వెండి తెర రెబ‌ల్ స్టార్...!

- September 11, 2024 , by Maagulf
వెండి తెర రెబ‌ల్ స్టార్...!

వెండి తెరమీద ఆర‌డుగుల ఎత్తు, భారీ విగ్ర‌హంతో అల‌రించిన ఏకైక హీరో కృష్ణంరాజు. ఆయ‌న పేరు విన‌గానే కొంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లు వేసేది, కొంద‌రు జ‌డుసుకొనేవారు, మ‌రికొంద‌రికి ఆయ‌న అభిన‌యం ఆనందం పంచేది. ఇంకొంద‌రిని ఆయ‌న న‌ట‌న మురిపించేది. ఆరంభంలోనే ప్రముఖ దర్శకుడు కె.ప్ర‌త్య‌గాత్మ రూపొందించిన‌`చిల‌క‌-గోరింక‌`(1966)తో హీరోగా తెర‌పై త‌ళుక్కుమ‌న్నారు కృష్ణంరాజు. అయితే ఆ త‌రువాత క‌థానాయ‌కునిగా నిల‌దొక్కుకోవ‌డానికి కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డార‌నే చెప్పాలి. దాదాపు ప‌దేళ్ళ‌కు కృష్ణంరాజు స్టార్ డ‌మ్ చూశారు. జ‌నం మ‌దిలో `రెబ‌ల్ స్టార్`గా నిలిచారు. నేడు ఆయన వర్థంతి.

కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940, జనవరి 20న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని సంపన్న క్షత్రియ కుటుంబంలో జన్మించారు. కృష్ణంరాజు మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం హైదరాబాదులోని బద్రుకా కాలేజీలో బీకామ్ పూర్తి కొంత కలం ఆంధ్ర రత్న అనే పత్రికలో ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లి తన సన్నిహితుల ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు.

చిలకా గోరింకా సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఐతే మొదటి సినిమా ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో చాలా నిరాశపడ్డారు కృష్ణంరాజు.తర్వాత నటనలో రాటు దేలేందుకు అనేక పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు నారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేవరకు వచ్చిన అన్ని అవకాశాలు వదులుకున్నారు. తర్వాత అవే కళ్లు సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు.

 తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ డ‌మ్ కోసం దాదాపు పుష్క‌ర‌కాలం ప్ర‌య‌త్నాలు సాగించి, విజేత‌లుగా నిల‌చిన‌వారు ఇద్ద‌రే ఇద్ద‌రు- వారు శోభ‌న్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్ద‌రు హీరోల‌ను అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏయ‌న్నార్ బాగా ప్రోత్స‌హించారు. వారిచిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ త‌మ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డ‌మ్ చేరుకోవ‌డానికి చాలా ఏళ్ళు ప‌ట్టింది. శోభ‌న్ బాబు హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా  సాగుతూ చివ‌ర‌కు `తాసిల్దార్ గారి అమ్మాయి`తో స్టార్ డ‌మ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంత‌గా ద‌క్క‌లేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెంద‌లేదు. త‌న‌కు ల‌భించిన విల‌న్ రోల్స్ లోనూ అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఆ రోజుల్లో కృష్ణంరాజును విల‌న్ గా తెర‌పై చూసిన మ‌హిళా ప్రేక్షకులు ఆయ‌న పేరు చెప్ప‌గానే జ‌డుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బ‌య‌ట ప‌డ‌డానికి `కృష్ణ‌వేణి, అభిమాన‌వంతులు, మేమూ మ‌నుషుల‌మే` వంటి చిత్రాల‌లో సాఫ్ట్ కేరెక్ట‌ర్స్ పోషించారు.

ఈ చిత్రాల‌లో`కృష్ణ‌వేణి` మిన‌హా ఏ చిత్ర‌మూ విజ‌యం సాధించ‌లేదు.అయినా మెల్ల‌గా కృష్ణంరాజును కూడా హీరోగా చూడ‌డానికి జ‌నం అల‌వాటు ప‌డేలా చేసుకున్నారు. ఆ త‌రువాత `భ‌క్త క‌న్న‌ప్ప‌`తో న‌టునిగా జ‌నం మెదిని మెప్పించ‌డ‌మే కాదు, స్టార్ డ‌మ్ నూ సొంతం చేసుకున్నారు. `అమ‌ర‌దీపం` చిత్రంతో నంది అవార్డుల్లో తొలి ఉత్త‌మ‌న‌టునిగా నిలిచారు. ఆ పై మాస్ సినిమాల‌తోనూ ఆక‌ట్టుకోవ‌డం మొద‌లెట్టారు. దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన “క‌ట‌క‌టాల రుద్ర‌య్య‌, రంగూన్ రౌడీ“ చిత్రాలు కృష్ణంరాజును `రెబ‌ల్ స్టార్`గా నిలిపాయి. ఆ త‌రువాత నుంచీ ఆయ‌న మ‌రి వెనుదిరిగి చూసుకోలేదు.

80 దశకం నాటికే ఆయన తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నారు. నిండైన ఆయన విగ్రహానికి గంభీరమైన వాయిస్ తోడైంది. రౌద్ర రసాన్ని పోషించే సమయంలో చింతనిప్పులుగా మారిపోయే ఆయన కళ్లు అసమానమైన ఆయన నటనకు ప్రతీకలుగా నిలిచాయి. ఈ దశకంలో కృష్ణంరాజు చేసిన అనేక సినిమాలు నటుడిగా ఆయన విశ్వరూపాన్ని చూపించాయి. తెరపై రౌడీయిజాన్ని చూపిస్తూ గూండాగిరిని ప్రదర్శిస్త, ప్రతినాయకుల గుండెల్లో దడ పుట్టించే పాత్రల్లో కృష్ణంరాజుకు తనకి తిరుగులేదనిపించుకున్నారు. యాక్షన్, ఎమోషన్ తో కూడిన పాత్రలు ఆయన్ను ‘రెబల్ స్టార్’ గా నిలబెట్టాయి.ఈ దశకంలో వచ్చిన ‘త్రిశూలం’ .. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ .. ‘తాండ్రపాపారాయుడు’ .. ‘అంతిమ తీర్పు’ సినిమాలు, ఆయనలోని నటుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి .. నటుడిగా కృష్ణంరాజు అంటే ఏమిటనే ప్రశ్నకి నిర్వచనం చెప్పాయి.

80,90 దశకాల్లో హీరోగా నటిస్తూనే, ఇతర హీరోల చిత్రాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆయనే బిజీగా ఉన్న సమయంలోనే తన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మాతగా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద పలు చిత్రాలను నిర్మించారు. సూర్యనారాయణ రాజు చిన్న కుమారుడు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి, పెదనాన్న పేరును నిలబెడుతూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. చివరిసారిగా ఆయన ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటించారు.

కృష్ణంరాజు ఉత్తమ నటుడిగా 1977, 1984లలో నంది అవార్డులు గెలుపొందారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

కృష్ణంరాజు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998లో వాజపేయ్ సమక్షంలో భాజపాలో చేరి కాకినాడ లోక్ సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో నరసాపురం నుంచి రెండో సారి ఎంపీగా విజయం సాధించి, వాజపేయ్ మంత్రివర్గంలో 2000-04 వరకు విదేశాంగ, రక్షణ, వినియోగదారులు & ఆహార సరఫరా మరియు గ్రామీణాభివృద్ధి శాఖల కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2005లో భాజపాకు రాజీనామా చేసి 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తిరిగి మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు.  
 
 కృష్ణంరాజు సినీప్ర‌యాణం త‌రువాతి రోజుల్లో ఎంద‌రో హీరోల‌కు స్ఫూర్తిగా నిల‌చింది. కృష్ణంరాజు స్ఫూర్తితోనే చిరంజీవి, ర‌వితేజ‌, శ్రీ‌కాంత్ వంటివారు తొలుత చిన్న వేషాలు, విల‌న్ రోల్స్ చేసినా త‌రువాత హీరోలుగానూ, అటుపై స్టార్స్ గానూ రాణించారు. ఆ తీరున ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశిస్తున్న ఎంద‌రో న‌టుల‌కు కృష్ణంరాజు చ‌ల‌న‌చిత్ర జీవితం ప్రేర‌ణ‌గా నిల‌చింద‌ని చెప్ప‌వ‌చ్చు. 2022 సెప్టెంబర్ 11న అనారోగ్యంతో బాధపడుతూ తన 82వ ఏట కృష్ణంరాజు కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com