గ్లోబల్ లీడర్... !

- September 17, 2024 , by Maagulf
గ్లోబల్ లీడర్... !

నరేంద్ర మోడీ.. అంతర్జాతీయంగా ఈ పేరుకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సామాన్య కార్యకర్త నుంచి భారతదేశ ప్రధానిగా ఎదిగారు మోడీ. ఇటు దేశ రాజకీయాలైనా.. అటు ప్రపంచ సమస్యలైనా.. ఆయన స్పందించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందిరితో ఆయన మెలిగే విధానం, స్పందించే గుణం.. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.. అందుకే.. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ ఆయన సొంతం. వరుసగా మూడో సారి భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నేడు ఆయన జన్మదినం ఈ సందర్బంగా ఆయన రాజకీయ ప్రయాణం గురించి మీకోసం..

నరేంద్ర మోడీ పూర్తిపేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. 1950,సెప్టెంబర్ 17న అవిభక్త బొంబాయి రాష్ట్రంలో భాగమైన గుజరాత్ ప్రాంతంలోని వాద్‌నగర్‌ అనే చిన్న పట్టణంలో దిగువ మధ్యతరగతి దామోదర్‌దాస్ మోడీ, హీరా బెన్ దంపతులకు జన్మించారు. పాఠశాల విద్యను వాద్‌నగర్‌లో, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ,  గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

మోడీ తండ్రి దామోదర్‌దాస్ మోడీ వాద్‌నగర్‌ రైల్వే స్టేషన్ వద్ద టీ దుకాణాన్ని నడిపేవారు. చిన్నారి మోడీ సైతం తన సోదరులతో కలిసి తండ్రికి సహాయంగా అక్కడ పనిచేసేవారు. చదువుల్లో కన్నా ఆటపాటల్లో చురుగ్గా ఉండే మోడీ, భారత సైన్యం పట్ల చిన్నతనంలోనే మక్కువ పెంచుకున్నారు. సైనిక్ స్కూల్లో చదివేందుకు ఆసక్తి ఉన్న తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మోడీ టీ కొట్టు ఉన్న వాద్‌నగర్‌ రైల్వే స్టేషన్ వద్దకు తరచూ ఆరెస్సెస్ గుజరాత్ మొదటి ప్రచారకుల్లో ఒకరైన వకీల్ సాబ్ గా ప్రసిద్ధి గాంచిన లక్ష్మణ్ రావ్ మాధవ్ రావ్ ఇనాందార్ ద్వారా ఆరెస్సెస్ శాఖలోకి బాల స్వయంసేవకుడిగా ప్రవేశించారు.

వకీల్ సాబ్ ప్రేరణతో ఆరెస్సెస్ పట్ల భక్తి భావాన్ని పెంపొందించుకున్నారు. ఒకవైపు స్కూల్ పాఠాలతో పాటుగా వివేకానంద, రామకృష్ణ పరమహంస సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివి వివేకానందుడిని తన వ్యక్తిత్వ వికాస గురువుగా అభిమానించడం ప్రారంభించారు. వివేకానందుడి స్పూర్తితో 17ఏళ్ళ వయస్సులోనే దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాలులోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్ళాడు, కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించక పోవడంతో అక్కడి నుండి బీహార్ మీదగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపారు.

తన 20వ ఏట తిరిగి వాద్‌నగర్‌ చేరుకున్నారు. అలా,17 నుంచి 20 ఏళ్ళు వయస్సులో ఉత్తరభారతంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఈ పర్యటన ఆయన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం వైపు నడిపించేందుకు తోడ్పడింది. వాద్‌నగర్‌లో ఎక్కువ రోజులు ఉండకుండా అహ్మదాబాద్ నగరంలో తన మేనమామ నడుపుతున్న ఆర్.టి.సి టీ దుకాణంలో పనిచేస్తూన్న సమయంలో జనసంఘ్ నేతలు వసంత్ భాయ్ గజేంద్రద్కర్, నాథు లాల్ జగ్దాలతో ఏర్పడ్డ పరిచయం ద్వారా స్థానిక రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. మోడీలోని రాజకీయ చురుకుదనాన్ని గమనించిన గజేంద్రద్కర్, జగ్దాలు తమతో పాటు రాజకీయ కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు.

 ఇదే సమయంలో ఆ నగరంలోనే ఉంటున్న తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి సంఘంలోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖల్లో మోడీ అందరికి సుపరిచితం అయ్యారు. వకీల్ సాబ్ శిక్షణలో రాటుదేలుతూ ఆయన సిపారస్సుతో నాగపూర్ సంఘ కార్యాలయంలో ప్రచారాలకు అందించే కీలకమైన శిక్షణ పొందారు. వకీల్ సాబ్,గజేంద్రద్కర్, జగ్దాల ద్వారా అహ్మదాబాద్ ప్రాంతంలో ఉన్న సంఘ్ సానుభూతిపరులైన కీలకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి.1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు వకీల్ సాబ్ తరుపున విజయవంతంగా నిర్వహించి సంఘ పెద్దల దృష్టిలో పడ్డారు. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో మోడీకి సంఘంలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు.

1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా వారు పోలీసులకు చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో భద్రత కల్పించే బాధ్యతను మోడీకి సంఘ పెద్దలు అప్పగించారు. ఈ సమయంలోనే సంఘం విద్యార్ధి విభాగం ఏబీవీని నడిపించే బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఎమెర్జెన్సీ తర్వాత గుజరాత్ ఆరెస్సెస్ సంభాగ్ ప్రచారక్ (ప్రాంతీయ సమన్వయకర్త) అయ్యారు. అనంతరం, ఢిల్లీ వెళ్లి ప్రముఖ కార్మిక నాయకుడు, సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ తేంగ్డేకు పలు పుస్తకాల రచనలో సహాయకుడిగా పనిచేయడమే కాకుండా రాజధాని రాజకీయ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు.

1980లో గుజరాత్ రాష్ట్రానికి తిరిగి వచ్చి సంఘంలో అంచెలంచెలుగా ఎదుగుతూ గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖ్ గా 1986 వరకు ఆ బాధ్యతల్లోనే కొనసాగారు. ఈ సమయంలోనే అమిత్ షా అనే ఏబీవీపీ విద్యార్ధి నేత మోడీకి పరిచయం అయ్యాడు.1986లో భాజపాను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అప్పటి భాజపా జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీజీ సంఘ్ నుంచి మానవ వనరుల కోసం సంఘ్ చాలక్ దేవరస్ గారిని అభ్యర్థించగా, అందుకు సానుకూలంగా స్పందించి అప్పటికి సంఘంలో సీనియర్ యువ నేతలైన గోవిందాచార్య, మోడీతో పాటుగా పలువురిని భాజపా తరుపున పనిచేసేందుకు నియమించబడ్డారు. గోవిందాచార్య అద్వానీ వ్యక్తిగత కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లోకి అడుపెట్టగా, మోడీ మాత్రం తన స్వరాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర భాజపా నిర్వాహక కార్యదర్శిగా నియమించబడ్డారు.

మోడీ భాజపాలో చేరిన తర్వాత 1987లో వచ్చిన అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డారు. గుజరాత్ పట్టణాల్లో భాజపాకు ఉన్న మద్దతును బలమైన ఓటు బ్యాంకుగా మార్చేందుకు కీలకంగా కృషి చేశారు.1988-90 వరకు మోడీ పలు యాత్రలు నిర్వహించి వ్యక్తిగతంగా తన ఇమేజీను పెంచుకుంటూనే, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారు. ఈ యాత్రల నిర్వహణలో బిజెవైఎం యువనేత అమిత్ షా తెరవెనుక కీలకంగా పనిచేశారు. 1990లో అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా మోడీ పనిచేశారు.

1990 చివర్లో వచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా - జనతాదళ్ కూటమి అధికారంలోకి రావడంలో మోడీ పాత్ర కీలకం. జనతాదళ్ నాయకుడు చిమన్ భాయ్ పటేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీకి రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అధికార కార్యకలాపాల మీద అవగాహన కలిగించారు. చిమన్ భాయ్ సీఎంగా ఉన్న సమయంలోనే 1993లో మోడీ గుజరాత్ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1993-95 వరకు భాజపా గుజరాత్ రాష్ట్రంలో బాగా బలపడి, 1995 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా విజయాన్ని కైవసం చేసుకుంది.భాజపా అగ్రనేత కేశుభాయి పటేల్ గుజరాత్ సీఎం పీఠం మీద కూర్చోబెట్టడంలో మోడీ పాత్ర కీలకం.

