వెండితెర రారాణి...!
- October 05, 2024
దక్షిణాది వెండి తెరమీద టాకీ చిత్రాలు మొదలైన కొత్తల్లో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి కన్నాంబ. నటనతో పాటు నాట్యం, సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో కన్నాంబ ఒకరు. అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో, అంతే అద్భుతమైన నటనా పటిమతో అలరారిన ఏకైక నటీమణి ఆమె. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో గాని, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో గాని కన్నాంబ నటన వర్ణనాతీతంగా ఉండేది. అటువంటి గొప్ప నటీమణి, నిర్మాత, గాయని మరియు వెండితెర రారాణిగా వెలుగొందిన కన్నాంబ జయంతి సందర్భంగా ఆమెను మరొకసారి స్మరించుకుందాం …
కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. 1911, అక్టోబర్ 5న కడప పట్టణంలో వెంకట నరసయ్య, లోకాంబ దంపతులకు జన్మించారు.ఆమె స్వస్థలం మాత్రం ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అవుకు గ్రామం. తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవారు. కన్నాంబ గారు ఎక్కువ కాలం వాళ్ళ ఆమ్మమ్మ గారింట ఏలూరులోనే పెరిగారు. కన్నాంబ తాత నాదముని నాయుడు వైద్యవృత్తిలో వుండేవారు. కన్నాంబ చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి కనబరచడంతో తాతగారు ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు.తన 13వ ఏటనే కన్నాంబ నాటకాల్లో నటించడం ప్రారంభించింది.
రంగస్థల అనుభవంతోనే 1935 లో ‘హరిశ్చంద్ర’ సినిమాలో చంద్రమతి, ‘ద్రౌపతి వస్త్రాపహరణం’ మూవీలో ద్రౌపతిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత పాదుక, చింద్రిక, పట్నాటి యుద్దం, కనకతార, గృహలక్ష్మి, అనార్కలి, దక్ష యజ్ఞం, తోడికొడళ్ళు ఇలా ఎన్నో సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించింది మంచి పేరు సంపాదించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, నాగయ్య, ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో దాదాపు 150కు పైగా పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించారు.
నటిగా ఉచ్చ దశలో ఉన్న సమయంలోనే రంగస్థలంలో పరిచయమైన కడారు నాగభూషణాన్ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ స్థాపించి ఎంతోమంది నటీనటులకు మంచి అవకాశం కల్పించారు. తెలుగు, తమిళ భాషల్లో 30 సినిమాలు దాకా నిర్మించారు. తమ కంపెనీలో ఉద్యోగస్థులకు, నటీనటులకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లిస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. ఒకటో తేది రాక ముందే జీతాలు చెల్లించేవారు అని పేరు ఉండేది. కన్నాంబ దాతృత్వం గురించి ఆరోజుల్లో ఎన్నో కథలు చెప్పుకునేవారు. హాస్యనటుడు పద్మనాభం వంటి ఎందరో వర్థమాన కళాకారులు కూడా మద్రాసులో అడుగు పెట్టినప్పుడు భోజనంపెట్టి, వసతి కల్పించిన అన్నపూర్ణాదేవిగా ఆమెను కీర్తించేవారు.
సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేక బాణీని ప్రదర్శించిన కన్నాంబ 1964, మే 7న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలారు.ఆమె అంతిమయాత్రలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర తారలు పాల్గొన్నారు. ఆమె గతించి ఆరు దశాబ్దాలు కావొస్తున్నా, ఆమె నటించిన చిత్రాల ద్వారా నేటికి ప్రేక్షుల మదిలో మెదలుతూనే ఉన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి