సాహితీ విరూపాక్షుడు-విద్వాన్ విశ్వం
- October 21, 2024
తెలుగునాట విద్వాన్ విశ్వంది ప్రత్యేక స్థానం. వీరి జీవితంలో ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా కలిసిపోయాయి. ప్రాకృతం, సంస్కృతం, ఆంగ్ల భాషలను ఆకళింపు చేసుకున్న పాండిత్యం ఆయన సొంతం. వామపక్ష ఆలోచనలనూ, భారతీయ లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది విశ్వం.విద్వాన్ విశ్వం అనగానే చాలామందికి మాణిక్యవీణ కాలమ్ గుర్తుకువస్తుంది. ఆంద్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకుడిగానే ఆయన సుప్రసిద్ధులు. నేడు స్వాతంత్ర్య సమరయోధులు, సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు పాత్రికేయులైన విద్వాన్ విశ్వం జయంతి.
విద్వాన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వ రూపాచారి.1915, అక్టోబర్ 21వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో మునిరామాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. చిన్న లతనంలో రామాయణం శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు, ప్రొద్దుటూరులలో సంస్కృత కావ్య నాటక అలంకారాలను, తర్క శాస్త్రాన్ని ఆభ్యసించారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుండి సంస్కృతంలో, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టా పుచ్చుకున్నారు. అప్పటి నుండి ఆయన్ని విద్వాన్ విశ్వం అని పిలుస్తూ వస్తున్నారు.
విద్వాన్ విశ్వం తొలుత సంస్కృత ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, పరిశోధనల మీదున్న మక్కువతో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్న చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశారు. సంస్కృతం మీద విస్తృతమైన పరిశోధన జరపడానికి అనువుగా ఉన్న కాశీ విద్యా పీఠంలో చేరారు. కాశీ వాతావరణం పడకపోవడంతో కొద్దీ రోజుల్లోనే తిరిగొచ్చేశారు. ఇదే సమయంలో అనంతపురం కేంద్రంగా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తన మిత్రుడైన తరిమెల నాగిరెడ్డి గారితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు.
ప్రజలను చైతన్య పరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్య సాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు విశ్వం సంపాదకత్వం వహించారు. ఫాసిజం మొదలైన అంశాలపై పలు పుస్తకాలను ప్రచురించారు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలులోనూ నిర్భందించింది.తిరుచిరాపల్లి జైలులో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత బెజవాడ గోపాలరెడ్డి గారి వద్ద బెంగాలీ నేర్చుకున్నారు. ఈ జైలులోనే రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది.
జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వం గారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంత పురం జిల్లా జాతీయ సభకు, జిల్లా లోకజన సంఘానికి, మండల క్షామ నివారణ సభకు, జిల్లా ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలను శాస్త్ర పద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించారు. విశ్వం గారి ప్రతిభను గురించి విన్న ప్రముఖ రచయిత మరియు పాత్రికేయ దిగ్గజం అడివి బాపిరాజు గారు, తాను సంపాదకత్వం వహిస్తున్న మీజాన్ పత్రికలో చేరేందుకు ఆహ్వానించారు.
1945వ సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మీజాన్ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశారు.అయితే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా మీజాన్ పత్రికను నడిపిస్తున్నారనే అభియోగం రావడంతో ఆ పత్రికకు రాజీనామా చేసి, విజయవాడలో ప్రారంభమైన ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు. మీజాన్ , ప్రజాశక్తి పత్రికల్లో వ్యవహార భాషా శైలిని ప్రవేశపెట్టి పామరలకు సైతం అర్ధమయ్యే రీతిలో వార్తలు వెలువడ్డాయి. అయితే, ప్రజాశక్తి వామపక్ష పెద్దల విపరీత జోక్యంతో ఆ పత్రికకు రాజీనామా చేసి మద్రాస్ కేంద్రంగా నడుస్తున్న బాలభారత్ విద్యాలయం ప్రచురణల విభాగంలో సంపాదకునిగా పనిచేశారు.
1952లో మద్రాస్ కేంద్రంగా నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో ప్రారంభమైన ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో ఎడిటర్ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశారు.1959-60 మధ్యలో కొద్దీ కాలం ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా, 1960లో విజయవాడ నుంచి ఆంధ్రజ్యోతి మొదలైన సమయంలో నార్ల వారి ఆహ్వానం మేరకు అక్కడ చేరి అసోసియేట్ ఎడిటర్‌గా 1963 వరకు పనిచేశారు. 1963లో ఆంధ్రప్రభ దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా చేరి 1973 నాటికి ఆంధ్రప్రభ వారపత్రిక ఎడిటర్ అయ్యారు. 1973-81వరకు సంపాదకులుగా పనిచేశారు.
పత్రికా రచయితగా విశ్వం సామర్ధ్యాన్ని, సృజనను ఆయన శీర్షికా వ్యాసాల ద్వారా చాలావరకూ బేరీజు వేసుకోవచ్చు. అయితే సంపాదకుడుగా ఆయన ప్రతిభ బోధపడాలంటే వారి నిర్వహణలో ఎటువంటి శీర్షికలు ప్రారంభమయ్యాయి, వాటి వస్తు సంవిధానాలు, అలాగే వాటి రచయితల ఎంపిక ఏవిధంగా ఉండేవో ఆయా సంచికలను సూక్ష్మదృష్టితో అధ్యయనం చేస్తే తప్ప బోధపడదు. నిజానికి తెలుగు పత్రికారంగంలో విశ్వం మాణిక్యవీణ కాకుండా మరో రెండు వీణలు ఉన్నాయి. గోరా శాస్త్రి వినాయకుని వీణ వాయించగా బాలాంత్రపు రజనీకాంతరావు విశ్వవీణను సవరించారు. 1952 నుంచి 1987 వరకు ముప్పై అయిదేళ్ల పాటు నిరాటంకంగా పలు పత్రికల్లో అవి -ఇవి, నలుపు-తెలుపు, మాణిక్యవీణ, వీరికన్నే, రాతలు -గీతలు, నా హృదయం వంటి సంపాదకీయ శీర్షికలు వ్రాసి ఎనలేని కీర్తిని సాధించారు.
దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. తెలుపు-నలుపు శీర్షికలో విశ్వం భాష గురించి, పలుకుబడుల గురించి చేసిన చర్చ అప్పట్లో సాహిత్యవేత్తల్లో గొప్ప ఆసక్తిని రేపింది.బాణుడు రచించిన ‘కాదంబరి’ మహా కావ్యాన్ని విద్వాన్ విశ్వం గారు తెలుగులో అందించారు. దానితోపాటు కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్రకు విశ్వం గారు అనువాదాలు చేశారు.
1981లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. ఈ సమయంలోనే విశ్వం గారు కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించారు. "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించారు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించారు.
విశ్వం గారు లాంటి సంపాదకులు రచయితలను స్వేచ్చగా రాయనిచ్చి , సహజంగా ఎదగనివ్వటం వల్లనే ఒక లత, కృష్ణ కుమారి, రంగనాయకమ్మ , కౌసల్యా దేవి , విశాలాక్షి, అచ్యుతవల్లి మొదలైనవారు రచయితలుగా తెలుగునాట సుస్థిరమైన స్థానాన్ని పొందగలిగారు అంటారు ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్. సమాజసేవ మరియు సాహిత్య ఆరాధన పెనవేసుకున్న వ్యక్తి విద్వాన్ విశ్వం అంటారు తిరుమల రామచంద్ర. తెలుగు సాహిత్య అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన విద్వాన్ విశ్వం 1987, అక్టోబర్ 19న కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







