స్టార్ క్రికెటర్ టూ టీం ఇండియా కోచ్
- October 14, 2024
గౌతమ్ గంభీర్... భారత క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని పేరు. టీం ఇండియా సాధించిన రెండో వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ విజయాల్లో గంభీర్ పాత్ర చాలా కీలకం. ఒత్తిడితో బ్యాటింగ్ మొదలుపెట్టి ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురి చేయడంలో గంభీర్ తర్వాతనే ఎవరైనా! ఐపీఎల్ టోర్నమెంట్లో చెన్నై, ముంబై జట్ల అధిపత్యానికి తెరదించి కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు రెండు సార్లు ట్రోఫీని అందించిన సారథి గంభీర్. రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి ఎంపీగా విజయం సాధించాడు. ప్రస్తుతం టీం ఇండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. నేడు టీం ఇండియా దిగ్గజ ఆటగాడు గౌతమ్ గంభీర్ పుట్టినరోజు.
గౌతమ్ గంభీర్ 1981,అక్టోబర్ 14న న్యూఢిల్లీలోని ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి దీపక్ గంభీర్ వస్త్ర వ్యాపారి. గంభీర్ చిన్నతనంలోనే తాతగారింట్లో ఉంటూ చదువుకున్నాడు. ఢిల్లీ హిందూ కాలేజీలో బీఏ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. క్రికెట్ పట్ల చిన్నప్పుడే ఆసక్తి ఉండటంతో గంభీర్ ను తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారు. గంభీర్ 2000లో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ తరుపున దేశవాళీ ట్రోఫీలో ఆడిన గంభీర్ 2003లో బంగ్లాదేశ్ సిరీస్ ద్వారా ఓడీల్లో, 2004లో జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2007 వరకు టీంలో నిలకడ లేక, ఫామ్ లేక ఇబ్బందులు పడ్డాడు. 2007 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోవడం జరిగింది.
2007లో జరిగిన తోలి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో యువ సారథి మహేంద్ర సింగ్ నాయకత్వంలో భారత జట్టులో స్థానం సంపాదించుకున్న గంభీర్, ఆ టోర్నీలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి ప్రపంచ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2008లో దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ తన ఆటకు వీడ్కోలు పలకడంతో ఓపెనింగ్ బ్యాట్సమెన్ గా దిగి జట్టు విజయాల్లో కీలకమయ్యాడు.ముఖ్యంగా 2008-12 మధ్యలో ఇండియా ఓపెనింగ్ బ్యాట్సమెన్లు అయిన సెహ్వాగ్ - గంభీర్ జోడి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా నిలిచింది. సెహ్వాగ్ అటాకింగ్ బ్యాటింగ్, గంభీర్ సొగసైన బ్యాటింగ్ భారత క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించేది.
2010లో ఆసియా కప్, 2011 ప్రపంచ కప్ విజయాల్లో గంభీర్ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా 2011 ప్రపంచ కప్ ఫైనల్స్ లో గంభీర్ ఆడిన వీరోచితమైన ఇన్నింగ్స్ మూలంగానే 28 సంవత్సరాల తర్వాత భారత జట్టు ప్రపంచ కప్పును కైవసం చేసుకుంది. గంభీర్ బ్యాటింగ్ శైలి
తన తరం మిగిలిన ఆటగాళ్ళకంటే భిన్నంగా ఉండేది. గంభీర్ క్రీజులో వచ్చినప్పుడు చాలా ఒత్తిడితో ఉండేవాడు, క్రీజులో పాతుకుపోయిన తర్వాత కొద్దిసేపటికే బౌలర్ల మీద ఒత్తిడిని పెంచేవాడు. ఇలాంటి టెక్నిక్ గంభీర్ తప్ప మరొక ఆటగాడు ప్రయోగించలేదు. టీం ఇండియాకు సుమారు 12 ఏళ్లపాటు ఆడిన గంభీర్ 2016లో రిటర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్లో 58 టెస్ట్ మ్యాచుల్లో4,154పరుగులు, 147 వన్డేల్లో 5,238 పరుగులు, 37 అంతర్జాతీయ టీ20ల్లో 932 పరుగులు చేశాడు.
ఐపీఎల్ టోర్నీలో తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఆడిన గంభీర్, ఆ తర్వాత కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు మారి, సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్ టోర్నీ మొదలైన నాటి నుండి అత్యధిక ట్రోఫీలను కైవసం చేసుకోవడంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టల ఆధిపత్యం సాగింది. అయితే 2012, 2014లో గంభీర్ నాయకత్వంలో కలకత్తా నైట్ రైడర్స్ ట్రోఫీని కైవసం చేసుకొని ఆ రెండు జట్టుల అధిపత్యానికి గండికొట్టడం జరిగింది. 2018లో ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికి, మెంటార్ గా అవతారం ఎత్తాడు గంభీర్. 2021-23 వరకు లక్నో సూపర్ జెయింట్స్, కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. 2023లో కలకత్తా మరోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో గంభీర్ కీలకంగా వ్యవహరించాడు.
గంభీర్ వ్యక్తిగత జీవితానికి వస్తే తన స్నేహితురాలైన నటాషా జైన్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2011లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరమ్మాయిలు. గంభీర్ 2019లో బిజెపి నుంచి తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. 2008లో అర్జున అవార్డు, 2019లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్ అంతర్జాతీయ వెటరన్ క్రికెటర్స్ టోర్నీలో ఇండియా తరుపున పలు మ్యాచులు ఆడాడు. 2024 మధ్యలో రాహుల్ ద్రావిడ్ తర్వాత టీం ఇండియా సెలెక్టర్ గా ఎంపికైన గంభీర్ రాబోయే టెస్ట్ వరల్డ్ కప్, ప్రపంచ కప్ లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి