యూత్ పల్స్ తెలిసిన మారుతి...!

- October 08, 2024 , by Maagulf
యూత్ పల్స్ తెలిసిన మారుతి...!

మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న చిన్న సినిమాకు ప్రాణం పోసింది ఈయనే. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు. నవ త‌రానికి న‌చ్చే సినిమాల‌ను తెరకెక్కించడంలో యువ దర్శకుడు మారుతి రూటే వేరు. "ఈ రోజుల్లో " సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన, త‌న‌దైన శైలిలో సినిమాల‌ను తెరకెక్కిస్తూ, స్టార్ ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమా సినిమాకు వేరేయేషన్స్ చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు.కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ మారుతి సక్సెస్ రూటులో సాగుతున్నారు. నేడు టాలీవుడ్ యువ దర్శకుడు మారుతి పుట్టిన రోజు.

మారుతి అలియాస్ దాసరి మారుతి 1973,అక్టోబ‌ర్ 8న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కుటుంబ పోషణ కోసం వీళ్ళ నాన్న అరటిపళ్ళు అమ్మడం, అమ్మ టైలరింగ్ చేసేవారు. కుటుంబ కష్టాల మధ్యే చదువుకుంటూనే వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి  జూబ్లీహిల్స్‌‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో ఈయన టూడీ యానిమేషన్ కోర్స్ పూర్తి చేశారు. మారుతి ప్రతిభను గుర్తించిన యానిమేషన్ సంస్థ యజమానులు ఆయన్ని ట్రైనర్ గా నియమించుకున్నారు. ట్రైనర్ గానే కాకుండా ఫ్రీలాన్స్ ప్రొజెక్ట్స్ చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాను మారుతినే డిజైన్ చేశారు.

చదువుకొనే రోజుల నుంచీ మారుతికి సినిమాలపై ఆసక్తి ఉండేది. దాంతో పాటుగా నిర్మాత అల్లు అరవింద్ సతీమణి నిర్మల గారు దూరపు బంధువులు కావడంతో పాటుగా, హైదరాబాద్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్, బన్నీ వాసులతో ఏర్పడిన కొద్దిపాటి పరిచయం కూడా మారుతిని చిత్రసీమవైపు కూడా పయనించేలా చేసింది. బన్నీ వాసు ప్రోద్బలంతో "ఆర్య" సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా మారాడు. ఆర్య విజయంతో మారుతికి ఇండస్ట్రీతో అనుబంధం ఏర్పడింది. తమిళంలో విజయం సాధించిన ‘కాదల్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో మిత్రులతో కలసి అనువదించారు మారుతి. ఆ సినిమా మంచి విజయం సాధించి మారుతికి నిర్మాతగా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత  "ఏ ఫిల్మ్ బై అరవింద్" చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇదే సమయంలో కొన్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లకు సైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి కెమెరాతో లో బడ్జెట్ మూవీగా ‘దొంగలముఠా’ చిత్రాన్ని తెరకెక్కించారు. దానిని చూసిన తరువాత తక్కువ పెట్టుబడితో చిత్రాలు నిర్మించవచ్చు అనే నమ్మకం మారుతికి కూడా కలిగింది. వాణిజ్య ప్రకటనలు తీసిన అనుభవం, యువతను దృష్టిలో పెట్టుకొని బడ్జెటుకు తగ్గ కథను తయారు చేసుకున్నారు. దానినే 2012లో ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంగా తెరకెక్కించారు మారుతి.యాభై లక్షల్లో రూపొందిన ‘ఈ రోజుల్లో’ సూపర్ సక్సెస్ సాధించింది. కుర్రకారుకు కిర్రెక్కిస్తూ తీసిన ‘బస్టాప్’ సైతం ప్రెకషకులను  ఆకట్టుకుంది.

2013లో ‘ప్రేమకథా చిత్రం’ కథను రాసి, ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు మారుతి. అది అనూహ్య విజయం సాధించింది. తర్వాత యువతను లక్ష్యంగా చేసుకొని “రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్” వంటి చిత్రాలను నిర్మించారు. అల్లు శిరీష్ హీరోగా ‘కొత్త జంట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మారుతి లోని టాలెంట్ చూసిన అల్లు అరవింద్ మరో అవకాశం కల్పించారు. తత్ఫలితంగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రూపొందింది. ఈ సినిమా దర్శకునిగా మారుతికి మరింత పేరు తెచ్చింది. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ రూపొందించారు మారుతి. శర్వానంద్ తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’, సాయిధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలను తెరకెక్కించారు మారుతి. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్, లెజెండ్, ల‌వ్ యూ బంగారం సినిమాల్లో మారుతి ప్రత్యేక అతిథి పాత్ర‌ల్లో కూడా నటించాడు.

రీసెంట్‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన "ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్", "భ‌లే ఉన్నాడే" సినిమాలు అనుకున్నంత హిట్ కాక‌పోయినా.. మారుతి డైరెక్ష‌న్‌కు మాత్రం ప్రేక్ష‌కులు మంచి మార్కులే వేశారు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా "రాజా సాబ్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నది. తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతమైన దర్శకుడిగా మారుతి భవిష్యత్తులో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాము. 

-డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com