డాక్టర్ కమ్ యాక్టర్-భద్రం

- October 08, 2024 , by Maagulf
డాక్టర్ కమ్ యాక్టర్-భద్రం

నవ్వడం ఒక భోగం... నవ్వలేకపోవడం ఒక రోగం అనే నానుడి నిజమే నంటాడు టాలీవుడ్ రైజింగ్ కమెడియన్ భద్రం. సహజమైన  గోదావరి యాసకి తనదైన ఫ్లేవర్‌ను తగిలించి హాస్యాన్ని పండిస్తుంటారు భద్రం. చాలా మంది డాక్టర్‌ను కాబోయి యాక్టర్‌ను అయ్యాను అంటారు. కానీ, భద్రం ముందు డాక్టర్ అయిపోయి ఆ తరవాత యాక్టర్ అయ్యారు. ఫిజియోథెరపిస్ట్ అయిన భద్రం.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెల్‌నెస్ ట్రైనర్‌గా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. ఎర్గోనామిక్స్, యోగా, స్ట్రెస్ థెరపిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు. నేడు
డాక్టర్ భద్రం పుట్టినరోజు

భద్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో అక్టోబర్ 8న జన్మించారు. తండ్రి యుగంధర్ నాయుడు కొన్ని సినిమాలకు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. వీరి కుటుంబానికి రాజండ్రిలో పలు వ్యాపారాలు ఉన్నాయి.భద్రం మామ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. తండ్రి కోరిక మేరకు బెంగుళూరులో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేసి హైదరాబాదులో ఎర్గొనోమిక్స్‌ (ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా స్థిరపడ్డారు.గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పనిచేశారు.

డాక్టర్‌గా పనిచేస్తూ సినిమాలపై ఆసక్తితో ‘లవ్‌ పెయిన్‌’ పేరుతో వీడియో తీసి అప్లోడ్ చేయగానే, యువ డైరెక్టర్లకు బాగా నచ్చి 'పెళ్లితో జర భద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ లో నటిస్తే మంచి పేరు వచ్చింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన జ్యోతి లక్ష్మి చిత్రంలో అవకాశం ఇచ్చాడు. జ్యోతి లక్ష్మి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన భద్రానికి దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో అవకాశం ఇచ్చాడు ఈ చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా, మారుతి చిత్రాల్లో రెగ్యులర్ ఆర్టిస్టుగా మారాడు. ఇప్పటి వరకు సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించారు.

ఒకవైపు నటుడిగా రాణిస్తూనే డాక్టర్‌గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎర్గోనామిక్స్, యోగా, స్ట్రెస్ థెరపి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాడు. నటుడిగా, డాక్టర్‌గా కెరీర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రం రాబోయే మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాము. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com