తెలుగు వారి అందాల నటుడు

- September 13, 2024 , by Maagulf
తెలుగు వారి అందాల నటుడు

తెలుగు తెర పై గ్లామర్‌ హీరో అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న ఎన్టీఆర్. ఆ తరువాత శోభన్ బాబు. వీరిద్దరి కంటే ముందే ‘అందాల నటుడు’ అన్న టైటిల్ సంపాదించారు చదలవాడ నారాయణరావు. చిత్రసీమలో సిహెచ్. నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగువారి తొలి గ్లామర్ హీరో. నవలల్లో నాయకుని వర్ణించినట్టుగా ఉండే కోటేరు లాంటి ముక్కు, విశాలనేత్రాలు, పసిమిఛాయ నారాయణరావు సొంతాలు.నేడు తెలుగు తెర తొలి స్టార్‌ హీరో చదలవాడ నారాయణరావు జన్మదినం.

చదలవాడ నారాయణరావు 1913 సెప్టెంబర్ 13న కర్ణాటకలోని హుబ్లీ సమీపాన మధుగిరిలో జన్మించారు. అంతకు ముందు దక్షిణభారత మంతటా ఉన్న రాజ్యాలలో తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉండేవారు. అలా నారాయణరావు పూర్వికులు మైసూర్ మహారాజా వారి ఆస్థానంలో దివాన్లుగా పనిచేసేవారు. అందువల్ల ఆయన కన్నడ నాట జన్మించారు. అనంత పద్మనాభ వ్రతం రోజున జన్మించడం వల్ల ఆయన పేరును చదలవాడ అనంతపద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావుగా నిర్ణయించారు. ఆ పేరు వెండితెరపై సిహెచ్. నారాయణరావుగా మారింది. ఆయన బాల్యం అంతా ఏలూరులో గడిచింది. సోషలిస్టు భావాలతో పలు కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలం ఏలూరు వెంకట్రామా అండ్ కో లోనూ గడిపారు.

తలవని తలంపుగా మదరాసులో ఓ హోటల్ లో భోంచేస్తూండగా దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు కలిశారు. ఆయన ప్రోత్సాహంతో 1940లో రూపొందిన ‘జీవనజ్యోతి’ చిత్రంలో నాటి ప్రముఖ నాయిక కృష్ణవేణి సరసన హీరోగా నటిస్తూ చిత్రసీమలో అడుగు పెట్టారు సిహెచ్.నారాయణరావు.తొలిచిత్రం ‘జీవనజ్యోతి’ (1940)నుంచి దశాబ్దకాలంపాటు గ్లామర్‌ హీరోగా, విలన్‌గా ఒక వెలుగు వెలిగిన గొప్పనటుడు చదలవాడ నారాయణరావు. ఆయన పేరు చెప్పగానే ‘భక్త పోతన’ లోని శ్రీరాముడు, ‘స్వర్గసీమ’లోని నరేన్‌, ‘జీవితం’లో దుష్ట భూమిక అందరికీ బాగా గుర్తు తెచ్చే పాత్రలు.

‘చూడామణి’ (1941), ‘దీనబంధు’ (1942), ‘భక్త పోతన’, ‘దేవత’, (1941), ‘స్వర్గసీమ’ (1943), ‘చెంచులక్ష్మి’ (1943), ‘మనదేశం’, ‘మొదటి రాత్రి’, ‘జీవితం’, ‘లక్ష్మమ్మ’, ‘తిరుగు బాటు’, ‘పేరంటాలు’, ‘మంజరి’ వంటి 50 చిత్రాలలో కథానాయకుడిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా నటించి తన సహజనటనతో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు నారాయణరావు. జానపద చిత్రమైన ‘మంజరి’ నిర్మాణంలో ఆయనకూ భాగస్వామ్యం ఉంది. చిత్రపరిశ్రమను దర్శకులు ఏలుతున్న తరుణంలో సినిమాలోకి ప్రవేశించిన నారాయణరావు ‘స్టార్‌డమ్‌’ అనేపదాన్ని తొలిసారిగా హీరోలకు వర్తింపచేసిన ఘనత పొందారు హీరోలకు అభిమాన సంఘాలు ప్రారంభమైంది కూడా నారాయణరావుతోనే.

దిలీప్‌ కుమార్‌, రాజ్‌కపూర్‌, బలరాజ్‌ సహానీ వంటి హిందీ హీరోలు మద్రాసు వచ్చినప్పుడల్లా నారాయణరావుని కలిసి వెళ్లేవారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణరావు తన వ్యక్తిత్వంతో, ఇమేజ్‌తో తెలుగు చిత్రపరిశ్రమ ప్రతిష్టను మరింత పెంచారు.నారాయణరావును 1951లో ఆంధ్రవిశ్వవిద్యాలయం సత్కరించింది. ఒక సినిమా హీరోను ఒక విశ్వవిద్యాలయం గౌరవించడం అదే ప్రథమం.

