తెలుగువారి మనసు కవి...!
- September 13, 2024వేదాంతం, తర్కం,మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే ఆత్రేయ. అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి... బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు... ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .. సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు... మాటలు ఉద్వేగపు ఊటలూరి జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి... అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలు గా భాసిల్లుతున్నాయి. నేడు మనసు కవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి.
ఆత్రేయ గారి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన 'దీక్ష' చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు.
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
ఆత్రేయ రాయడం లేట్ చేసినా... ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆత్రేయ 1400కి పైగా సినిమా పాటలు రాశారు. వాటిల్లో 100కి పైగా మనసు పాటలే ఉన్నాయి. మనసు అనే ముడి పదార్ధంతో ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవీ రాయలేదు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి... ''మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.'' అంటూ మాట్లాడి... మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ.
ఆత్రేయుడు అంటే చంద్రుడు. వెన్నెలంత వేడిగా వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఆత్రేయ 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించారు అని చెప్పవచ్చు.తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్