పాత్రికేయ భీష్మాచార్యుడు-వరదాచారి
- October 24, 2024
ఎంత సృజనాత్మక కళ అయినా దాన్ని నేర్చుకోవడానికి ప్రామాణికమయిన పాఠాలు ఉండాలి. లేకపోతే ఒక విద్యగా అది లోకానికి అందదు. నేర్చుకున్న విద్యతో పోలిస్తే కోటి రెట్లు మెరుగుగా ప్రదర్శించేవారు ఉండవచ్చు.కానీ నేర్చుకోవడానికి పాఠాలు మాత్రం సులభంగా ఉండాలి. గొప్ప సృజనాత్మక విద్య ఉన్నవారు…వారి విద్యను పాఠంగా ఇతరులకు చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఒక విద్యలో గొప్పగా పాఠం చెప్పేవారు అదే విద్యను ప్రదర్శించడంలో రాణించవచ్చు, రాణించలేకపోవచ్చు. చదివిన చదువును చేసే పనికి అన్వయించి ఫలితం సాధించిన నేర్పరి, ఆ చదువును తరగతి గదుల్లోను చెప్పి ఎందరో యువ జర్నలిస్టులను అక్షరాల అంటుకట్టి తీర్చిదిద్దిన మాలకరి, సమకాలీనులకే కాకుండా ముందుతరాలకు సైతం పనికొచ్చే రచనలు చేసిన కూర్పరి, ఏది జర్నలిజం, ఏది కాదని క్షీరనీర న్యాయం చెప్పిన తీర్పరి వరదాచారి. నేడు తెలుగు పాత్రికేయ భీష్మాచార్యుడు జి.ఎస్ గా సుపరిచితులైన స్వర్గీయ జి.ఎస్. వరదాచారి జయంతి.
జి.ఎస్.వరదాచారి పూర్తి పేరు గోవర్ధన సుందర వరదాచారి. 1932, అక్టోబర్ 24న నిజాం పాలనలో ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆర్మూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి1954లో బి.ఏ, 1956 జర్నలిజంలో పి.జి.డిప్లొమా,1959లో ఎల్.ఎల్.బి డిగ్రీలు పూర్తిచేశారు. జి.ఎస్ జర్నలిజంలోకి యాదృచ్ఛికంగా వచ్చినవారు కాదు. తాను చదివిన మొదటి పత్రిక ‘కృష్ణా పత్రిక’ అన్న సంగతి కూడా ఆయన గుర్తుంచుకున్నారు. అనుకోకుండా ఆ పత్రికకు పాఠకుడయ్యారు. జర్నలిజం డిప్లొమా చేస్తున్న రోజుల్లోనే విద్యార్థుల అభ్యాసన పత్రిక ‘ఉస్మానియా కొరియర్’కు సంపాదకుడుగా ఎంపికైనారు. అప్పట్లోనే ఆధ్యాత్మిక పత్రిక ‘వైష్ణవ’ను తొమ్మిది మాసాలపాటు నడిపారు.
జర్నలిజం కోర్సులో భాగంగా ఆరోజుల్లోనే మద్రాసు వెళ్ళి ‘ది హిందూ’ పత్రికలో ఇంటర్న్‌షిప్ చేశారు. ‘తెలుగు పత్రికల చరిత్ర’పై అధ్యయనపత్రం సమర్పించారు. క్రమం తప్పకుండా విధులకు హాజరై ఎడిటింగ్ మరియు ఇతరత్రా అంశాలను నేర్చుకోవడమే కాకుండా కొన్ని స్థానిక వార్తల రిపోర్టింగ్ సైతం చేసి ప్రశంసలు అందుకున్నారు. వీరి ప్రతిభకు మెచ్చి హిందూలో చేరమని వారు కోరినా చేరలేదు. తెలుగు పత్రికలో పనిచేయాలనే తపనతో 1956లో భాగ్యనగరంలో ఉన్న ‘ఆంధ్రజనత’ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రచురించిన 32 పేజీల ప్రత్యేక అనుబంధం కోసం ‘వంద సంవత్సరాల తెలుగు పత్రికల సమగ్ర చరిత్ర’ను రాశారు.
జర్నలిజం డిప్లొమాలో తాను ఇంగ్లీషులో సమర్పించిన అధ్యయన పత్రానికి ఆయన అప్పటికప్పుడు చేసిన తెనుగింపే ఆ ‘చరిత్ర’. ఈ వ్యాసాన్ని చదివిన సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, హైదరాబాద్ వచ్చినప్పుడు సరాసరి ‘ఆంధ్రజనత’ కార్యాలయానికి వచ్చి ఎడిటర్ సుబ్రహ్మణ్యంను కలిసి తన చేతిలోని వ్యాసం ప్రతి చూపి, దాని రచయితను కలుసుకోవాలని చిరునామా అడిగారట, మెచ్చుకున్నారట. జర్నలిజంలో కొనసాగుతూనే ఎల్ఎల్.బి పూర్తి చేశారు. దీనివల్ల పత్రికలకు సంబంధించిన చట్టాలు, న్యాయాన్యాయాలు వారికి కొట్టినపిండై పోయాయి. అజంత ‘ఆంధ్రప్రభ’కు వెళ్ళిపోయిన తర్వాత వరదాచారికి అసిస్టెంట్ ఎడిటర్‌గా పదోన్నతి కల్పించారు.కాని వరదాచారి 1961లో ఆయన కొత్తగా సికింద్రాబాద్ నుంచి పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువరిస్తున్న ‘ఆంధ్రభూమి’ దినపత్రిక న్యూస్ ఎడిటర్‌గా కోరి చేరారు.
'తెలుగు చలనచిత్రాల సమీక్ష – ఒకే ఫ్రేమ్‌లో డిటో ఉంటా’యనీ, చిత్రం పేరు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రమే మారతాయని సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చేసిన నిజాయితీ గల వ్యాఖ్యను సత్యదూరమనేలాగా గుణాత్మకమైన చిత్ర సమీక్షలను చేయడం వరదాచారి ‘చిత్రభూమి’ కాలమ్ ద్వారా ప్రారంభించారు.సినిమా సమీక్షలు అనగానే బ్రహ్మాండం, భజగోవిందం కాకుండా సినిమా సమీక్షకు ఒక దారిదీపంగా నిలిచారు. అప్పట్లో మద్రాసువారు రాసే సమీక్షలకు భిన్నంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా హైదరాబాద్ పాత్రికేయులు చేసే సమీక్షలకు సినీప్రముఖులు మెల్లగా అలవాటుపడ్డారు. ఫిలిం జర్నలిజం విభాగంలో ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్ అవార్డును సైతం అందుకున్నారు.
1961 నుండి 1982 చివరి వరకు అంటే సుమారు 22 ఏళ్ళ పాటు ఆంధ్రభూమి దినపత్రికలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన గురించి కాకుండా తన దగ్గర పనిచేసే సబ్ ఎడిటర్ల బాగోగులు వారు చూసేవారు. అవసరమైనప్పుడు యాజమాన్యంతో మాట్లాడి తక్షణ సహాయం చేసేవారు. అందువల్ల సంపాదకవర్గంలో వరదాచారిని అందరూ న్యూస్ ఎడిటర్‌గానే కాకుండా ఒక పెద్దమనిషిగా, ‘వరదహస్త’మిచ్చే కుటుంబ పెద్దగా గౌరవించేవారు. ఆంధ్రభూమి తర్వాత ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతకాలం వార్తలు రాశారు. 1983లో ‘ఈనాడు’ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ సంపాదకీయం, ప్రధాన వ్యాసాలు రాసే ఉద్యోగమైనా– గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎడిటర్ అని కాకుండా అసోసియేట్ ఎడిటర్‌గా నియామకం చేస్తామని ఈనాడు అధినేత రామోజీరావు గారు చెప్పడంతో చేసే ఉద్యోగం అదే కదా అని వరదాచారి చేరిపోయారు. అక్కడ దాదాపు ఆరేండ్లు పనిచేశారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు మాధ్యమంలో పత్రికా రచన కోర్సు ప్రవేశపెడుతూ వరదాచారి గారి విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి వైస్ ఛాన్సలర్ 1988 డిసెంబరులో విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియామకం చేసి జర్నలిజం శాఖాధిపతి బాధ్యతలు అప్పగించారు. అక్కడ దాదాపు ఇరవైరెండు సంవత్సరాలు పనిచేసి ఎందరో యువ జర్నలిస్టులను తయారుచేశారు. పత్రికా చట్టాలు పత్రికా విలువలు చెప్పే పాఠ్యగ్రంథాలు రాశారు. ఇట్లా పత్రికా వ్యాసంగంతో పాటుగా తన కిష్టమైన అధ్యాపకరంగంలోను సమానకృషి చేసి సర్వశ్రేయో మార్గదర్శిగా తన వ్యక్తిత్వాన్ని వరదాచారి మలచుకున్నారు.
ఇంగ్లీషు జర్నలిజం విద్యతో పోలిస్తే తెలుగు జర్నలిజం విద్యకు పుస్తకాలు లేని రోజుల్లోనే…ఆయన ఆ పాఠాలను రూపొందించడం మొదలు పెట్టారు. చివరికి తెలుగు జర్నలిజానికి ఆయనే ఒక పాఠమంత ఎత్తుకు ఎదిగారు.జర్నలిస్ట్ ఎంత సరళంగా రాయాలంటే…రాయగలిగిన ఇంకెవ్వరూ దాన్ని ఇక సరళీకరించడానికి వీల్లేనంత సరళంగా రాయాలని పదే పదే చెప్పారు. ఆయన అలాగే రాశారు. అలా ఎలా రాయాలో నేర్పారు. ఆ నేర్పును ఒక పాఠంగా లోకానికి ఇచ్చారు. 2010లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ మరియు అప్పటి హెచ్ఎంటీవీ ఎడిటర్‌గా ఉన్న కె. రామచంద్రమూర్తి గారి ఆహ్వానం మేరకు హెచ్ఎంటీవీలో అంబుడ్స్‌మన్ (తీర్పరి)గా జర్నలిజం విలువలు, నైతికాంశాలను వివరిస్తూ 2013 దాకా కొనసాగారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం వరదాచారి గారు 1980లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడుగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలు వరదాచారి నిర్వహించారు. మరోపక్క భాగ్యనగరంలో ఏర్పాటైన వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా 2006 నుంచి తుదిశ్వాస విడిచే వరకు సంఘం అభివృద్ధికి కృషిచేస్తూనే వచ్చారు.
తెలుగు జర్నలిజంలో అరుదైన వ్యక్తిగా వరదాచారి నిలిచిపోయారు. దాదాపు అరవై ఏళ్లపాటు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన గురించి రాయడం అంటే…తెలుగు జర్నలిజం గురించి రాయడమే. జర్నలిస్టుగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నార్ల వెంకటేశ్వరావు జీవనసాఫల్య పురస్కారం 2005లోనే ప్రదానం చేసి గౌరవించింది. ఇవే కాకుండా 1976లో కోల్‌కతాలో జరిగిన సర్వ భాష పత్రకర్ సమ్మేళనంలో పత్రాకర్ శిరోమణి బిరుదును అందుకున్నారు. 1992లో జరిగిన షష్టిపూర్తి కార్యక్రమంలో కిన్నెర సంస్థ పత్రీకా రచనాచార్య బిరుదుతో సత్కరించడం జరిగింది. ఇంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడు, ఎందరో జర్నలిస్టులకు వరదాచారి గారు నిస్సందేహంగా తెలుగు పత్రికా ప్రపంచంలో ‘పరిణత పాత్రికేయుడు’గా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు