మహారచయిత-ప్రేమ్‌చంద్

- July 31, 2024 , by Maagulf
మహారచయిత-ప్రేమ్‌చంద్

సాంఘిక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన గొప్ప రచయిత ప్రేమ్‌చంద్. హిందీ, ఉర్దూ భాషల్లో అభ్యుదయ భావాలతో ఆయన రాసిన కథలు, నవలలు, సంపాదకీయాలు భారతదేశ ప్రజలను చైతన్య పరిచాయి. ఆచారాల ముసుగులో సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాల మీద తన రచనల ద్వారా తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మున్షి ప్రేమ్‌చంద్. నేడు ఆ మహారచయిత జయంతి.

మున్షి ప్రేమ్‌చంద్ అసలు పేరు ధన్‌పత్ రాయ్ శ్రీవాత్సవ, 1880, జూలై 31న బ్రిటిష్ ఇండియాలోని బెనారస్ రాజ్యంలోని వారణాసికి దగ్గర ఉన్న లమ్హీ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అజైబ్ లాల్, ఆనంది దేవి దంపతులకు జన్మించారు. తండ్రి పోస్టల్ ఉద్యోగిగా పనిచేసేవారు. మేనమామ మహాబీర్ కరౌలి గ్రామ భూస్వామిగా బెనారస్ పాలకుల వద్ద మంచి పలుకుబడి ఉండేది. ఆయన్ని "నవాబ్ రాయ్" అని పిలిచేవారు. మేనమామ వద్దనే చిన్నారి ప్రేమ్‌చంద్ కొంత కాలం ఉన్నారు. తన మేనమామకు నివాళిగా నవాబ్ రాయ్ అనే ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశారు.

ప్రేమ్‌చంద్ ప్రాథమిక విద్యను మాతృభాష హిందీలో కాకుండా ఉర్దూలో పూర్తి చేశారు. అందుకు కారణం, ఆనాటి బెనారస్ రాజ్యంలో ఉర్దూ సైతం అధికార భాషగా ఉండటంతో పాటుగా, తమ చుట్టుపక్కల ఉన్న రాజ్య పాలకులు సైతం ఉర్దూ భాషను వ్యవహారిక భాషగా చేసుకొని ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మూలాన ఉర్దూ భాషలో ఓనమాలు దిద్దారు. మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత కుటుంబ పరిస్థితులు కారణంగా ఉన్నత విద్యను పూర్తి చేయలేక పోయారు.

ప్రేమ్‌చంద్ 8 ఏళ్ళ వయస్సులోనే తల్లి మరణంతో ఆయన విషాద బాల్యం మొదలైంది. తండ్రి రెండో పెళ్ళి చేసుకొని పట్టించుకోక పోవడం, సవతి తల్లి ఆప్యాయత కరువై తన సొంతింట్లోనే ఆత్మనూన్యత భావంతో జీవించేవారు. ఈ సమయంలోనే సాహిత్యం ఆయన జీవితంలోకి ప్రవేశించింది. హిందీ, ఉర్దూ భాషల్లో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలను చదివి స్వాంతన పొందేవారు. స్నేహితులతో కన్న పుస్తకాలతోనే  తన బాల్యాన్ని గడిపారు. స్కూల్లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ మీద పట్టు సాధించి ఆ భాషలోని ప్రముఖ సాహితివేత్తల సాహిత్యాన్ని చదివారు. స్కూల్ పుస్తకాల కన్నా ఈ పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపించేవారు.

ప్రేమ్‌చంద్ కాలేజీ విద్యకు అడుగుపెడుతున్న సమయంలోనే తండ్రి ఆకస్మిక మరణం కారణంగా సవతి తల్లి, ఆమె పిల్లల బాధ్యత ఆయన పై పడింది. చదువుకు స్వస్తి పలికి పలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆయన రచనలు మెల్లగా ప్రసిద్ధి పొందడం ప్రారంభించిన తర్వాత టీచర్ ఉద్యోగం లభించింది. టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి ఆయనలోని సంస్కర్త మేలుకొన్నాడు. సమాజంలో పేద ప్రజల మీద జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ పలు కథలు, నవలలు రాశారు. ఇవన్ని నాటి అభ్యుదయ పత్రికల్లో అచ్చయ్యేవి. వాటి మీద సంస్కరణ వాదులు నిరసనలు చేపట్టినా అభ్యుదయ వాదులు, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచేవారు.

ప్రేమ్‌చంద్ వైవాహిక జీవితం కూడా విప్లవాత్మకమైనది, మొదటి భార్యతో విడిపోవడం, బాల వితంతువైన యువతిని రెండో వివాహాం చేసుకొని సంచనలం సృష్టించారు. రెండో భార్య శివరాణి సైతం ప్రేమ్‌చంద్ సంఘ సంస్కరణలకు, అభ్యుదయ రచనలకు చివరి శ్వాస వరకు మద్దతుగా నిలిచారు. వ్యవస్థలో ఉన్న లోపాలను అరికట్టేందుకు మొదటగా తన ఇంటి నుంచే ఆ ప్రక్షాళనను ప్రారంభించారు. ఇదే సమయంలో సంప్రదాయ వాదుల ఒత్తిడి మూలాన ఉద్యోగంలో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి   రచయితగా మారారు. రచయితగా పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక తన తోలి కలం పేరైన నవాబ్ రాయ్ నుంచి ప్రేమ్‌చంద్ గా మార్చుకున్నారు.

రచయితగా సమాజంలోని దురాగతాలు మీద పోరాడుతూనే పలు పత్రికల్లో పనిచేశారు. తన రచనల మీద అప్పటి సంప్రదాయ వాదులు విధించిన ఆంక్షలు కారణంగా ఆయనే సొంతంగా ప్రచురణ కేంద్రాన్ని స్థాపించి తన రచనలను అచ్చు వేశారు. స్వాతంత్ర ఉద్యమానికి అనుకూలంగా ప్రేమ్‌చంద్ పత్రికల్లో సంపాదకీయాలు, కథలు, నవలలు కూడా రాశారు. విశేషం ఏంటంటే ఈ రచనల్లో సైతం సమాజంలోని లోటుపాట్లను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ వచ్చే అంశాలు ప్రధానంగా ఉండేవి.  

ప్రేమ్‌చంద్ జీవితంలో మున్షీ అనే పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. దానికి కారణం అది ఆయన తలవని పేరు కాబట్టి. 'హన్స్'(హంస) పత్రికలో పనిచేస్తున్న సమయంలో ఆ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడైన కన్హయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీతో కలిసి సంపాదకీయాలు రాసేవారు. పత్రిక ముఖచిత్రంలో మున్షీ-ప్రేమ్‌చంద్ అని పడేది. కాల క్రమేణా ఈ పత్రికలో పనిచేస్తున్న సమయంలోనే ప్రేమ్‌చంద్ ఉర్దూ, హిందీ భాషల్లో ఆయన రచనలకు పెద్ద పేరు రావడంతో మున్షీ-ప్రేమ్‌చంద్ కాస్త మున్షీ ప్రేమ్‌చంద్ గా మారింది. అనంతర కాలంలో ఆ పత్రిక మూతబడిన తర్వాత కూడా ఆయన్ని మున్షీ ప్రేమ్‌చంద్ గానే సమాజం గుర్తించింది.

ప్రేమ్‌చంద్ రచనలలో డజనుకు పైగా నవలలు, దాదాపు 300 చిన్న కథలు, అనేక వ్యాసాలు మరియు అనేక విదేశీ సాహిత్య రచనలను  హిందీలోకి అనువదించారు. ఆయన రచించిన నవలలు ప్రేమ, రూతీ రాణి, దేవస్థానాల రహస్యం, సేవా సదన్, ప్రేమాశ్రమం, రంగభూమి, నిర్మల, ప్రతిజ్ఞ , కర్మభూమి, మనోరమ, కాయకల్పం, గబాన్ మరియు గోదాన్ లు ప్రముఖమైనవి. ఆయన రచనలన్ని భారతీయ భాషల్లో అనువాదం అయ్యి ప్రజాదరణ పొందాయి. ఆయన రాసిన కథలను సినిమాలు, టి.వి.సీరియళ్ళుగా రూపొందించబడ్డాయి.

కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరువాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. 

కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన ప్రేమ్‌చంద్ తన వ్యక్తిగత జీవితానికి, సమాజంలో జరుగుతున్న అంశాలనే కథా వస్తువుగా తీసుకోని అనేక రచనలు చేశారు. ఆయన మరణించి ఎనిమి దశాబ్దాలు అవుతున్నా ఈనాటికి ఆయన రచనలు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com