రాజస్థాన్ కేసరి-భైరాన్‌సింగ్ షెకావత్
- October 23, 2024
దేశ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని జాతీయ నాయకులు ఉండరు.స్వాతంత్ర భారత రాజకీయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండి తుది శ్వాస వదిలే వరకు ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి కానీ అతి కొద్ది మంది నేతల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ ఒకరు.స్వరాష్ట్రమైన రాజస్థాన్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.రాజస్థాన్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన అభివృద్ధి ప్రదాతగా షెకావత్ నిలిచిపోయారు.నేడు రాజస్థాన్ కేసరిగా ప్రసిద్ధి గాంచిన భారత మాజీ ఉపరాష్ట్రపతి స్వర్గీయ భైరాన్‌సింగ్ షెకావత్ జయంతి.
భైరాన్‌సింగ్ షెకావత్ 1923,అక్టోబర్ 23న ఒకప్పటి రాజపుట్న ప్రావిన్స్ (తర్వాత కాలంలో రాజస్థాన్ రాష్ట్రం) లోని శిఖర్ దగ్గర ఉన్న కాచారియవాస్ గ్రామంలో రాజపుత్రుల కుటుంబానికి చెందిన దేవి సింగ్ షెకావత్, బనే కన్వర్ దంపతులకు జన్మించారు. తండ్రి గ్రామంలో పేరున్న ఆసామి. షెకావత్ గారు మంచి ప్రతిభ పాటవాలు కలిగిన విద్యార్థిగా రాణించారు. తండ్రి ఆకస్మిక మరణంతో ఎస్.ఎల్.సి తోనే చదువును ఆపేసి వ్యవసాయదారుడిగా మారి వ్యవసాయం చేశారు. రాజపుట్న రాష్ట్ర పోలీస్ సర్వీస్ లో ఠాణా పోలీస్ అధికారిగా కొంత కాలం పనిచేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజపుట్నలోని పలు రాజ్యాలు స్వతంత్ర ప్రతిపత్తి కోసం ముమ్మరంగా చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టడంలో నాటి ఆ ప్రాంత యువత భాగస్వామ్యం మరువలేనిది. తమ స్వతంత్ర కోసం పాకిస్థాన్ లో సైతం కలవాలనుకున్న రాజ్యాధినేతల కుట్రలను విఫలం చేసిన యువ అధికారుల్లో షెకావత్ ఒకరు. స్వరాష్ట్రం సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం ఫణంగా పెట్టి మారి రాజస్థాన్ ఏకీకరణ ఉద్యమంలో భాగమయ్యారు. ప్రజల ఒత్తిడి, నాటి భారత హోం మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాణక్యం ఫలించి రాజపుట్నలోని రాజ్యాలన్ని కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పాటైంది.
షెకావత్ చిన్నతనంలో రాజపుత్రల వీరగాథలు, రామాయణ, మహాభారతాలు వింటూ పెరిగారు. తల్లి గారి మార్గదర్శనంలో హిందూ సంస్కృతి పట్ల అనురక్తిని పెంచుకున్నారు. ఠాణా పోలీస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలోనే ఆరెస్సెస్ తరుపున రాజస్థాన్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎల్.కె.అద్వానీ గారితో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి. అద్వానీ ద్వారా ఆరెస్సెస్ పనితీరును గమనించేందుకు లభించింది. సంఘ్ యొక్క జాతీయవాద భావజాలానికి ఆయన ఆకర్షితులయ్యారు. అలా, అద్వానీతో మొదలైన పరిచయం ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికింది.
1951లో జనసంఘ్ పార్టీని స్థాపించిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. రాజస్థాన్ రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతను భుజాన వేసుకొని, పార్టీ విస్తరణ మరియు అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను తయారు చేయడంలో అహర్నిశలు శ్రమించారు. సంఘ్ పెద్దలు ఆశీస్సులు, నాటి జనసంఘ్ అగ్రనేతలు దీన దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయ్ మద్దతుతో రాజస్థాన్ జనసంఘ్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు షెకావత్. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో జనసంఘ్ పార్టీ తరుపున ఎన్నికైన ఏకైక ఎమ్యెల్యేగా షెకావత్ నిలిచారు. షేకావత్ నాయకత్వంలో జనసంఘ్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దీటుగా బలమైన రాజకీయ పక్షంగా ఎదిగింది.
1960 మధ్య నాటికి జనసంఘ్ జాతీయ నాయకత్వంలో వచ్చిన మార్పులు చేర్పుల్లో షెకావత్ జాతీయ నాయకుడి హోదాను అందుకున్నారు. తన మిత్రులైన అద్వానీ, వాజపేయ్ మద్దతు పుష్కలంగా ఉండటంతో రాజస్థాన్ జనసంఘ్ పార్టీలో రాజకీయ ప్రయోగాలు చేయడానికి అవకాశాలు లభించాయి. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూనే, జనసంఘ్ పార్టీ బలోపేతానికి కావాల్సిన కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చారు షెకావత్. రాజ భరణాలు రద్దు, బ్యాంకుల జాతీయకరణ మూలంగా దేశ రాజకీయాల్లో స్వతంత్ర పార్టీ కుదేలు కావడంతో, ఆ స్థానాన్ని జనసంఘ్ భర్తీ చేసింది. స్వతంత్ర పార్టీకి వెన్నెముకలా నిలిచిన రాజస్థాన్ రాష్ట్రంలో ఆ పార్టీ క్యాడర్ మొత్తాన్ని జనసంఘ్ వైపు మళ్లించడంలో షెకావత్ సఫలీకృతం అయ్యారు.
1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలవడంతో షెకావత్ గారిని సైతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం చర్చలు జరపడంలో తన పార్టీ తరుపున కీలకంగా వ్యవహరించారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలన్ని కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డ తర్వాత లోక్ సభతో పాటుగా రాజస్థాన్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ విజయబావుట ఎగరవేయడంలో షెకావత్ కీలకమైన పాత్ర పోషించారు. 1977లో రాజస్థాన్ తోలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా షెకావత్ బాధ్యతలు చేపట్టారు. 1977-80 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. 1980లో అధికారంలోకి వచ్చిన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంతో రెండున్నర ఏళ్లకే పదవి నుంచి దిగిపోయారు.
జనతా పార్టీ విచ్ఛిన్నం కావడం మూలాన పూర్వ జనసంఘ్ నేతలందరూ కలిసి 1980లో అటల్ బిహారీ వాజపేయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో షెకావత్ సైతం ఒకరు. అద్వానీ, వాజపేయ్ లకు పార్టీ నిర్మాణ పనుల్లో షెకావత్ తన సహకారాన్ని అందిస్తూ వచ్చారు. అదే ఏడాది భారతీయ జనతా పార్టీ తరపున రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికై ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా కంఠక విధానాలపై పోరాటాలు చేశారు. 1990లో జనతాదళ్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేతను సాకుగా చూపి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వాన్ని రెండోసారి బర్తరఫ్ చేయడంతో మళ్ళీ రెండున్నర ఏళ్లకే సీఎంగా దిగిపోయారు.
షెకావత్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం పట్ల రాజస్థాన్ ప్రజల్లో కాంగ్రెస్ మీద ఆగ్రహం పెల్లుబికింది. 1993లో జరిగిన రాజస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో షెకావత్ నాయకత్వంలోని భాజపాకు పట్టం కట్టి ముచ్చటగా మూడోసారి సీఎంను చేసుకున్నారు. ఆఖరి టరంలో ఐదేళ్ల పాటు పాలించిన షెకావత్ గారు, సొంత పార్టీ నాయకుల చేసిన ఎన్నికల తప్పిదాల మూలంగా 1998 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నేతగా 2002 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. 2002లో ఎన్డీయే కూటమి తరపున భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై 2007 వరకు ఆ పదవిలో కొనసాగారు.
రాజస్థాన్ రాష్ట్రాన్ని షెకావత్ ఎంతో ప్రేమించేవారు. అన్ని రంగాల్లో రాజస్థాన్ అభివృద్ధే లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగం అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు జల సంరక్షణ కార్యక్రమాలు వంటివి యుద్ధ ప్రతిపాదికన చేపట్టారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంత్యోదయ యోజన పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. వరల్డ్ బ్యాంక్ అయితే ఏకంగా "రాక్ ఫెల్లర్ ఆఫ్ ఇండియా"గా కీర్తించింది. కరువు కాటకాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఆచరిస్తున్న సతి వంటి సాంఘిక దురాచారాన్ని రూపు మాపడంలో షెకావత్ కీలకంగా వ్యవహరించారు.
రాజస్థాన్ అసెంబ్లీకి 10 సార్లు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన షెకావత్ గారు, చట్టసభల విలువల పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాజ్యసభ చైర్మన్ గా ఆయన చూపిన చొరవ, హుందాతనంతో వ్యవహరించిన విధానం పట్ల అన్ని పక్షాల నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.
నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తారు షేకావత్. రాజస్థాన్ రాష్ట్ర ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించారు.
నెహ్రూ, ఇందిరా గాంధీలు తమ దూతల ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానాలు పలికినా, ఎన్నో రకాల రాజకీయ ఒత్తిడులకు గురి చేసినా వాటికి తలొగ్గకుండా నమ్మిన సిద్ధాంతం పట్ల అంకితభావంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేశారు. ఆ సైద్ధాంతిక నిబద్దత మూలంగానే ఆయనకు అన్ని పక్షాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడేలా చేసింది. ఈ విధంగానే సోషలిస్టు దిగ్గజ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ వీరికి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
షెకావత్ గారికి రాజకీయాల్లో ఉన్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో అద్వానీ, వాజపేయ్ లు ముఖ్యులు. జనసంఘ్ పార్టీ ద్వారానే మొదలైన వీరి రాజకీయ ప్రయాణం, సుమారు ఐదు దశాబ్దాల పాటు సాగింది. బీజేపీ ఏర్పడిన తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాన్ని తన మిత్రుల కోసం త్యజించి రాజస్థాన్ రాజకీయాలకే పరిమితం అయ్యారు. భాజపాలో షెకావత్ ప్రాధాన్యత తగ్గించేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను అద్వానీ, వాజపేయ్ ఆదిలోనే తుంచేసేవారు. షెకావత్
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి కావడానికి అప్పటి ఎన్డీయే కూటమిలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించడంలో తమ వంతు పాత్రను వాజపేయ్, అద్వానీలు పోషించారు. ఒక విధంగా వీరు ముగ్గురు పరస్పర అవగాహనతో కూడిన రాజకీయాలు నెరిపారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
రాజస్థాన్ ప్రజలకు భైరాన్‌సింగ్ షెకావత్ గారి మీద ప్రత్యేకమైన గౌరవంతో కూడిన అభిమానం ఉంది. కుల, మతాలకు అతీతంగా అందరివాడిగా నిలిచిపోయారు. ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమైన రాజకీయ చట్రంలో రాజస్థాన్ రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచారు. రాజస్థాన్ ఆత్మగౌరవ ప్రతీకగా, రాజస్థాన్ కేసరిగా భైరాన్‌సింగ్ షెకావత్ ఆ రాష్ట్ర ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన గతించి దశాబ్దం కావొస్తున్నా, ఇప్పటికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రస్తావన వినబడుతూనే ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!