1995-96 వరకు కేశుభాయి పటేల్ సీఎం కార్యాలయంలో మోడీ బలమైన శక్తిగా, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు.   ఇదే సమయంలో పటేల్ సీఎం అవ్వడం సహించలేని మరో అగ్రనేత శంకర్ సింహ్ వాఘేలా తిరుబాటు చేయడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు మధ్యే మార్గంగా మోడీని గుజరాత్ నుంచి ఢిల్లీకి పంపించారు. భాజపా జాతీయ కార్యదర్శిగా నియమితులైన మోడీని అప్పటి పార్టీ అధ్యక్షుడు అద్వానీ ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించారు. ఆయా రాష్ట్రాల ఇంఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.  1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంతి రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని యాత్రను విజయవంతంగా నిర్వహించి భాజపా అధిష్టానం మెప్పును పొందారు.

1998లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ సంవత్సరంలో జరిగిన లోక్ సభ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం కోసం తీవ్రంగా శ్రమించి పార్టీ గెలుపులో భాగస్వామ్యం పంచుకున్నారు. 1999లో వచ్చిన 13వ లోక్ సభ ఎన్నికల్లో సైతం పార్టీ విజయం కోసం కృషి చేసి పార్టీ వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తిగా మోడీ మారారు. 2001లో అనుహ్యంగా గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోడీ, 2014 వరకు పనిచేశారు. గుజరాత్ సీఎంగా మోడీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికే ఆదర్శంగా గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని  నమూనాగా నిలిపారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో భాజపా నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా సంచనల విజయాన్ని నమోదు చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014-19 మధ్యలో పాలనలో పలు విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2019లో సైతం విజయ దుందుభి మోగించి రెండోసారి మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. మోడీ 2.0 పేరుతో మొదలైన పాలనలో కరోనా మహమ్మారిని విజయవంతంగా నిర్ములించడంతో పాటుగా ఆత్మనిర్భర్ పేరుతో స్వదేశీ తయారీ రంగానికి ఊతమిచ్చారు. అలాగే,దేశ రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేశారు. పదేళ్ల పాటు అవినీతి రహిత పాలనను అందించడంతో ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత రెట్టింపైంది. ఒకవైపు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో మోడీ గారి పాత్ర అద్వితీయం. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం చేత ప్రజల్లో వచ్చే అసమ్మతిని తట్టుకొని మరీ సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కడం అనేది స్వతంత్ర భారత దేశ రాజకీయ యావనికలో ఒక అపూర్వమైన ఘట్టం. దేశ ప్రప్రథమ ప్రధాని నెహ్రూ తర్వాత ఆయన వారసురాలైన ఇందిరా గాంధీకే సాధ్యం కానీ ఘనతను సుసాధ్యం చేస్తూ వరుసగా మూడోసారి భారత దేశ ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. తన విధానాలు, పాలనా దక్షత, సామర్థ్యంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న మోడీని సామాన్యు ప్రజలు తమ వాడిగా అక్కున చేర్చుకొని, దేశం సుభిక్షంగా ఉండాలంటే అది ఒక్క మోడీతోనే సాధ్యం అని నమ్మి మూడో పర్యాయం ఆయన్ని గెలిపించుకున్నారు.


ప్రధాని మోడీ జీవితం ఎందరికో ఆదర్శనీయం.. ఆయన నమ్మిన సిద్ధాంతాలు..వ్యక్తిగత క్రమశిక్షణ.. ప్రజల పట్ల నిబద్దత ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది.. మోడీ చెప్పే ప్రతీ మాట కూడా ఒక హుందాతనంతో పాటు ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఏ దేశానికి వెళ్లినా సంస్కృతి సంప్రదాయాలను వీడరు.. ఇంకా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని.. పరిష్కరించేందుకు ముందుంటారు. ఈ ప్రత్యేకమైన చొరవే ఆయన్ను గ్లోబల్ లీడర్ గా మార్చింది. ప్రపంచ రాజకీయ పటంలో తిరుగులేని రాజకీయ శక్తిగా, విశ్వగురువుగా భారత దేశాన్ని నిలిపేందుకు శక్తివంచన లేకుండా మోడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.  


- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com