సినిమా రివ్యూ: ’జనక అయితే గనక‘.!
- October 10, 2024
సుహాస్ హీరోగా సినిమాలకు ఈ మధ్య మంచి మార్కెట్ లభిస్తోంది. కమెడియన్‌గా తనదైన ప్రత్యేకతను చాటుకున్న సుహాస్, హీరోగా విభిన్న తరహా కథలతో ఆకట్టుకుంటున్నాడు. అలాగే విమర్శకులు ప్రశంసలు అందుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కూడా ఖాతాలో చేర్చుకుంటున్నాడు. అలాగే ఇటీవల ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’, ‘ప్రసన్న వదనం’ తదితర సినిమాలతో మంచి టాక్ తెచ్చుకున్నాడు. అలాంటి సుహాస్ నుంచి వస్తున్న సినిమానే ఇప్పుడు ‘జనక అయితే గనక’. టైటిలే చిత్రంగా ఆసక్తికరంగా అనిపించింది. ప్రోమోల ద్వారా కథ ఓ ఐడియాకి వచ్చింది. దాంతో సినిమాపై ఆసక్తి కూడా పెరిగింది. మరి, ఆ ఆసక్తిని ‘జనక అయితే గనక’ అందుకున్నాడో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ప్రసాద్ (సుహాస్) వాషింగ్ మెషీన్స్ సేల్స్ కంపెనీలో సేల్స్ బాయ్‌గా పని చేస్తుంటాడు. పెద్దగా చదువుకోని ప్రసాద్‌కి చాలీ చాలని జీతం కుటుంబంలో బోలెడంత బాధ్యత. కొత్తగా పెళ్లియ్యి ఓ భార్య (సంకీర్తన), తనను సెటిల్ చేయలేదంటూ మాటలు పడే ఓ తండ్రి (గోపరాజు రమణ), ఇంట్లో పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దుకుపోయే తల్లి, పెళ్లయ్యింది పిల్లల్నెప్పుడు కంటావురా.. అని వేధించుకుని తినే నాయనమ్మ.. ఇదీ ప్రసాద్ కుటుంబం. ఇలా మధ్యతరగతి బతుకు బతుకుతున్న ప్రసాద్ జీవితంలోకి పిల్లలొస్తే.. వాళ్లని పెంచి పెద్ద చేయడం చదువు చెప్పించడం చాలా కష్టమని భావించి అప్పుడే పిల్లలు వద్దనుకుంటాడు. కానీ, అనుకోకుండా భార్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో, షాక్ అయిన ప్రసాద్ కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. స్నేహితుడు (వెన్నెల కిషోర్) లాయర్ కావడంతో చాలా ఈజీగానే ఆ కంపెనీపై కన్జూమర్ కోర్ట్‌లో కేసు వేసేస్తాడు ప్రసాద్. అయితే, ఈ కేసు కారణంగా ప్రసాద్ ఎదుర్కొన్న సమస్యలేంటీ.? అసలు ఆ కేసులో ప్రసాద్ గెలిచాడా.? ఈ సినిమా ద్వారా క్లైమాక్స్‌లో ఇచ్చిన ఆ ఆసక్తికరమైన మెసేజ్ ఏంటీ.? తెలియాలంటే ‘జనక అయితే గనక’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
మధ్య తరగతి కుర్రాడిలా సుహాస్ బాగా సెట్ అయిపోయాడు. తండ్రిని ఆడి పోసుకునే సన్నివేశాల్లో.. పిల్లల్లెప్పుడు అని అడిగే నాయనమ్మకు తగ్గ రీతిలో కౌంటర్లు వేసే సన్నివేశాల్లో.. భార్యతో కొన్ని రకాల ఎమోషన్ సీన్లలోనూ సుహాస్ తనదైన నటనతో కట్టిపడేశాడు. తనలోని నటుడ్ని మరో మెట్టు ఎక్కించేందుకు ఈ సినిమా సుహాస్‌కి బాగా యూజ్ అయ్యిందని చెప్పొచ్చు. భార్య పాత్రలో సంకీర్తన భర్తను అనుకరించుకుని వెళ్లిపోయే పాత్రలో తన పరిధి మేర ఆకట్టుకుంది. ప్రీ క్లైమాక్స్ సీన్లలో ఎమోషన్స్‌తోనూ మెప్పించింది. తండ్రి గోపరాజు రమణ తనదైన సీనియారిటీతో ఆకట్టుకున్నారు. అక్కడక్కడా నవ్వించారు. లాయర్ పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వించాడు. అపోజేషన్ లాయర్ వేసే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడే లాయర్‌గా ఫన్ టోన్‌లో తన పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. అలాగే ప్రబాస్ శీను తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల ఇలాంటి ఓ సీరియస్ ఇష్యూని తీసుకుని ఫన్ టోన్‌లో కథనం నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కోర్టు సన్నివేశాలను ఇంటెలిజెంట్‌గా తెరకెక్కిస్తూనే మరోవైపు ఫన్ కూడా మిస్ కాకుండా చూసుకున్నాడు. నిర్మాణ విలువలు కథ పరంగా బాగున్నాయ్. మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌కి తగ్గట్లుగా సెట్ అయ్యింది. ‘నా భార్య నా ఫేవరేట్’ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కూడా ఎక్కడా వంకలు పెట్టేలా అనిపించలేదు. ఓవరాల్‌గా ఈ సినిమాకి టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
సుహాస్ నటన, ఫస్టాఫ్ కామెడీ, కథ, కథనం కొత్తగా అనిపించడం, కోర్టు సన్నివేశాలు, కోర్టులో ప్రబాస్ శీనుకీ, సుహాస్‌కీ మధ్య వచ్చే ప్రశ్నల ఎపిసోడ్, వాటిని సుహాస్ హ్యాండిల్ చేసిన తీరు.. ఆలోచింపచేస్తూనే నవ్వులు పూయిస్తుంటాయ్. ఇలాంటి ఓ కథని తీసుకున్నప్పుడు ఎక్కడో చోట డైరెక్టర్ తప్పటడుగులు వేసే ఛాన్స్ వుంటుంది. కానీ, అలాంటి తప్పుటడుగులు ఈ సినిమాలో కనిపించకపోవడం విశేషం. వల్గారిటీకి ఛాన్సివ్వకుండా కథనాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా వినోదాత్మకంగా మొదటి నుంచి చివరి వరకూ హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. అందుకు డైరెక్టర్‌కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. సుహాస్ నుంచి మంచి కో ఆఫరేషన్ అందింది. అలాగే దిల్ రాజు వంటి పెద్ద తలకాయ సపోర్ట్ వుండడం కూడా ఈ సినిమాకి మరో బిగ్ ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్:
చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్సేమీ లేవు.
చివరిగా:
‘జనక అయితే గనక’ దసరాకి సు‘హాస్య’ చిత్రమే.!
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!