సేవలకుగాను ఆయనకు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 1973లో సాహిత్య అకాడమీ అవార్డు, 1977 లో పద్మశ్రీ, 1988లో జ్ఞానపీఠ్ అవార్డు, 1992లో పద్మభూషణ్ అవార్డుతో పాటు, రాజలక్ష్మీ పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం లభించాయి. ఆయన తెలుగు సాహిత్యానికి స్వేదం ధారపోశాడు.
రాశిలోనూ, వాసిలోనూ మన్నికైన సాహిత్యాన్ని రాశులు పోశాడు. కదిలే ఊహలకు, కన్నులిచ్చిన భావుకుడాయన. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల పైన తనదైన ముద్ర వేశారు. నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు అనే ఒరవడికి మైలురాయి అయ్యారు. ‘మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను పాలు పట్టి జోలపాడి పడుకో మంటాను’ అంటూ తప్పని మరణాన్ని తాత్వికతతో జోకొట్టిన సాహితీ దురంధరుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘నా రణం మరణం పైనే’ అంటూ చివరి పుస్తకాన్ని ఆవిష్కరించిన అక్షర హాలికుడు ఆయన. సముద్రాల, ఆత్రేయ, గుంటూరు శేషేంద్ర శర్మ, దాశరథి కృష్ణమాచార్య మొదలగు సాహితీ దిగ్గజాల ప్రభావం ఇతని పై స్పష్టంగా కనిపిస్తుంది.
సినారె సమకాలిన ఉద్యమాలకు, తెలంగాణ సిద్ధాంతాలకు అతీతంగా విముఖంగా ఉన్నట్టు కొందరు భావిస్తారు. కానీ ఆయన ఏనాడు సామాజిక భావజాలం పట్ల తటస్థడు కాదు. తనదైన మానవతావాదాన్ని ఏనాడు వీడలేదు. ఆయన ఆజ్ఞేయ వాది. అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంలో ఏది నమ్మలేదు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్న ఆదర్శ భావన మొదట్లో బాగా ఉండేది. అందుకనే ఆయన.. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే సినీ గీతం కూడా రాశారు. అయితే చివరకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అంగీకరించారు కూడా.
ఎస్‌ఆర్‌సి లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సినారె తెలంగాణ బిడ్డగా తెలుగు భాషను కాపాడుకుంటూనే, అన్ని ప్రాంతాల వారి అభిమానాన్ని చూరగొన్న మహాకవి. కవికి సాహిత్యానికి భౌగోళిక సరిహద్దులు ఏనాడు ఉండవని నమ్మిన వ్యక్తి. నిజానికి ఆయన విశ్వమానవుడు. సినారె సాహిత్యం నిత్యం ప్రవహించే మహా జీవనది. ‘కలిమికి సాఫల్యం నలుగురికీ దక్కినప్పుడే/ పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకి ఎక్కినప్పుడే’ (ప్రపంచపదులు) అని తన కవిత్వం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవతావాదాన్ని ప్రబోధించిన సినారె సదా చిరస్మరణీయుడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి