భారతీయ స్వరామృత ధార - ఎం.ఎస్
- September 16, 2024కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని తెల్లవారుజామున “సుప్రభాతం” తో మేలుకోలుపే స్వరం. “జ్యో అచ్యుతానంద” అని నిదుర పుచ్చే స్వరమూ అదే. ఆ గొంతులో లో ఒక పవిత్రత , దైవత్వం, ఆమె కీర్తనలు వింటుంటే ఒక స్వాంతన భావన కలుగుతుంది. దైవ చింతన లేని వారు సైతం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఆలపించిన స్తోత్రాలను వింటే భక్తులుగా మారిపోతారేమో. పాట, స్తోత్రం, కీర్తన ఏదైనా..ఏ భాషలో ఉన్నా అర్థం, ఉచ్ఛారణ తెలుసుకుని భావం మనసులోకి అనువదించుకుని లీనమై పాడే అంకితభావం సుబ్బులక్ష్మి గారిది. నేడు ఆమె జన్మదినం.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబర్ 16 న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. ఆమెకు తల్లి ఆది గురువు. పదేళ్ళ వయస్సులో సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. ఏ కారణం లేకుండా తనను టీచరు కొట్టిందనే కోపంతో బడికి వెళ్ళడం మానేసారు చిన్నారి సుబ్బులక్ష్మి.
సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది. తన ప్రతిభతో అనతి కాలంలోనే భారతజాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది.1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమై..సంగీత ప్రియులను తన మధుర స్వరంతో ఓలలాడించింది. అయితే ఏభాషలో పాడినా.. అది తన మాతృభాషలో పాడినట్టుగా భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం మరో విశేషం. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన సదాశివన్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు నాలుగు తమిళ సినిమాలు, వీటిలో మీరాబాయిని హిందీలో రీమేక్‌లోనూ నటించారు ‘మీరా’ చిత్రం హిందీలో కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి.
ఎంత పేరు వచ్చినా 66 సంవత్సరాల వయసులోనూ నాలుగు గంటల కచేరీ ఇవ్వటానికి మూడు గంటలపాటు సాధన చేయటం ఆమె అంకితభావానికి నిదర్శనం. కచేరీ చేసే ప్రతిసారీ ఎలా చేస్తానో అని ఆందోళనపడటం, ఆపై అత్యద్భుతంగా కచేరీ కొనసాగించటం ఆమెకు అలవాటయిన విషయం. 72 ఏళ్ళ వయసులో నిత్యవిద్యార్థిలా 72 మేళకర్త రాగమాలికను నేర్చుకుని, రికార్డు చేసింది. నిద్ర, తిండి లాంటి కనీస అవసరాలకు తప్ప రోజంతా సాధన చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.
కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన మహనీయురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాల్సిందే. ఓ భజన కీర్తనలను మొక్కుబడిగా పాడటం వేరు, దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.
సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో అధ్యాయం అని చెప్పక తప్పదు. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాధనే ఆమె పెంచుకున్నారు. భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ గారి కృషి ఎంతో ఉంది.
ప్రేక్షకులు కొట్టే చప్పట్లపై ధ్యాస కాకుండా...తాదాత్మ్యంతో పాడటం వల్ల ఆ గానం అజరామరమయింది. మరే గాయకులకూ సాధ్యం కానంత పేరు ప్రతిష్ఠలు పొందినా అవేమీ పట్టనంత నిరాడంబర స్వభావం ఆమెది. ఆమె పలికే తెలుగు పదాల్లో ఉచ్ఛారణ దోషాలున్నాయని బెంగుళూరు నాగరత్నమ్మ చేత మాట అనిపించుకున్న సుబ్బులక్ష్మి .. సాధన చేసి ఆ లోపం సవరించుకుంది. ఐదేళ్ళ తర్వాత అదే వ్యక్తి చేత ప్రశంసలు పొందింది. వేంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం ..ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
సుబ్బులక్ష్మి సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించేవారు. తిరుపతిలో సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.
సుబ్బులక్ష్మి గారి సంగీత కళా వైదుష్యానికి ముగ్దులైన పెద్దలెందరో ఎన్నో విధాలుగా ప్రశంసించారు. దేశంలోని ఏడు విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్‌లు ప్రకటించి గౌరవించాయి. ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవి భూషణ్ అవార్డులను అందజేసింది. ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఇలా ఎన్నో మరెన్నో అత్యుత్తమ పురస్కారాలు ఆమె అందు కున్నారు.
భారత సాంస్కతిక రాయబారిగా లండన్, న్యూయార్క్,కెనెడా, తూర్పుతీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివన్ మరణం తరువాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు. 1998లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం ఆమె పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఆ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి సుబ్బులక్ష్మి గారు కావడం విశేషం. కొన్ని దశాబ్థాల పాటు తన గాత్రంలో పులకింప చేసిన సంగీత స్వరధార ఎం.ఎస్ సుబ్బులక్ష్మి గారు 2004, డిసెంబర్ 11న ఆనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతూ ఉంటుంది.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం