సృజనాత్మక దర్శక నిర్మాత - గుణ్ణం గంగరాజు
- October 19, 2024
తెలుగులో సున్నితత్వాన్ని మేళవించి హృదయాత్మకమైన చిత్రాలు తీసిన దర్శకుల్లో ఒకరు గుణ్ణం గంగరాజు. చాలా మంది దర్శకులు ఒక సినిమా కమర్షియల్‌గా ఎంత సక్సెస్ అవుతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్ది మంది దర్శకులు మాత్రమే కథను కొత్తగా చెప్పాలి..లేదంటే తెలిసిన కథనే కొత్తగా చూపించాలి అని అనుకుంటారు.అందులో మొదటి వరుసలో గంగరాజు ఉంటారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే బుల్లితెరమీద అమృతం, నాన్న ధారావాహికలను రూపొందించి, బుల్లితెరకు తెలుగు నాట క్రేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా గంగరాజు గారికే దక్కుతుంది. సృజనాత్మకతతో కూడిన ఆహ్లాదకర సినిమాలను రూపొందించడంలో గంగరాజు గారిది అందె వేసిన చేయి. నేడు సుప్రసిద్ధ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు గారి పుట్టినరోజు.
గుణ్ణం గంగరాజు గారు 1955, అక్టోబర్19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జన్మించారు. గంగరాజు గారు కాకినాడ సెయింట్ జోసఫ్స్ కాన్వెంట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ తర్వాత మెడిసిన్ కోసం ప్రయత్నం చేసినా, రాకపోవడంతో విజయవాడ లయోలా కాలేజీలో బీఏ చేరారు. విద్యార్ధి ఆందోళనలో పాల్గొన్నారనే నెపంతో కాలేజీ నుంచి డిస్మిస్ అయ్యారు. అనంతరం ప్రైవేట్ గా బీఏ ఇంగ్లీష్, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారు.
గంగరాజు గారు మొదట చేసిన ఉద్యోగం నవభారత్ సిగెరెట్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ గా కొంతకాలం పనిచేశారు. పీజీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓగా చేరి అస్సాం,మేఘాలయ రాష్ట్రాల్లో పనిచేశారు. అయితే, కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి హైదరాబాద్ లోని తన ఫ్రెండ్స్ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ కమ్ క్రియోటివ్ డైరెక్టర్ గా ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఆయనే సొంతంగా ఫౌంటెన్ హెడ్ డిజైన్ స్టూడియో, వాడిలాల్ ఐస్ క్రీమ్స్ వంటివి ప్రారంభించినా వాటిల్లో నష్టం రావడంతో మూసేశారు. ఆ తర్వాత ఫాంట్ కార్డ్స్ అనే గ్రీటింగ్ కార్డ్స్ షాప్ నిర్వహించి విజయవంతంగా నిర్వహించారు.
గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారంలో బిజీగా ఉన్న సమయంలోనే రాంగోపాల్ వర్మతో ఏర్పడ్డ పరిచయం ఆయన్ని సినిమాల వైపు నడిపించింది. ఎటువంటి అనుభవం లేకుండానే సినిమాల్లోకి రావాలని ఆయన రావాలనుకున్నా, దర్శకుడు రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో అప్పటి ప్రభుత్వం కోసం యాడ్స్ రూపొందించారు. అవి సూపర్ హిట్ కావడంతో దర్శకత్వం మీద నమ్మకం ఏర్పడింది. 1995 చివర్లో "లిటిల్ సోల్జర్స్ " కథను రాసుకొని, తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో నటించిన చిన్న పాప కావ్య తన తోడల్లుడైన ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి గారి కూతురు కావడం విశేషం. ఎన్నో వ్యయప్రయాసలు పడి రూపొందించిన ఆ చిత్రం 1996లో విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అయితే, పబ్లిసిటీ లోపంతో ఆర్థికంగా మాత్రం విజయవంతం కాలేదు. ఈ సినిమాకు ఆరు నంది అవార్డులు, ఒక నేషనల్ అవార్డు వచ్చాయి. తెలుగులో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.
లిటిల్ సోల్జర్స్ తర్వాత యాడ్ ఫీల్మ్స్ తీయడంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో జస్ట్ యాల్లో అనే బ్యానరును స్థాపించిన రాజు గారు నిర్మాతగా మారి 2003లో ‘ఐతే’ చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంభాషణలు రాయడమే కాకుండా, విలన్ గా చేసిన పవన్ మల్హోత్రాకు డబ్బింగ్ సైతం చెప్పారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించండంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదే సినిమా తమిళ్లో ‘నామ్’గా, మలయాళంలో ‘వాంటెడ్’గా రీమేక్ అయింది.
‘ఐతే’ చిత్రం తర్వాత 2005లో ఛార్మీ, జగపతిబాబు, శశాంక్ ప్రధాన పాత్రల్లో ‘అనుకొకుండా ఒక రోజు’ అనే మిస్టరీ థ్రిల్లర్‌ను యేలేటి దర్శకత్వంలోనే నిర్మించారు. హీరోయిన్ లైఫ్‌లో ఒక రోజు మిస్సయింది. ఆ ఒక్క రోజు ఎలా మిస్సయింది? అసలు ఆ రోజు ఏం జరింగింది? అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్సిపీరియెన్స్ ఇచ్చిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. డ్రగ్స్ వాడేవారు, మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్మేవారు ఇద్దరూ ఒకటే.. వీళ్లిద్దరూ పిచ్చివారే అనే సారాంశంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ చిత్రానికి రెండు నంది అవార్డులు వచ్చాయి.
2006లో నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం 'బొమ్మలాట' చిత్రానికి గంగరాజు నిర్మాతగా వ్యవహరించారు. అదే, ఏడాది తన దర్శక నిర్మాణంలో 'అమ్మ చెప్పింది' చిత్రాన్ని రూపొందించారు. శర్వానంద్, శ్రియా రెడ్డి, సీనియర్ నటి సుహాసిని ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా నంది అవార్డు వచ్చింది. ఇప్పటికి ఈ చిత్రం బుల్లితెర మీద కనువిందు చేస్తూనే ఉంటుంది. 2006లోనే రాజమౌళి దర్శకత్వంలో 'యమదొంగ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా, ఆర్థికంగా బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్ ఏ డే, కథ చిత్రాలకు నిర్మాతగానే కాకుండా కథ, మాటలు రాశారు.
గంగరాజు గారు బుల్లితెరమీద అమృతం, నాన్న సీరియల్స్ రూపొందించారు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరమీద సంచనాలు నమోదు చేశాయి.ముఖ్యంగా అమృతం సీరియల్ అయితే తెలుగు బుల్లితెరమీద హాస్యప్రధాన సీరియళ్లు రూపొందడానికి ప్రేరణగా నిలిచింది. అమృతం సీరియల్ తర్వాత రాధా మధు, అమ్మమ్మ.కామ్, లయ, అడగక ఇచ్చిన మనసు మరియు ఎదురీత వంటి సీరియళ్లను నిర్మించారు. తెలుగులో బుల్లితెరకు క్రేజ్ తీసుకొచ్చిన వ్యక్తిగా గంగరాజు గారు నిలిచారు.
గంగరాజు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామి రెడ్డి పెద్ద కుమార్తె ఉర్మిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరబ్బాయిలు( సందీప్, విహంగ్). ప్రముఖ డాక్టర్లైన బొల్లినేని భాస్కరరావు (కిమ్స్ హాస్పిటల్స్), గురువారెడ్డిలు ఆయన తోడల్లుడులు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి, రమా రాజమౌళి, శ్రీవల్లీ కీరవాణి గంగరాజు గారికి దగ్గర బంధువులు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం గంగరాజు వద్ద యాడ్ ఫిల్మ్స్ లో పనిచేశారు. గంగరాజు భార్యా ఊర్మిళ, కుమారుడు సందీప్ లు సినీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సందీప్ ఇండియాలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు యాడ్స్ తీస్తూ ఉంటారు.
గంగరాజు గారు వైవిధ్యభరితమైన చిత్రాలను, సీరియళ్లను రూపొందించడానికి కారణం ఆయనకు సినిమాల పట్ల ఉన్న ఫ్యాషన్ కారణం. ఆయన చిత్రాలన్ని జయాపజయాలకు అతీతంగా కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోవడమే కాకుండా ఇండియాలో ఉన్న సృజనాత్మక వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన స్పూర్తితో ఎందరో యువ దర్శకులు తెరమీద కొత్త కథలను చెప్పారు.ఆయన రూపొందించిన సినిమాల సంఖ్య తక్కువైనా, వాటిని వైవిధ్యభరితంగా తెరకెక్కించి, సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స