విశాఖను వణికించిన హుద్ హుద్ విలయానికి నేటికి పదేళ్లు

- October 12, 2024 , by Maagulf
విశాఖను వణికించిన హుద్ హుద్ విలయానికి నేటికి పదేళ్లు

ఆ పదం వింటే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో రైల్లు పరిగెడతాయి.ఆ పదం వింటే ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున విశాఖ వాసులను వనికించిన ఆ పదం పేరు హుద్ హుద్ తుఫాన్.

హుద్ హుద్ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఆ విలయం గురించి చెప్తే చరిత్ర అవుతుంది రాస్తే గ్రంథం అవుతుంది.గంటకు 200 కిలోమీటర్ల పైగా వేగంతో హుద్ హుద్ తుఫాన్ విశాఖపట్నం తీరాన్ని తాకినప్పుడు నగరంలో అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది, రహదారులు చెట్లతో, విద్యుత్ స్తంభాలతో నిండిపోయాయి. కారు చీకట్లు కమ్మిన వేల తుఫాను సృష్టించిన బీభత్సానికి చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరు అల్లాడిపోయారు.

సరిగ్గా పదేళ్ల క్రితం, 2014 అక్టోబర్ 12న విశాఖపట్నం మీదుగా హుద్ హుద్ తీరం దాటింది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని చిగురుటాకులా వణికించాయి. రాత్రి 8-12 గంటల సమయంలో గాలులతో విధ్వంసం సృష్టించింది.తర్వాత 12 గంటల గ్యాప్ తీసుకుని మరోసారి భారీ వర్షంతో విరుచుకుపడింది. ఈ తుఫాను వల్ల జనావాసాలు, రోడ్లు, ఇళ్ల పైకప్పులు, కరెంటు స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.దాంతో దాదాపు 5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. 

తుఫాను సమయంలో గాలులు ఎంత బలంగా వీచాయంటే షోరూమ్‌లలో ఉన్న కొత్త కార్లు రోడ్డు మీద పడి కొట్టుకుపోయాయి అంటే ఆ తీవ్రత ఎంత ఉంటుందో ఊహించడం చాలా కష్టం. ఈ తుఫాను వల్ల జరిగిన ఆస్తి నష్టం దాదాపు 1.63 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు ఈ తుఫాను ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి.

విశాఖపట్నం పోర్టు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు కూడా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ పార్కులు కూడా తుఫాన్ ప్రభావంతో నష్టపోయాయి.ఈ తుఫాన్ కారణంగా నగర ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగింది.సహాయక చర్యల్లో NDRF, ఆర్మీ, నేవీ సిబ్బంది పాల్గొన్నారు.విశాఖలో 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

తుఫాన్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ తర్వాత, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యలు చేపట్టాయి. ప్రజలకు తాత్కాలిక ఆశ్రయాలు, ఆహారం, నీరు అందించడానికి ప్రయత్నించారు.

తుఫాన్ తర్వాత, నగర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఆనాటి ప్రభుత్వం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారుల మరమ్మతులు, చెట్లు తొలగించడం వంటి పనులు వేగంగా చేపట్టారు. ప్రజలు కూడా తమ జీవితాలను తిరిగి సక్రమంగా కొనసాగించడానికి ప్రయత్నించారు.

హుద్ హుద్ తుఫాన్ విశాఖపట్నం ప్రజలకు ఒక గుణపాఠం నేర్పింది.ప్రకృతి వైపరీత్యాల ముందు మనం ఎంత బలహీనులమో, వాటిని ఎదుర్కొనేందుకు మనం ఎంత సన్నద్ధంగా ఉండాలో ఈ తుఫాన్ మనకు గుర్తు చేసింది.ఈ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని విశాఖ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు.ఈ రోజు, పదేళ్ల తర్వాత, విశాఖపట్నం ప్రజలు ఆ తుఫాన్ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసుకుంటూ, తమ పట్టుదల, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నం నగరాన్ని ఈ తుఫాన్ సృష్టించిన విలయం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయింది. 

--వేణు పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com