వెండితెర అభినవ శకుని....!

- September 24, 2024 , by Maagulf
వెండితెర అభినవ శకుని....!

తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలో..... రెండింటిలోనూ తన అసమాన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి. తెలుగు చిత్రసీమలో శకుని అనే పేరు వినిపించగానే గుర్తుకొచ్చే నటులు... సీఎస్సార్, లింగమూర్తి. వాళ్ల తర్వాత ఆ పాత్రపై తనదైన ముద్ర వేసిన నటుడు ధూళిపాళ. ప్రత్యేకమైన వాచకం, హావభావాలతో శకుని పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేశారాయన. నేడు వెండితెర అభినవ శకునిగా ప్రసిద్ధి గాంచిన స్వర్గీయ ధూళిపాళ సీతారామశాస్త్రి గారి జయంతి.

ధూళిపాళ సీతారామశాస్త్రి గారు 1922, సెప్టెంబర్ 24న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లి గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు రత్నమ్మ, శంకరయ్యలు. దాచేపల్లి గ్రామంలోని వారి ఇంటి వెనక నాగులేరు ప్రవహిస్తూ వుండేది. పండ్లతోటలు, తమలపాకు తోటలతో ఆ గ్రామం కళకళలాడుతూ వుండేది. తండ్రి వేదాధ్యయనం చేసినా, యాభై ఎకరాల పొలంతో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకొని రైతుగా స్థిరపడ్డారు. శాస్త్రి గారికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు తోబుట్టువులు. అంత పొలం వున్నా, మెట్టప్రాంతం కావడంతో వచ్చే ఫలసాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది.

శాస్త్రి ప్రాథమిక విద్యను దాచేపల్లిలోనే పూర్తి చేశారు. తరవాత వేదాధ్యయనం కోసం బాపట్ల వెళ్లి సంస్కృత కళాశాలలో శాస్త్ర పాఠాలు అభ్యసించారు. అనంతరం గురజాల తిరిగివచ్చి ఒక న్యాయవాది వద్ద గుమాస్తాగా చేరారు. తను కూడా వకీలుగా రాణించాలనే ఆశవున్నా అది నెరవేరలేదు. గుమాస్తా గిరి చేస్తూనే ఇంగ్లీషు భాషమీద పట్టు సాధించారు. సంగీతం మీద, నాటక కళల మీద ధూళిపాళకు మక్కువ ఉండడంతో గుంటూరు పట్టణానికి దగ్గరలో వున్న ఒక గ్రామంలో 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శన జరుగుతూ వుంటే అక్కడకు వెళ్లి అందులో సత్యభామ చెలికత్తె (నళిని)వేషం ధరించారు. అప్పుడు ధూళిపాళకు పదిహేనేళ్ళు. తరవాత వరసగా ధూళిపాళకు స్త్రీ పాత్రలు ధరించే వేషాలు చాలా వచ్చాయి. అలా మూడేళ్ళ వరకు స్త్రీ పాత్రలే పోషిస్తూ వచ్చారు.

ప్రముఖ రంగస్థల నటులు మాధవపెద్ది వెంకట్రామయ్య ధూళిపాళ నటన చూసి, ఆడవేషాలకు స్వస్తిపలకమని సలహా ఇచ్చారు. దాంతో ధూళిపాళ ఆయనవద్ద శిష్యరికం చేశారు. వెంకట్రామయ్య గారి శిక్షణలో దుర్యోధన పాత్ర పోషించడంలో మెళకువలు నేర్చుకొని, అఖిలాంధ్ర పాండవోద్యోగ నాటక పోటీలలో ప్రధమ బహుమతి పొందారు. తరవాత ఆంధ్రప్రదేశ్ నాటక కళాపరిషత్ నిర్వహించిన ఏకపాత్రాభినయ పోటీల్లో మయసభ సన్నివేశంలో దుర్యోధనుడిగా నటించి ప్రధమ బహుమతి స్వీకరించారు. ఆ తరవాత బ్రహ్మనాయుడు, యుగంధరుడు, బిల్వమంగళుడు, రంగరాయుడు పాత్రలు పోషించి మంచి రంగస్థల నటుడుగా పేరు తెచ్చుకున్నారు.

 1941లోగుంటూరులో ‘స్టార్ థియేటర్స్’ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి అనేక పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఆరోజుల్లో కురుక్షేత్రం నాటక ప్రదర్శన జరిగితే మొదటి కృష్ణుడుగా ఈలపాట రఘురామయ్య, రెండవ కృష్ణుడుగా పీసపాటి నరసింహమూర్తి, మూడవ కృష్ణుడుగా షణ్ముఖి ఆంజనేయరాజు నటిస్తే దుర్యోధన పాత్రను ధూళిపాళ పోషించేవారు.1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించారు. ఆ నాటకానికి ప్రసిద్ధ దర్శకనిర్మాత బి.ఎ. సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, జి. వరలక్ష్మి వంటి ఉద్దండులు విచ్చేసి ధూళిపాళ సంభాషణలు పలికే తీరును నిశితంగా గమనించారు. ప్రేక్షకులనుండి ధూళిపాళ సంభాషణలకు కరతాళ ధ్వనులు మ్రోగడం అతనికి లాభించింది. దాంతో ధూళిపాళ సినిమారంగ ప్రవేశానికి దారులు తెరచుకున్నాయి.

బి.ఎ. సుబ్బారావు సినిమాలో నటించే అవకాశం కలిపిస్తానని మాట ఇచ్చారు. అయితే ధూళిపాళ కు నాటకాల మీద వున్న మోజు సినిమాలమీద లేదు. ఆయన పెద్దగా సినిమాలు చూసిందీలేదు. ఒకరోజు మద్రాసుకు రమ్మని బి.ఎ.ఎస్ ప్రొడక్షన్స్ అధిపతి బి.ఎ. సుబ్బారావు వద్దనుంచి ధూళిపాళ కు వుత్తరం వచ్చింది. ఆయన పెద్దన్నయ్య ప్రోద్బలంతో ధూళిపాళ తెనాలి వెళ్లి చెన్నై రైలెక్కారు. బి.ఎ. సుబ్బారావు ‘భీష్మ’ (1962) చిత్రాన్ని నిర్మిస్తూ అందులో దుర్యోధనుడి పాత్రను ధూళిపాళ కు ఇచ్చారు. తొలిరోజు షూటింగులో భీష్ముణ్ణి సర్వసైన్యాధ్యక్షునిగా దుర్యోధనుడు ప్రకటించే సన్నివేశం తీస్తున్నారు. ఎదురుగా భీష్ముని వేషంలో ఉన్న నటరత్న ఎన్టీఆర్ గారికి సుబ్బారావు పరిచయం చేయగా ఆయన ధూళిపాళను మందహాసంతో స్వాగతించారు. ధూళిపాళ చెప్పిన డైలాగు తొలిషాట్ లోనే ఒకే అయింది. అలా ఎన్టీఆర్ గారితో కలిగిన పరిచయం స్నేహంగా చిగురించి వీరు చిత్రసీమను వదిలేదాకా కొనసాగింది. ‘భీష్మ’చిత్రం విడుదలై ఘనవిజయం సాధించడంతో ధూళిపాళ కు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి.

నటుడనేవాడు తనని తాను మరచిపోకుండా తాత్కాలికోద్రేకంలో, సృజనాత్మక శక్తి కలిగినప్పుడు మాత్రమే తన భావ ప్రకటన ద్వారా రసోత్పత్తిని కలిగించగలుగుతాడు అనే సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటించినవారు ధూళిపాళ. అందుకు ప్రేరణ 1966లో రామకృష్ణ ఎన్.టి.ఆర్ కంబైన్స్ పతాకం మీద ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ చిత్రంలో ధూళిపాళ నటన. ఈ చిత్రం ద్వారా భిన్న ప్రవృత్తులు గల శ్రీకృష్ణ, సుయోధన పాత్రలను తనే ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్.

భారత, భాగవత కథలను జల్లెడపట్టి, మరే సినిమాలోను చూపించని విధంగా శకుని జీవిత ఘట్టాలను ఇందులో పొందుపరచారు. ఇక శకుని పాత్ర ఎవరు ధరిస్తారా అనే మీమాంసకు తెరదించుతూ ఆ అవకాశాన్ని ఎన్టీఆర్ ధూళిపాళకు ఇచ్చారు. అది ద్విభాషా చిత్రం కావడంతో తెలుగు, తమిళ వర్షన్లలో కూడా ధూళిపాళనే ఆపాత్ర పోషించాల్సిందని సూచించారు. అంతకుముందు శకుని పాత్రను సియ్యస్సార్ ఆంజనేయులు, ముదిగొండ లింగమూర్తి, నెల్లూరి నగరాజరావు పోషించి మెప్పించి వున్నారు. ఆపాత్రను ధూళిపాళ చాలెంజ్ గా తీసుకొని వాచకంలోనూ, అభినయంలోను భిన్న ప్రవృత్తిని కనపరుస్తూ సాధన చేశారు. సినిమాలో శకుని పాత్ర బాగా పండింది. సినిమా సూపర్ హిట్ కావడంతో ధూళిపాళ సినీ ‘శకుని మామ’ అయిపోయారు. తరవాత ‘బాలభారతం’ (1972), ‘దానవీరశూర కర్ణ’ (1977) సినిమాల్లో శకుని పాత్ర ధూళిపాళనే వరించింది.

 “ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. కనుక హితపురోహిత ధృతవాక్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్యకళా వినోద మనోహరంబగు పరివారంబుతో, చతురంగ బలసమేతులై, శతసోదర సమన్వితులై శ్రీశ్రీశ్రీ గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే ….రాజసూయాన్ని సందర్శించ వలసిందే”.ఈ డైలాగు చెబుతూ రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడి ‘పితుహూ’ అని అరుస్తూ, కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుతూ (ఇప్పుడు పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చేసింది అదే), ఎడమ కనుబొమను విల్లులా వంచుతూ కనీ కనిపించని ప్రతీకారేచ్చతో మిళితమైన క్రూరమైన నవ్వుతో కనిపిస్తాడు శకుని వేషంలోని ధూళిపాళ. అలా కనిపించడం ఆయన ఒక్కరికే మాత్రమే సాధ్యమైన నటనా వైదుష్యం!

‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలో గయుడుగా, నర్తనశాలలో దుర్యోధనుడుగా, బొబ్బిలియుద్ధంలో నరస రాయలుగా, వీరాభిమన్యులో ధర్మరాజుగా, సీతాకల్యాణంలో వశిష్టుడుగా, మరికొన్ని సినిమాల్లో రావణాసురుడు, మైరావనుడుగా ధూళిపాళ నటించి మెప్పించారు. ధూళిపాళ బయట ఎక్కడైనా కనపడితే ‘శకుని మామ’ అని పిలిచేవారు. అలా ధూళిపాళ రెండు దశాబ్దాలపాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తూ వచ్చారు.సాంఘిక చిత్రాల్లో అటు దుష్టపాత్రలు, ఇటు సాత్విక పాత్రలు పోషించి మెప్పించారు. సుమారు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.

ధూళిపాళ వారి వ్యక్తిగత జీవితానికి వస్తే, చిన్నతనంలోనే వరలక్ష్మమ్మ గారితో వివాహమైంది.వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు.నాటక, సినీ రంగాల్లో ధూళిపాళ వారి నటనా ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటనకు నంది అవార్డును అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నాటక అకాడమీ వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.తమిళ పత్రికలు సైతం ఆయన్ను  ‘నడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువు’ అని అభివర్ణించారు. అంటే... నటనలో పులి...నడతలో (నిజజీవితంలో) గోవు అని అర్థం. 2007లో అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారు "ప్రతిభా పురస్కారం"తో సత్కరించారు. ఇవే కాకుండా, వివిధ సాంస్కృతిక సంఘాల వారు పలు మార్లు ఘనంగా సత్కరించారు.

నాటకాలు వేసేవాళ్ళు చెడిపోతార్రా అని ధూళిపాళను వారి తండ్రి హెచ్చరిస్తూ వుండేవారు. కారణం నాటకాల్లో వేషాలు వేసేవారు అధికశాతం వ్యసనాలకు బానిసలు కావడమే. తండ్రి చేసిన హెచ్చరికలు ధూళిపాళకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉండేవి. ఆ హెచ్చరికలను ధూళిపాళ జీవితాంతం గుర్తుపెట్టుకొనే మసలారు. మద్రాసులో షూటింగు జరిగితే ఇంటినుంచే భోజనం క్యారేజి వచ్చేది. అవుట్ డోర్ షూటింగుల్లో తప్ప నిర్మాతలు తెప్పించిన భోజనం ఆరగించిన రోజులు ధూళిపాళ చరిత్రలో లేవు. నిత్యకర్మ, ధూపదీప నైవేద్యాలు ధూళిపాళకు క్రమశిక్షణ నేర్పాయి.

ప్రతియేటా సతీసమేతంగా వారణాసికి వెళ్లి రెండుమూడు నెలలపాటు అక్కడేవుండి కాశీనాథుని పూజించేవారు. అక్కడ నవగ్రహ ఆలయం లేకుండడంతో ఆలయ నిర్మాణం చేయాలని ప్రయత్నించి అనారోగ్య కారణాల వలన ఆ ప్రయత్నాన్ని విరమించారు. గుంటూరులో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించే అవకాశాలను వదలుకొని, మద్రాసులో వున్న ఆస్తుల్ని అమ్ముకొని గుంటూరు చేరి అత్యంత దీక్షతో మారుతీ నగర్ లో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. దాంతో ధూళిపాళ మనసు ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళింది. తను నిర్మించిన ఆలయాన్ని కంచి కామకోటి పీఠానికి సమర్పించారు. మానవజన్మ విశిష్టతను, మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకొని తరించాలని భావించి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ స్వాముల చేతులమీదుగా సన్యాసం స్వీకరించారు. తనపేరును ‘మారుతీ సేవేంద్ర సరస్వతి’ గా మార్చుకున్నారు.

రామాయణం, సుందరకాండ గ్రంధాలను తెలుగులో రాసి ప్రచురించారు. ఒక ట్రస్టును ఏర్పాటుచేసి తద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూవచ్చారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి సుందరకాండను పారాయణంచేసి భక్తులను ఆశీర్వదించే వారు. గుంటూరులో ఒక కళావేదిక నిర్మించాలనే సత్సంకల్పంతో మూడుతరాల నటులతో నాటక ప్రదర్శన ఏర్పాటుచేసి నిధిని ప్రోగుచేసి కళాసేవకు తోడ్పడ్డారు. ఆ రంగస్థలం పైనే రెండులక్షల నిధి సమకూరడం ధూళిపాళ మీద ప్రజలకు వుండే గౌరవాన్ని సూచిస్తుంది. మానవశక్తిని బలీయమైన అతీంద్రియ శక్తి ఏదో నడిపిస్తుందని ధూళిపాళ నమ్మకం. కొంతకాలం ఊపిరితిత్తుల వ్యాధితో ధూళిపాళ బాధపడుతూ 2007,  ఏప్రిల్ 13న కాలంచేశారు. ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లేందుకు తన శేషజీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ.


  - డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com