అరుదైన వ్యక్తిత్వం గల అమల

- September 24, 2024 , by Maagulf
అరుదైన వ్యక్తిత్వం గల అమల

అగ్ర కథానాయికగా సాగుతున్న దశలోనే తనతో అత్యధిక చిత్రాల్లో నటించిన అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లాడారు అక్కినేని అమల. అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల. నేడు సీనియర్ నటి అక్కినేని అమల పుట్టినరోజు.

అక్కినేని అమల అలియాస్ అమల ముఖర్జీ 1967 సెప్టెంబర్ 12న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జన్మించారు. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ కుటుంబానికి ఇండియన్ నేవీ అధికారి. అమల తండ్రికి తరచూ బదిలీలు కావడంతో వారి కుటుంబం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. చెన్నైలో ఉన్న సమయంలోనే ప్రముఖ నాట్యకారిణి రుక్మిణి దేవి అరండేల్ గారు స్థాపించిన ‘కళాక్షేత్ర’లో చేరి భరతనాట్యంలో బి.ఎఫ్.ఏ. చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్, అమలను తన ‘మైథిలీ ఎన్నై కాదలి’ చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు.ఆ సినిమా ఘనవిజయంతో అమలకు అవకాశాలూ వెల్లువెత్తాయి.

తెలుగులో నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’ చిత్రంతో జనం మదిని దోచేశారు అమల. ఆ తరువాత “రక్తతిలకం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, ఆగ్రహం” వంటి చిత్రాలలో నటించారు. నాగార్జునతో కలసి అమల “చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమయుద్ధం” వంటి చిత్రాలలో అలరించారు. నాగార్జున కెరీర్ ను పెద్ద మలుపు తిప్పిన ‘శివ’ తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లోనూ అమల నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఆరోజుల్లో దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయినుగా రాణించిన అమల పలు అవార్డులు అందుకున్నారు.

వెండితెరపై హీరో నాగార్జునకు విజయనాయికగా నిలచిన అమల, తరువాత కాలంలో జీవితనాయిక అయ్యారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వారి కుమారుడు అఖిల్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ బాల్యంలోనే ‘సిసింద్రీ’గా నటించి ఆకట్టుకున్నాడు. ‘సిసింద్రీ’ షూటింగ్ సమయంలో అమల తన తనయుడు అఖిల్ ను నటింప చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలుసు. జంతు ప్రేమికురాలైన అమల వాటి సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్ సంస్థ’ను ఏర్పాటు చేసి, తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించారు.

సుమారు రెండు దశాబ్దాల తర్వాత 2012లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన "లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ " చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అమల అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన ‘మనం’లోనూ ఆమె కాసేపు కనిపించారు. బుల్లితెరపైనా కొన్ని సీరియల్స్ లో నటించారు.ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు అమల. నటిగా, తల్లిగా, జంతు సంరక్షకురాలిగా బిజీగా గడుపుతున్న అమల గారు మరిన్ని పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.

  - డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com