ఆంధ్ర తిలక్-గాడిచర్ల

- September 14, 2024 , by Maagulf
ఆంధ్ర తిలక్-గాడిచర్ల

తనను విమర్శించిన హరిసర్వోత్తమ రావును గురించి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ అన్న మాట: "ది బ్రేవ్ సర్వోత్తమ రావ్". ఈ ఒక్క మాట చాలు అయన వ్యక్తిత్వాన్ని తెలియ జేయటానికి. పత్రికా రంగములో అడుగు పెట్టి నిర్భయముగా, నిర్మొహమాటముగా ఏ స్థాయి వారినైనా విమర్శించిన పత్రికా సంపాదకుడు హరిసర్వోత్తమరావు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు ‘సంపాదకుడు’ అనే తెలుగు పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయనే. అంతే  కాకుండా ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ కూడా ఈయనే. స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా వేత్త గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. నేడు గాడిచర్ల వారి జయంతి.

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబరు 14న కర్నూలులో జన్మించినా ఆయన పూర్వీకులు కడప జిల్లా పులివెందుల ప్రాంతం సింహాద్రిపురానికి చెందిన వారు. గుంతకల్లులో హైస్కూలు విద్య, పిమ్మట మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో చదివి 1906లో తెలుగు ఎం.ఏ. పాసయ్యారు. అలా తొలిసారి తెలుగు ఎం.ఏ. పట్టా పొందినవారిలో పానుగల్లు రాజా (రామరా యణం) మొదటి వారు కాగా, గాడిచర్ల రెండవ వారు. వేదం వేంకటరాయశాస్త్రి అధ్యాపకుడు కాగా భోగరాజు పటాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, గిడుగు సీతాపతి అంతే వాసులయిన మిత్రులు. కృష్ణదేవరాయలు గురించి ‘ది ఫర్‌గాటెన్‌ ఎంపైర్‌’ పేర ఎం.ఏ. పరీక్షకు అవసరమైన సిద్ధాంత గ్రంథం ఆంగ్లంలో రాసిన పండి తుడు గాడిచర్ల. చిత్తూరు ప్రాంతానికి చెందిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఏకైక కుమార్తె ద్వారక, అల్లుడు పార్థసారథి గొప్ప సంగీత విద్వాంసులు.

మూడేళ్ళ జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత గాడిచర్లను పలకరించడానికి జనం భయపడేవారట.. - తమకు కూడా శిక్ష పడుతుందేమోనని! అలాంటి సమయంలో మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుతో సాంగత్యం చిరకాలం నడిచింది. గాడిచర్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అబ్రహాం లింకన్‌ గురించి ఆయన రాసిన గ్రంథం తెలుగులో పూర్తి స్థాయి జీవిత చరిత్ర పుస్తకంగా రికార్డులకెక్కింది. విజ్ఞాన సంబంధరచనలు ఎన్నో చేశారు. గాంధీ తొలి రచన ‘హిందీ స్వరాజ్‌’కు 1920 ప్రాంతంలో అనువాదం చేశారు. మారుపేరుతో తెలుగులో కథలు రాశారు. తొలి రాయలసీమ కథారచయితగానూ రికార్డులకెక్కారు గాడిచర్ల.

1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేశారు. వీరిని ‘ఆంధ్రతిలక్’ అని ఆరోజుల్లో వ్యవహరించే వారు. 1916 నుండి 1918 వరకు ఆయన ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు సంపాదకుడుగా ఉన్నారు. ది నేషనలిస్ట్, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. మహిళల సమస్యల పరిష్కరం కోసం "సౌందర్యవల్లి" అనే పత్రిక నడిపారు. మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు. జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు. ఆ విధంగా పత్రికా రచయితగా, సంపాదకుడిగా, ఆయన విశేషమైన కృషి చేశారు.

పుస్తక రచయితగా స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం, శ్రీరామ చరిత్ర (ఈ పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ఉమ్మడి మద్రాస్  ప్రభుత్వం తీసుకున్నది). పౌరవిద్య (ఈ పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది), ఆబ్రహాము లింకను చరిత్ర (1907) (ఈ పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.), వయోజన విద్య లను రచించారు.

వయోజన విద్య మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం వారు 1941, 1953లలో ముద్రించారు. ఆయన సాహితీ వ్యాసంగం జీవితాంతం కొనసాగింది. వయోజన విద్యా శాఖ డైరెక్టర్ గాను, దక్షిణ భారత వయోజన విద్యా సంఘము అధ్యక్షుడిగా పనిచేశారు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించారు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు.

1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో అప్పటి వరకు దత్తమండలం (Ceded) అని పిలవబడే నేటి రాయల సీమ ప్రాంతానికి చిలుకూరి నారాయణ రావు గారు సూచించిన రాయల సీమ పేరును ఆనాడు ప్రతిపాదించి ఆమోదింప జేసిన వ్యక్తి హరి సర్వోత్తమ రావు గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు.

1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం గాడిచర్ల వైపు దృష్టి మరల్చారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. గ్రంథాలయ సర్వస్వము, ఆంధ్ర గ్రంథాలయం పత్రికలకు సంపాదకత్వము వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు అధ్యక్షత వహించారు. దాని తరపున ఆంధ్ర ప్రాంతమంతా  విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.

1955లో హైదరాబాద్ లో తెలుగు భాష సమితిని ప్రారంభించారు. కర్నూల్ జిల్లా మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్య మృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు గాడిచర్ల కృషి చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించారు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.అంతటి సర్వోత్కృష్టమైన గాడిచర్ల జయంతి (సెప్టెంబరు 14)ని తెలుగు సంపాదకుల దినోత్సవంగా జరుపుకోవాలి. కొరవడిన సంపాదకుల స్వేచ్ఛ, సామర్థ్యాలు, మితిమీరిన రాజకీయ, స్వార్థ ప్రయోజనాలతో కూడిన జర్నలిజం ధోరణుల మధ్య పెరగవలసిన మేధో సంపాదకుల పాత్ర గురించి ఈ సందర్భంలో చర్చించుకోవాలి. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com