తెలుగు చలనచిత్ర రంగ పితామహుడు
- October 15, 2024
తెలుగు సినిమాలు ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో బాగా ఆడుతున్నాయి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు వారి యొక్క శ్రమ, పట్టుదల, త్యాగం, క్రియేటివిటీ ఫలితంగా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచమంతా పేరుతెచ్చుకుంది. అయితే ఏ ఒక్క పనికైనా ఆద్యుడు అనేవాడు ఉంటాడు. తెలుగు ప్రజలకు సినిమాను పరిచయం చేసి, తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు అనిపించుకున్న వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు. నేడు ఆయన జయంతి.
రఘుపతి వెంకయ్య నాయుడు 1873, ఆగస్టు 15న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని బందరు(మచిలీపట్నం)లోని ప్రముఖ తెలగ వర్గానికి చెందిన సైన్యాధికారుల కుటుంబంలో జన్మించారు. ప్రముఖ విద్యావేత్త మరియు సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఈయన సోదరుడు. నాయుడు తండ్రి బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్న సమయంలోనే 17వ యేట చిత్రలేఖనంపై మక్కువ ఏర్పడింది.తండ్రి ప్రోత్సాహంతో మద్రాస్ నగరానికి వెళ్లి ఆయిల్ పెయింటింగ్స్ మీద శిక్షణ పొందారు.మద్రాస్ లోని మౌంట్ రోడ్డులో తన చిత్రాలను ప్రదర్శన శాలను ఏర్పాటు చేసి స్థానిక సంపన్నులకు, జమీందార్లకు అమ్మేవారు.
మద్రాస్ లో ఉన్న సమయంలోనే ఫొటోగ్రఫీ మీద అభిరుచి ఏర్పడటంతో అందులో శిక్షణ తీసుకోని ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు.1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూకీ సినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవారు.
1912లో మద్రాసులో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. సినిమా థియేటర్లు కట్టడంలో, సినిమాలు తియ్యడంలో వెంకయ్య పడిన కష్టాలూ, అవస్థలూ అన్నీ ఇన్నీ కావు. ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్లూ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లూ ప్రతీసారీ వచ్చి ‘అది మార్చు, ఇది మార్చు’ అని పేచీలు పెట్టేవారుట.
థియేటర్ కట్టడానికి అంగీకరించి, లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఏవో అవాంతరాలు, అభ్యంతరాలు చెప్పేవారనీ, అలా ఒక థియేటర్ , నిర్మాణం మధ్యలో ఆగిపోయి తీవ్రమైన నష్టం కలిగించిందనీ, ఈ బాధలు భరించలేక ఇంకొకరైతే, ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పేవారనీ, తాను పట్టుపట్టి అంతుచూడాలనుకున్నాననీ, సాధించగలిగానని వెంకయ్య తన డైరీలో రాసుకున్నారు.
సినిమాలను రూపొందించడంలో శిక్షణ కోసం తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ ను ఆరోజుల్లోనే లండన్ పంపించారు.లండన్ లోని ప్రముఖ దర్శకుల వద్ద శిక్షణ తీసుకున్న ప్రకాష్ ఇండియా వచ్చి తన తండ్రితో కలిసి దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ద ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని తమ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు.
వీరిద్దరి కాంబినేషన్లో మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. ప్రముఖ దర్శకులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ తొలినాళ్ళలో ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్', 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూకీ సినిమాలు తీశారు. వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు.
సినిమాల మీద పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ ఆదాయం రావడంతో రఘుపతి వెంకయ్య ఆర్థికంగా నష్టపోయి తమ సినిమా స్టూడియోను సైతం అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా రంగాన్ని వీడి ఫోటో స్టూడియో, చిత్రాల ప్రదర్శనశాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఆయన కుమారుడు ప్రకాష్ మాత్రం సినిమా రంగంలోనే కొనసాగారు.వయోభారం కారణంగా 1941, మార్చి 15న తన 71 వ యేట చెన్నైలోని తన స్వగృహంలో కన్నుముశారు.తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1981 నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును నెలకొల్పి, పలువురు సినీ ప్రముఖులకు అందజేయడం జరిగింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి