పీపుల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
- October 15, 2024
ప్రతి రోజూ భూమి మీద ఎంతోమంది పుడతారు, మరణిస్తారు. కొంతమందే మరణం తర్వాత కూడా గుర్తుండిపోతారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా,పీపుల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి గాంచిన డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్.‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి’ అంటూ అంటూ యువతరాన్ని తట్టి లేపి కర్తవ్యబోధ చేశారు.ఎందరో యువతకు స్ఫూర్తిని నింపి కలలంటే నీకు నిద్రలో వచ్చేవి కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి అని స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలామ్. నేడు ప్రముఖ శాస్త్రజ్ఞుడు, భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి యావత్ భారత దేశం ఘన నివాళులర్పిస్తుంది.
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు పేపర్ బాయ్‌గా పనిచేశారు.
1960 సంవత్సరంలో” ది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” నుంచి కలామ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. 1963 సంవత్సరం తర్వాత పలు దేశాల్లో పర్యటించారు. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్‌లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా పనిచేసారు. అరవైవ దశకంలో చైనా, పాకిస్థాన్ లతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తూ ఉండేది ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలామ్ గుర్తించారు.
ఇందుకోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో కలామ్ ఇస్రోలో సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలామ్ ఎంతగానో కృషి చేసారు. 1970 దశకంలో బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే సంకల్పాన్ని కలామ్ వెల్లడించారు. ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్‌లకు రూపకల్పన చేసి ఆ ప్రోజెక్టుల విషయంలో కలామ్ విశేషమైన సేవలందించారు.
1998లో తెలుగు వారైన ప్రముఖ కార్డియాలజిస్ట్ భూపతిరాజు సోమరాజుతో కలిసి కరోనరీ స్టంట్‌ను కలాం రూపొందించారు. దీనికి కలాం-రాజు స్టంట్ అని పేరుపెట్టారు. 2012లో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం కలాం-రాజు ట్యాబ్లెట్ పేరిట ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను రూపొందించారు.
ఇక భారత దేశానికి 2002 నుండి 2007 సంవత్సరం వరకు 11వ రాష్ట్రపతిగా కలామ్ విశేష సేవలు అందించారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన హుందాగా వ్యవహరిస్తూ ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు.రబ్బర్ స్టాంప్ అన్న మాటను మర్చిపోయేలా చేశారు. దేశమంతా తిరిగారు. విద్యార్థులతో మాట్లాడారు. చైతన్యపూరిత ప్రసంగాలు చేశారు. ప్రతి మాటా ఉత్సాహం నింపేది.రాజకీయాల నేపథ్యంలో రెండోసారి రాష్ట్రపతి పదవి చేపట్టడానికి ఆసక్తి చూపని కలాం.. పదవీకాలం ముగిసిన అనంతరం తనకిష్టమైన విద్యారంగంలోకి ప్రవేశించి విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు.
భారత రక్షణ రంగం బ్రహ్మౌస్ వంటి సూపర్ సానిక్ మిస్సైల్‌ను తయారు చేయగలిగిందంటే దానికి ముఖ్య కారణం పరిశోధనా పరంగా ఆయన వేసిన గట్టి పునాదులే.1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న వరించింది. దాదాపు 40 కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసాయి. ప్రముఖ రచయిత అరుణ్ తివారి సాయంతో ఆయన తన ఆత్మకథ పుస్తకాన్ని ”వింగ్స్ ఆఫ్ ఫైర్” పేరుతో విడుదల చేసారు. అలాంటి గొప్ప శాస్త్రజ్ఞుడు 83 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
కలలను సాకారం చేసుకోమంటూ విద్యార్ధి లోకాన్ని తట్టిలేపిన మహనీయులు అబ్దుల్ కలామ్. ఆచరణ ద్వారా కలలను సాకారం చేసుకుని చూపించిన ఆదర్శమూర్తి. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ అందించిన సేవలు సామాన్యమైనవి కావు. “‘చిన్న లక్ష్యం కలిగి ఉండటమనేదే పెద్ద నేరంతో సమానమని” అబ్దుల్ కలామ్ ఎపుడూ చెబుతుండేవారు. మనం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటికోసం పోరాడాలని చెబుతుండేవారు. మానవతా వాదిగా, శాస్త్రవేత్తగా అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. 2015లో ఐక్యరాజ్య సమితి ఆయన జయంతి సందర్భంగా "ప్రపంచ విద్యార్థుల దినోత్సవం"గా ప్రకటించింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి