విలక్షణమైన నిర్మాత...!
- September 16, 2024తెలుగు చలన చిత్రసీమలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అభిరుచి గల నిర్మాతగా నిలిచారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి . ఆరంభంలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ ఇంతింతై వటుడింతై అన్నచందాన తరువాత నిర్మాతగా మారి, తెలుగువారిని అలరించే చిత్రాలు తెరకెక్కించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.తెలుగు చిత్రపరిశ్రమ భాగ్యనగరంలో స్థిరపడ్డానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారు. నేడు ఆయన వర్థంతి.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి పూర్తిపేరు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. 1920, అక్టోబరు 4న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు గ్రామంలో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ తమ్మారెడ్డి కృష్ణమూర్తిలో అభ్యుదయ భావాలు మెండుగా ఉండేవి. ఉరకలు వేసే యువరక్తంతో స్వరాజ్య పోరాటంలోనూ పాలు పంచుకున్నారు. కమ్యూనిస్టు భావాలు ఆయన్ను బాగా ఆకర్షించాయి. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి 'స్వతంత్ర భారత్' అనే పత్రిక వ్రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. తన మిత్రుడైన సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించారు.
కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూనే ప్రముఖ సంఘసంస్కర్త, హేతువాది 'గోరా' భవజాల ప్రభావానికి గురై, 1945లో తన మిత్రుడైన పొట్లూరి రాఘవయ్య చెల్లెలు బాల వితంతువైన కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. కమ్యూనిస్టుల కార్యకలాపాల మీద ఆంధ్రాలో పోలీసుల నిఘా పెరగడంతో 1950లో వీరి కుటుంబమంతా మద్రాసు చేరింది. ఆ నాటి సంయుక్త మదరాసు రాష్ట్రంలో చెన్నపట్టణమే రాజధాని. మదరాసు చేరి తొలుత కొంతమంది సినిమా నటీనటుల పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. ఈ దశలోనే సినిమాల మీద ఆసక్తితో తనకున్న పరిచయాల ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు.
'పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్' సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నటరత్నఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పల్లెటూరు’ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఆ పై సారథీవారి ‘రోజులు మారాయి’కి కూడా ప్రొడక్షన్ వ్యవహారాలు చూశారు. సారథీ అధినేత సి.వి.ఆర్. ప్రసాద్ కు కృష్ణమూర్తి మాటంటే ఎంతో గురి. తెలుగునేలపై స్టూడియో నిర్మించాలన్న ప్రసాద్ ఆలోచనకు కృష్ణమూర్తి కూడా సై అన్నారు. అలా హైదరాబాద్ లో సారథి సినీస్టూడియోస్ నిర్మాణం సాగింది.ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. "సారథి నా విశ్వవిద్యాలయం" అని ఆయన చెప్పుకునేవారు.
సారథి పతాకంపై ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “కలసివుంటే కలదు సుఖం, ఆత్మబంధువు” చిత్రాలకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆ సినిమాల నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ తో కృష్ణమూర్తికి అనుబంధం ఏర్పడింది. ఆయనతో సినిమా నిర్మించాలను కున్నారు.1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. తర్వాతి కాలంలో ఆయన స్థాపించిన పలు సంస్థలన్నీ రవీంద్రతోనే మొదలయ్యాయి. ఆయన కూడా డేట్స్ ఇవ్వడంతో ‘రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై డి. వెంకటపతి రెడ్డితో కలసి ‘లక్షాధికారి’ చిత్రం నిర్మించారు కృష్ణమూర్తి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘లక్షాధికారి’ మంచి విజయం సాధించింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కృష్ణమూర్తి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి హైదరాబాద్ వేదికగా చిత్రాలను నిర్మించసాగారు. అదే సమయంలో హైదరాబాద్ లోనే స్థిరపడ్డ ఏయన్నార్ తో ఆయన వరుసగా చిత్రాలు నిర్మించారు. తొలుత తమ బ్యానర్ పేరు ‘రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్’ ఉండగా, తరువాత తానే సోలో ప్రొడ్యూసర్ గా ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించారు. ఏయన్నార్ హీరోగా ఇదే పతాకంపై మొదట ‘జమీందార్’ చిత్రం తీశారు. ఆ తరువాత అక్కినేనితోనే ‘బంగారు గాజులు’ నిర్మించారు. ఆ పై ఏయన్నార్ తోనే ‘ధర్మదాత’ తెరకెక్కించారు. వరుసగా ఈ చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించాయి.
ఆయన పెద్ద కుమారుడు లెనిన్ బాబు దర్శకత్వంలో ఏయన్నార్ తో రంగుల్లో ‘దత్తపుత్రుడు’ నిర్మించారు.ఈ సినిమాల తరువాత శోభన్ బాబుతో వరుసగా “సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్ బాబు, ఇద్దరు కొడుకులు” వంటి చిత్రాలు నిర్మించారు. శోభన్ బాబు, జయలలిత నటించిన ఏకైక చిత్రం ‘డాక్టర్ బాబు’ వీరు నిర్మించినదే. ‘డాక్టర్ బాబు’ మంచి విజయం సాధించింది. ‘ఇద్దరు కొడుకులు’ చిత్రంలోనే సత్యరాజ్ విలన్ గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.
“అమ్మానాన్న, చిన్ననాటి కలలు, లవ్ మ్యారేజ్” వంటి చిత్రాలనూ నిర్మించారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి. రెండు చిత్రాలు మినహాయిస్తే ఆయన చిత్రాలన్నిటికీ టి.చలపతిరావు సంగీతం సమకూర్చడం విశేషం. చలపతి రావు స్వరకల్పనలో రూపొందిన “లక్షాధికారి, జమీందార్, బంగారు గాజులు, ధర్మదాత, దత్తపుత్రుడు, సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్ బాబు” చిత్రాల్లోని పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉండడం విశేషం. కాలానుగుణంగా సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు మళ్ళీ సినిమాలు తీయలేదు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి మరో కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ తరువాత తండ్రి బాటలోనే పయనిస్తూ నిర్మాతగా మారారు. ఆపై దర్శకత్వమూ వహించారు.
తెలుగునాట చిత్రసీమ అభివృద్ధికి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఎంతో కృషి చేశారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య గార్లను ఒప్పించి చెన్నై నుంచి భాగ్యనగరంలో సినీపరిశ్రమ స్థిరపడేందుకు ముఖ్య భూమిక వహించారు. తెలుగు భాషా పరిరక్షణకు నడుంకట్టి తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడిగా, తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారుగా వ్యవహరించారు.జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. 2007 సంవత్సరంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013 సెప్టెంబర్ 16న హైదరాబాదులో తమ్మారెడ్డి కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం