విశిష్ట విద్యావేత్త-డాక్టర్ వి.ఎస్.కృష్ణ

- October 08, 2024 , by Maagulf
విశిష్ట విద్యావేత్త-డాక్టర్ వి.ఎస్.కృష్ణ

విద్యా రంగంలో కీర్తి శిఖరాలను అధిరోహించిన తెలుగు వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో విద్యారంగానికి విలువైన సేవలు అందించి తాను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి వి.ఎస్.కృష్ణ. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చే యు.జి.సి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగువాడు ఆయన. నేడు ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ వి.ఎస్.కృష్ణ జయంతి. 

డాక్టర్ వి.ఎస్.కృష్ణగా సుప్రసిద్దులైన వాసిరెడ్డి శ్రీకృష్ణ,1902,అక్టోబర్ 8న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గుంటూరు జిల్లా తెనాలి ఫిర్కాలోని పెదపాలెం గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన వాసిరెడ్డి శ్రీరాములు, వీరమ్మ దంపతులకు జన్మించారు. తెనాలి, గుంటూరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసిన ఆయన తన శ్రేయోభిలాషి,గురువైన సాంబయ్య గారి సహకారంతో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో పట్టుభద్రుడయ్యారు. అక్కడ చదువుతున్న సమయంలోనే సర్వేపల్లి రాధాకృష్ణ, తమ ప్రాంతానికి చెందిన ఆచార్య ఎన్.జి.రంగా, ఆయన సతీమణి భారతీదేవి గార్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

దేశ స్వాతంత్య్రం కోసం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత సంతతి విద్యార్థులతో కలిసి రంగా, కృష్ణ పనిచేవారు. అక్కడ వారు నడిపిన పత్రికలో భారత ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ పాలకులు దోచుకున్న తీరును వ్యాసాలుగా రాయడంలో వీరు ప్రథమంగా ఉండేవారు.1926లో రంగా భారత దేశానికి వెళ్లిన తర్వాత శ్రీకృష్ణ తన చదువును పూర్తి చేసుకొని 1927లో స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పట్లో ప్రముఖ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(తర్వాత కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో కొంత కాలం పనిచేశారు.మద్రాస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జస్టిస్ ప్రభుత్వంలో కీలక నాయకుడైన బొబ్బిలి రాజాకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

1932లో తన మిత్రుడైన ఆంధ్ర విశ్వకళాపరిషత్(ఆంధ్ర యూనివర్సిటీ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కోరిక మేరకు ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేయడం ప్రారంభించారు. సర్వేపల్లి ప్రోత్సాహంతో ఆస్ట్రియా రాజధాని వియన్నా వెళ్లి అక్కడి వియన్నా యూనివర్సిటీలో గోల్డ్ స్టాండర్డైజేషన్(Gold Standardization) అంశం మీద పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. సర్వేపల్లి తర్వాత తిరిగి  వైస్ ఛాన్సలర్ అయిన వ్యవస్థాపకుడు సర్ సి.ఆర్.రెడ్డి గారి హయాంలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ రిజిస్ట్రార్‌ బాధ్యతలను కృష్ణ గారికి అప్పగించారు. అలాగే, విద్యార్థులు హాస్టల్ వార్డెన్ బాధ్యతలు సైతం అదనంగా అప్పగించారు. రెడ్డి గారి ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ పేరు ఆంధ్ర యూనివర్సిటీగా మార్పు చెందడంలో వీరి కృషి చేశారు.

సి.ఆర్.రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయనకు తీరికలేని కారణంగా యూనివర్సిటీ పరిపాలనా వ్యవహారాలను కృష్ణ గారే చూసుకునేవారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్ మరియు  యూనివర్సిటీ హెడ్ ప్రిన్సిపాల్ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. 1949లో అనారోగ్యం కారణంగా రెడ్డి గారి స్థానంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలను చేపట్టిన డాక్టర్ కృష్ణ సుమారు 11 సంవత్సరాల పాటు ఆ పదవిలోనే ఉంటూ భారత దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలోనే యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్, ఇంజనీరింగ్, రూరల్ స్టడీస్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెరైన్ బయోలజీ వంటి కోర్సులను  ప్రవేశపెట్టారు. పదవుల్లో పైరవీలు చేసిన వారికి కాకుండా ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేసే సంప్రదాయం వీరి హయాంలోనే మొదలైంది. నేడు ఆంధ్ర యూనివర్సిటీ శాఖోపశాఖలుగా విస్తరించడంలో ఈయన కారకుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

విద్యారంగంలో వీరు చేసిన కృషికి గానూ పలు ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు. 1957లో ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 1961 వరకు కొనసాగారు. ఎకనామిక్స్ విభాగంలో పలు అంతర్జాతీయ జర్నల్స్ లో వీరి పరిశోధనా పత్రాలను ప్రచురితం అయ్యాయి. వీరు రచించిన "బ్రిటన్ ఉడ్స్ అండ్ ఆఫ్టర్" అనే గ్రంథం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ సంస్థ ప్రచురించింది. కృష్ణా గోదావరి బేసిన్ ప్రాంతంలో సహజ వాయువు నిక్షేపాలను గుర్తించి వాటి మీద లోతైన అధ్యయనం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మొదటి వ్యక్తి కృష్ణ గారే!

విద్యా, ఆర్థిక రంగాల్లో వీరి కృషిని గుర్తించిన నాటి నెహ్రూ ప్రభుత్వం 1961లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) ఛైర్మన్‌గా నియమించింది. ఈ పదవిని చేపట్టిన తోలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అయితే, దురదృష్టవశాత్తు 1961, ఫిబ్రవరి 16 తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు.

ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి ఆయన చేసిన చిరస్మరణీయ సేవలకు గుర్తుగా, వారి హయాంలో అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో  స్థాపించిన యూనివర్సిటీ లైబ్రరీ భవనానికి "వి.ఎస్.కృష్ణ గ్రంథాలయం"గా నామకరణం చేశారు. అంతేకాకుండా, యూనివర్సిటీకి అనుబంధంగా 1968లో డాక్టర్ వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేశారు.

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com