రెన్యువల్‌ మూడు రోజుల్లోనే

- June 22, 2016 , by Maagulf
రెన్యువల్‌ మూడు రోజుల్లోనే

 ఇంతవరకు పాస్‌పోర్టు పొందా లంటే కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. ఆఖరకు తత్కాల్‌ పాస్‌పోర్టు కావాలన్నా రెండు వారాల గడువు అవసరం. కానీ ఇకముందు పదిరోజుల్లోనే పాస్‌పోర్టు చేతికొచ్చేస్తుంది. నిబంధనల మేరకు అవసరమైన అన్ని ధ్రువపత్రాల్ని అందిస్తే ఇప్పటి నుంచే ఇది సాధ్యం. ఇప్పటి వరకు విశాఖ, విజయవాడల్లోనే ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలున్నాయి. ఇప్పుడు అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న ఉభయ గోదావరిజిల్లాల వాసుల ప్రయోజనార్థం భీమ వరంలో కూడా ఓ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాన్ని ప్రారంభించారు.
బుధవారం ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉపమంత్రి విజయ్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ భీమవరం కేంద్రం నుంచి రోజూ వంద దరఖాస్తులు స్వీకరించే అవకాశము ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్యను పెంచుతామని హామీనిచ్చారు. పాస్‌పోర్టు రెన్యువల్‌ను మూడు రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుదార్లు తమ దరఖాస్తుతోపాటు గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, పాన్‌ కార్డులు జతపర్చాలి. తమపై ఎలాంటి నేరాలు, కేసులు, అవినీతి ఆరోపణలు ఏవంటూ వ్యక్తిగత అఫిడవిట్‌ను సమర్పించాలి. దీంతో పాటు ఫారం 5 ద్వారా పుట్టిన తేదీ ధ్రువ పత్రాన్ని సమర్పించాలి. నివాస, విద్యార్హతల ధ్రువ పత్రాల్ని కూడా పొందుపర్చాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటే కేవలం పదిరోజుల్లోనే పాస్‌పోర్టు మీ చేతికి అందుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
గత ఏడాది సీమాంధ్రలో 3 లక్షల పాస్‌పోర్టులకు దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచే లక్ష దరఖాస్తులు అందాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని భీమవరంలో ప్రాంతీయ కార్యా లయాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఇంత వరకు నగరాలకే పరిమితమైన ఈ కార్యాలయాల్ని ఇకముందు చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా పాస్‌ పోర్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని పాస్‌పోర్టు ఇండియా డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
పొరుగుదేశాలతో సఖ్యత పాటిస్తాం
భారత్‌ తన పొరుగుదేశాలతో సఖ్యత పాటిస్తుందని కేంద్ర మంత్రి వి.కె. సింగ్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను కూడా ఓ పొరుగుదేశంగానే తాము చూస్తున్నామన్నారు. భారత ప్రజలకు అనుకూలం, ఆమోదయోగ్యమైన తీరులోనే పాక్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తున్నా మన్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం కొనసాగా లన్నదే మోడి ప్రభుత్వ ఆకాంక్షగా పేర్కొన్నారు.
భీమవరం విచ్చేసిన కేంద్ర మంత్రి విష్ణు విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారడిగిన సందేహాల్ని మంత్రి నివృత్తి చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థిని షాలినీ భారత్‌- పాకిస్థాన్‌ సంబంధాలపై మోడి ప్రభుత్వ తీరును వివరించాల్సిందిగా కోరడంతో మంత్రి పైవిధంగా బదులిచ్చారు. భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు వ్యవహారాల బిల్లు ఆమోదం పొందడం తన జీవితంలో ఎక్కువగా ఆనందించిన విషయంగా మంత్రి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com