యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు..

- June 19, 2016 , by Maagulf
యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు..

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని చెతుర్వేది(మధ్యప్రదేశ్), మోహనా సింగ్(రాజస్థాన్), భావనా కాంత్(బిహార్) రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత ఎయిర్ ఫోర్స్ లో తొలిసారిగా యుద్ధ విమానాలను మహిళలు నడపనున్నారు. హైదరాబాద్ దుండిగల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం ఉదయం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో 22మంది మహిళలు సహా 130 మంది ఫ్లయిట్ క్యాడెట్స్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాసింగ్‌ఔట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణమంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు.శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలను అందజేశారు.అనంతరం రక్షణమంత్రి మాట్లాడుతూ, వాయుసేన చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అన్నారు. వైమానికరంగంలో భవిష్యత్తులో మహిళలు అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉందన్నారు. యుద్ధ విమాన పైలట్లుగా వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ మంత్రి పారికర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇంకా కొన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా అధిగమిస్తాం.రానున్న కాలంలో రక్షణ విభాగాల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది. అది మనం మౌలిక వసతులు ఏమేరకు కల్పిస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లను విధుల్లోకి తీసుకోవాలని మేం ఉత్సుకతతో ఉన్నాంఅని చెప్పారు. పాసింగ్‌ఔట్ పరేడ్ పూర్తి చేసుకున్న 130 పైలట్లకు రాష్ట్రపతి తరఫున మంత్రి పారికర్ ప్రెసిడెంట్ కమిషన్స్‌ను అందజేశారు. పరేడ్‌లో రక్షణశాఖ మంత్రితోపాటు ఎయిర్‌చీఫ్ మార్షల్ అరుప్‌రాహా, ఎయిర్‌స్టాఫ్ చీఫ్ మార్షల్ ఎస్‌ఆర్‌కే నాయర్, ఎయిర్ మార్షల్ జీపీసింగ్ పాల్గొన్నారు. పరేడ్‌లో భాగంగా వాయుసేన విమానాలు, హెలికాప్టర్లతో ఒళ్లుగగుర్పొడిచేలా చేసిన విన్యాసాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరేడ్ ప్రారంభంలో నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com