‘జీవన జ్యోతి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు నారాయణరావు. ఆయనకు రంగస్థల అనుభవం లేకపోవడంతో తన తరహాలో నటించారు. అది ప్రేక్షకులు వెరయిటీగా ఫీలయ్యారు. వాచకంతో, భావ ప్రకటనతో ఒక కొత్తదనాన్ని ప్రవేశపెట్టిన నారాయణరావుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన గురించి మరో విషయం చెప్పాలి. ‘మొదటి రాత్రి’ చిత్రంలో ఆయన లారీ డ్రైవర్‌గా నటించారు.ఆ చిత్రంలో నారాయణరావు ధరించిన అడ్డుగళ్ల చారల బనీను ఆరోజులలో యువకులకు పెద్ద ఫ్యాషన్‌గా మారింది. అటువంటి బనియన్లు ఆ సినిమా విడుదలయ్యాక వేలసంఖ్యలో అమ్ముడయ్యాయి. నారాయణరావు క్రాఫ్‌ను అనుకరించడం, ఆయనలా నడవడం, ఆయన వేసుకున్న విధంగా డ్రస్‌ వేసుకోవడం ఆరోజులలో అభిమానులకు ఒక అలవాటుగా మారింది.

పారితోషికం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు నారాయణరావు. ఏమాత్రం తగ్గినా అంగీకరించేవారు కాదు. దానికి బదులు ఖాళీగా ఉండటానికే ఇష్టపడేవారు. రాజ్యం పిక్చర్స్‌ వారి ‘హరిశ్చంద్ర’లో ఆయనే హీరోగా నటించాల్సి ఉంది. కానీ పారితోషికం మరీ తక్కువని అంగీకరించలేదు. ‘ఆ పాత్రలో మిమ్మల్ని చూడాలని’ ఉంది అని నిర్మాత, నటి లక్ష్మీరాజ్యం బతిమాలినా నారాయణరావు వినిపించుకోలేదు. తర్వాత ఆ పాత్రని ఎస్‌.వి.రంగారావు పోషించారు. పారితోషికం విషయంలో పట్టువిడుపులు లేకపోవడంతో చివరిదశలో ఆర్థిక ఇబ్బందులకు లోనయినా నారాయణరావు ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు.

ఈ అందాల నటుడు 1950లలో రామారావు ఆగమనంతో మెల్లగా మసకబారి పోయారు. తరువాతి రోజుల్లో “శ్రీకృష్ణతులాభారము, రహస్యం, అర్ధరాత్రి, ఒకే కుటుంబం, కలెక్టర్ జానకి, దేశోద్ధారకులు” వంటి చిత్రాలలో కనిపించారు సిహెచ్. నారాయణరావు. చిత్రమేమంటే ఎన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’లో ఆ నాటి మేటి నటులు నాగయ్య, నారాయణరావు ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు. తరువాతి రోజుల్లో రామారావు హీరోగా రూపొందిన ‘ఒకే కుటుంబం’లో నాగయ్య, నారాయణరావు కేరెక్టర్ రోల్స్ చేశారు.

చదలవాడ అభినయం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసేది. ఆంగ్ల చిత్రాలలో లాగా పాత్రకు తగినట్టుగా నటించాలన్నది ఆయన భావన. ఓవర్ యాక్షన్ చేయడం సరికాదు అనేవారు. అయితే అప్పటి నటీనటుల్లో అనేకులు రంగస్థలం నుండే వచ్చినవారు కావడం వల్ల కెమెరా ముందు కూడా వారు అతిగానే అభినయించేవారు. దానిని నారాయణరావు తప్పు పట్టేవారు. ఎందుకంటే ఆయనకు నాటకానుభవం తక్కువ. అందువల్ల కొందరు నాటకాల్లో నటించి చూపమని ఆయనకు సవాల్ విసిరారు. పట్టుదలతో కొన్ని నాటకాల్లో నటించి మెప్పించారు. 

అయితే ఆ తర్వాత కెమెరా ముందు నటించే సమయంలో నారాయణ రావు సైతం కంట్రోల్ కావడానికి సతమతం కావలసి వచ్చింది. అప్పుడు నాటకాల్లో నటన కూడా అంత సులువైనది కాదని, నిజానికి ప్రత్యక్షంగా జనం ముందు ప్రదర్శించి మెప్పించడం కత్తిమీద సాములాంటిదేనని ఆయన అంగీకరించారు. అదీ నారాయణరావు లోని నిజాయితీ అని తరువాతి తరం సినీజనం కథలుగా చెప్పుకున్నారు. అనారోగ్య కారణంగా 1984 ఫిబ్రవరి 14న మద్రాసులో సిహెచ్. నారాయణరావు కన్నుమూశారు. తెలుగువారి తొలి గ్లామర్ హీరోగా నారాయణరావు చరిత్రలో నిలిచారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com