వరద బాధితులకు TANA ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం

- September 16, 2024 , by Maagulf
వరద బాధితులకు TANA ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం

విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను తానా ఫౌండేషన్ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లాకార్యాలయంలో వరద సహాయ కార్యక్రమాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. అలాగే అవనిగడ్డలో బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.  మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 200 వరద బాధిత కుటుంబాల వారికి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది రకాల నిత్యావసర సరుకులు, టవల్స్ సహాయంగా పంపిణీ చేశారు. గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికి 5కేజీ ల బియ్యం.. 1కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమపిండి, 1కేజీ ఆయిల్ ప్యాకెట్, 1కేజీ సాల్ట్, 1/2కేజీ పుట్నాలపప్పు, 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 100 గ్రాముల సాంబార్ పౌడర్, 100 గ్రాముల పసుపు, 100గ్రాముల కారం, మరియు ఒక కండువా చొప్పున నిత్యావసర సరుకులను సంస్థ వారు అందజేశారు. 

ఎన్టీఆర్ జిల్లాలో తానా ఫౌండేషన్ సహాయ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మరియు బిజెపి స్టేట్ మీడియా ఇన్ చార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రమేష్, శ్రీధర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పాల్గొని తానా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు.కృష్ణానది వరదలతో సర్వం కోల్పోయిన లంక గ్రామాలలోని ప్రజలకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చి జిల్లాల్లో సుమారుగా ఆరు వేల కుటుంబాలకు సహాయమందించిన తానా సంస్థకు, ఛైర్మన్ శశికాంత్ కి, ఇతర తానా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తానా సభ్యులు చొరవను ప్రశంసించారు.కార్యక్రమంలో సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని టిడిపి గ్రామ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి బీవీ రావు, వేమూరి వెంకటరావు, స్వచ్ఛంద కార్యకర్తలు శశికళ, సోనీబాబు, సుకన్య, దివ్య, రాము తదితరులు పాల్గొన్నారు.

ఈ సహాయ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తానా టీమ్‌ను తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com