హిందీ సూపర్ స్టార్--వినోద్ ఖన్నా
- October 06, 2024
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విలన్ రోల్స్ చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన నటుడు వినోద్ ఖన్నా. రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలకు దీటుగా సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ హిందీ సినీ పరిశ్రమను ఏలారు ఖన్నా. మధ్యలో ‘ఓషో’ ఆధ్యాత్మిక మార్గం పట్టి సినిమారంగాన్ని వీడినా, మళ్ళీ వచ్చి నటునిగా రాణించారు వినోద్ ఖన్నా.సినిమాల్లో బిజీగా ఉన్న దశలోనే రాజకీయాల్లో సైతం రాణించి కేంద్ర మంత్రిగా పనిచేశారు.నేడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ సూపర్ స్టార్ స్వర్గీయ వినోద్ ఖన్నా జయంతి.
వినోద్ ఖన్నా 1946 అక్టోబర్ 6న పెషావర్ (ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో భాగమైంది) పట్టణంలోని పంజాబీ హిందూ వ్యాపార కుటుంబంలో జన్మించారు.తండ్రి కిషన్ చంద్ ఖన్నా, తల్లి కమలా దేవి. ఆయన పుట్టిన కొన్ని నెలలకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే సమయంలో భారతదేశం రెండుగా చీలడం, వీరి కుటుంబం తమ స్వస్థలం భాగమైన పాకిస్థాన్ దేశాన్ని వదలి ఇండియాలోని బొంబాయి (ముంబై) నగరానికి చేరుకుంది. వినోద్ ఖన్నా బాల్యం కొన్నాళ్ళు ముంబైలో,ఆ తరువాత ఢిల్లీలో, ఆ పై మళ్ళీ ముంబైలో సాగింది. ఖన్నా ముంబైలోని ప్రముఖ సిడెన్‌హామ్ కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు.
ఖన్నా చదువుకొనే రోజుల్లో హిందీ సూపర్ స్టార్ దేవానంద్ ‘సోల్వా సాల్’, దిలీప్ కుమార్ ‘ముఘల్-ఏ-ఆజమ్’ చిత్రాలు చూసి నటనపై ఇష్టాన్నిపెంచుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నం చేయకుండానే నటుడు సునీల్ దత్ తాను నిర్మిస్తున్న ‘మన్ కా మీట్’ చిత్రంలో ప్రతినాయక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. తమిళ చిత్రం ‘కుమారి పెన్’ ఆధారంగా తెరకెక్కిన ‘మన్ కా మీట్’ చిత్రానికి మన తెలుగు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు నిర్దేశకత్వం వహించారు. ఈ సినిమాలో యంగ్ విలన్ గా వినోద్ మంచి మార్కులు సంపాదించారు.
ఆ సినిమా తర్వాత వరుసగా “పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్ఛా ఝూటా, ఆన్ మిలో సజ్నా, మేరే గావ్ మేరే దేశ్” వంటి చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరించారు వినోద్ ఖన్నా. అయితే, ఖన్నాకు హీరోగా గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం ‘మేరే అప్నే’. ప్రముఖ గేయ రచయిత గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలోని మరో ముఖ్య పాత్రలో నటుడు శత్రుఘ్న సిన్హా నటించారు. ఖన్నా సోలో హీరోగా రూపొందిన ‘హమ్ తుమ్ ఔర్ వో’ చిత్రం మంచి ఆదరణ పొందింది. “అచానక్, ఇంతిహా” చిత్రాలూ హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టాయి.
70వ దశకం చివరి నాటికి వరుస హిట్లతో రాజేష్ ఖన్నా తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్లుగా అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాలు ఎదిగారు.
అమితాబ్, వినోద్ ఖన్నా కలసి నటించిన “రేష్మా ఔర్ షేరా, అమర్ అక్బర్ ఆంటోనీ, ముఖద్దర్ కా సికందర్, ఖూన్ పసీనా, పర్వరీష్, హేరా ఫేరీ” చిత్రాలు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. అయితే, అన్ని చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ నటనకు మంచి మార్కులు పడడం గమనార్హం. కానీ, రణధీర్ కపూర్ తో కలసి నటించిన “హాత్ కీ సఫాయీ, ఆఖ్రీ ఢాకూ” చిత్రాలు వినోద్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఒకానొక దశలో అమితాబ్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు వినోద్ ఖన్నా. అమితాబ్ కు వినోద్ గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటూ ఉండగా, 1982లో ‘ఓషో రజనీష్’ మార్గం పట్టి సినిమాలకు గుడ్ బై చెప్పారు వినోద్ ఖన్నా. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు.
స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఓషో రజనీష్ సిద్దాంతలకు ప్రభావితుడైన ఖన్నా, సినిమాల కన్నా ఓషో చూపిన మార్గంలోనే నడుస్తూ, 1982 నాటికి అమెరికాలోని రజనీష్ పురంలో ఉన్న ఓషో ఆశ్రమంలో గడపడం మొదలుపెట్టి, సన్యాసం తీసుకున్నారు. ఓషో ఆధ్యాత్మిక భోదనలు వింటూ సుమారు ఐదేళ్లు గడిపిన ఖన్నాకు సినిమాల మీద ఆసక్తి రావడంతో తిరిగి ఇండియా చేరుకొని “ఇన్సాఫ్, సత్యమేవ జయతే” చిత్రాలతో మంచి విజయం చూశారు. అయితే మునుపటి స్టార్ డమ్ మాత్రం మళ్ళీ ఖన్నాను వరించలేదు. హీరోగా అవకాశాలు తగ్గుతున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాల్లో నటిస్తూ వచ్చారు. హిందీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖన్నా నిలిచారు.
ఖన్నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత సినిమాల్లో బిజీగా సమయంలోనే బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ ప్రోద్బలంతో, ఆ పార్టీ ఆగ్రనేతలైన అద్వానీ, వాజపేయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 1998,1999,2004,2014లలో పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వాజపేయ్ మంత్రివర్గంలో తొలుత కల్చరల్ అండ్ టూరిజమ్ మంత్రిగానూ, తరువాత విదేశాంగ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు.
ఖన్నా వ్యక్తిగత జీవితానికి వస్తే 1971లో కాలేజీలో ప్రేమించిన గీతాంజలిని వివాహం చేసుకున్నారు. రాహుల్, అక్షయ్ ఖన్నాలు వీరి పిల్లలు. అక్షయ్ ఖన్నా సైతం హీరోగా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఓషో రజనీష్ మార్గంలో వెళ్ళిన సమయంలో గీతాంజలితో వచ్చిన అభిప్రాయభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. 1990లో తనని ప్రేమించిన కవితా ఖన్నాను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి అబ్బాయి సాక్షి వినోద్ ఖన్నా, అమ్మాయి శ్రద్దా ఖన్నా ఉన్నారు.
వినోద్ ఖన్నా తన నట జీవితంలో సూపర్ స్టార్ హోదాను అందుకున్నా, ఎటువంటి భేషజాలు లేకుండా పరిశ్రమలో అందరితో ఇట్టే కలిసిపోయేవారు. ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో ఎన్నో ఉత్తన పతనాలను చవిచూశారు. నటుడిగా తనకు రావాల్సిన అవార్డులు, రివార్డుల గురించి ఆయనెప్పుడు చింతించలేదు. మరణానంతరం మాత్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అనారోగ్యం కారణంగా 2017 ఏప్రిల్ 2న 70 ఏళ్ల వయస్సులో ముంబైలోన ఖన్నా తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా భారత చలన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అధ్యాయం లిఖించుకున్నారు వినోద్ ఖన్నా.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి