టాలీవుడ్ మాస్ డైరెక్టర్-వి.వి.వినాయక్
- October 09, 2024
‘వి’ ఫర్ ‘విక్టరీ’ అంటారు. అలాంటి మూడు ‘వి’లను పేరులో పెట్టుకున్న వి.వి.వినాయక్ కు ‘విక్టరీ’ ఆరంభంలోనే తలుపు తట్టింది. .యాక్షన్‌ను కొత్త తరహాలో చూపించి మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు. క్లాస్ ఆడియన్స్‌కు కావాల్సింది అందించింది చప్పట్లు కొట్టించారు. మధ్యలో పంథా మార్చినా ‘అదుర్స్’ అనిపించుకున్నారు వి.వి. వినాయక్. అన్ని వర్గాలను అలరించే అంశాలతో తన సినిమాలను రూపొందించే ప్రయత్నం చేస్తూంటారు వినాయక్. అందుకు తగ్గట్టుగానే అనేక సార్లు ఫలితం రాబట్టారు. నేడు టాలీవుడ్ మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ 50వ పుట్టినరోజు.
వి.వి.వినాయక్ పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయక రావు.1974, అక్టోబరు 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా చాగల్లు గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు. వినాయక్ తండ్రి గోదావరి జిల్లాల్లో పేరున్న డిస్ట్రిబ్యూటర్ మరియు సినిమా థియేటర్లు నడిపేవారు. తండ్రి సినిమాల్లో ఉండటం, వాళ్ళకు ఊళ్ళో ఉన్న వినాయక్ థియేటర్లో చిరంజీవి చిత్రాలు చూస్తూ సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్రాంతానికి చెందిన దర్శకుడు స్వర్గీయ ఈ.వి.వి సత్యనారాయణ స్పూర్తితో సినిమా రంగంలో అడుగుపెట్టాడు.
వినాయక్ తండ్రి గారికి రాశి మూవీస్ అధినేత నరసింహారావుతో ఉన్న పరిచయం కారణంగా ఈ.వి.వి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న అబ్బాయిగారు చిత్రానికి పనిచేశారు. ఈ.వి.వితో కొన్ని చిత్రాలకు పనిచేశారు. తరువాత డైరెక్టర్ సాగర్ తెరకెక్కించిన సినిమాలకు కో-డైరెక్టర్ గా ఉన్నారు. ప్రేక్షకులు కోరుకొనేది మనం అందిస్తే చాలు, విజయం తథ్యం అనే సూత్రాన్ని వినాయక్ బాగా నమ్ముతారు.
‘సమరసింహారెడ్డి’ ఘనవిజయంతో తెలుగునాట ఫ్యాక్షన్ డ్రామాలకు భలే క్రేజ్ ఉండేది. దాంతో వినయ్ సైతం అదే రూటులో సాగుతూ తొలి ప్రయత్నంలోనే ఫ్యాక్షన్ డ్రామాను ఎంచుకొని ‘ఆది’ తెరకెక్కించారు. జూ.ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘ఆది’ చిత్రం అనూహ్య విజయం సాధించింది. వెంటనే బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’లో అదే సూత్రం పాటించారు. అయితే అప్పటికే ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంగా చూపిన చిత్రాలలో బాలకృష్ణ నటించేసి ఉండడంతో ‘చెన్నకేశవ రెడ్డి’ ఆ స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది.
వినాయక్ మూడవ చిత్రం ‘దిల్’తో యువకుల మదిని జిల్ మనిపించారు వినయ్. ఆ సినిమా నిర్మాత ‘దిల్’నే ఇంటిపేరుగా మార్చుకొని నేడు దిల్ రాజుగా చిత్రసీమలో సాగుతున్నారు. ఇక వినయ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘ఠాగూర్’. చిరంజీవితో వినయ్ తీసిన ఈ తొలి చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. అల్లు అర్జున్‌తో "బన్నీ",వెంకటేష్‌తో "లక్ష్మి".. ఇలా వి.వి. వినాయక్ తెరకెక్కించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. సాంబ, యోగి, కృష్ణ, అదుర్స్, బద్రీనాధ్, నాయక్, అల్లుడు శీను, అఖిల్, ఖైదీ నెంబర్ 150, ఇంటిలిజెంట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన ఆఖరి చిత్రం ‘ఛత్రపతి’ (హిందీ రీమేక్). గతేడాది విడుదలైంది. వినాయక్ హీరోగా ‘సీనయ్య’ చిత్రాన్ని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. కారణమేంటో తెలియదుగానీ అది కార్యరూపం దాల్చలేదు.
వినాయక్ 2002లో ఆది చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. 2008లో కృష్ణ చిత్రానికి సంతోషం అవార్డు అందుకున్నారు. "ఏ సినిమాకైనా కథే బలం. పాన్ ఇండియా సినిమానా కాదా అనేది పక్కన పెడితే.. కథ బాగుంటే ఇండియా లెవల్‌లో ఆ సినిమా హిట్ అవుతోంది. 'కార్తికేయ2', 'సీతారామం' వంటి సినిమాల కథ బాగుంది కాబట్టే ఇండియాలో ప్రతీ భాషలో హిట్ సాధించాయి. ఈ రోజుల్లో ఒక తెలుగు సినిమా తీసి.. దానిని హిందీలో రిలీజ్ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది" అని వినాయక్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి