నిష్కళంక రాజనీతిజ్ఞుడు ...!

- August 16, 2024 , by Maagulf
నిష్కళంక రాజనీతిజ్ఞుడు ...!

అటల్ బిహారీ ..మన దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. సొంతపార్టీ నాయకులే కాకుండా విపక్ష నేతలు కూడా అత్యంత గౌరవించే గొప్ప వ్యక్తి వాజ్ పేయి. భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసారు. అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించేలా పరిపాలన చేశారు. గొప్ప వక్తగా పేరు పొందారు. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయి.. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.

అటల్ బిహారీ వాజ్‌పేయి   1924 డిసెంబర్ 25 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్ పేయి. గ్వాలియర్ సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నారు. కాన్పూర్ దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందారు. 1939 లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల కారణంగా‌ న్యాయవిద్యను మధ్యలోనే ఆపేశారు.

వాజ్‌పేయి రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ హిందీ పత్రికల్లో పనిచేశారు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తన అన్న ప్రేమ్‌తో కలిసి అరెస్టై 23 రోజులు జైల్లో గడిపారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. 1957 లో వాజ్‌పేయి  బల్రామ్ పూర్ నియోజకర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన వాగ్ధాటిని గమనించిన జవహర్ లాల్ నెహ్రూ ఏదో ఒక రోజు వాజ్ పేయి దేశ ప్రధాని అవుతారని ఊహించారట.

1977 సార్వత్రిక ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నుంచి జనతా పార్టీ విజయం తరువాత మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వాజ్ పేయి పనిచేశారు. 1980 లో భారతీయ జనతా పార్టీ ఏర్పరచి మొట్ట మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ స్ధాయిలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 1995 నవంబర్‌లో ముంబయిలో జరిగిన సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజ్ పేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 1996 నుంచి 2004 మధ్యలో వాజ్ పేయి మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

వాజ్ పేయి పరిపాలనా కాలంలో  ఆర్ధిక, మౌలిక సంస్కరణలు చేపట్టారు. ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాజ్ పేయి పరిపాలన కాలంలోనే 1998 లో పోఖ్రాన్ అణు పరీక్ష, 1999 లో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించాయి. 2001 లో డిసెంబర్‌లో పార్లమెంటు భవనంపై దాడి జరిగింది. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీస్ ప్రారంభం అయ్యింది. ఇది భారత్, పాక్ సంబంధాల అంశంలో చారిత్రాత్మక ఘట్టంగా చెప్పాలి.

వయోభారం కారణంగా 2005 డిసెంబర్‌లో వాజ్‌పేయి క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 2009లో స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై ఆయన మాట క్షీణించింది. వాజ్ పేయి దేశానికి అందించిన సేవలకు గాను అనేక సత్కారాలు అందుకున్నారు. భారతదేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ తో ఆయనను 2014లో మోడీ ప్రభుత్వంలో సత్కరించింది.  2018, ఆగస్టు 16న వాజ్‌పేయి  ఢిల్లీలోని తన స్వగృహంలో మరణించారు. భారత రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్న వాజ్‌పేయి భావితరాలకు గుర్తుండిపోతారు.

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com