పాత్రికేయ చక్రవర్తి..!

- October 28, 2024 , by Maagulf
పాత్రికేయ చక్రవర్తి..!

నమ్మిన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధితో ఆచరిస్తూ, పత్రికా రచనను అసిధారా వ్రతంగా సాగించిన పాత్రికేయుడు రాఘవాచారి. వామపక్ష భావజాలానికి చిన్నతనంలోనే ప్రభావితుడై, ఆ సిద్ధాంతాల పట్ల నిబద్ధతను కలిగి... జీవితాంతం వాటికే కట్టుబడి, ఒక విజ్ఞాన ఖనిగా ఆయన పేరు గాంచారు. మూడు దశాబ్దాల పాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా పనిచేసిన రాఘవాచారి పత్రికారంగంపై తనదైన ముద్ర వేశారు. పక్షపాత ధోరణి లేకుండా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సమకాలీన రాజకీయాల మీద నిష్పక్షపాతంగా సమగ్ర విశ్లేషణలతో కూడిన సంపాదకీయాలు వెలువరించారు. నేడు సుప్రసిద్ధ పాత్రికేయ దిగ్గజం సి.రాఘవాచారి గారి వర్థంతి.

సిరా అలియాస్ సి.రాఘవాచారి గారి పూర్తి పేరు చక్రవర్తుల రాఘవాచారి. 1939,సెప్టెంబరు 10న నాటి నిజాం పాలనలోని వరంగల్ సుబాలోని పాలకుర్తి తాలూకా శాతాపురం గ్రామంలో చక్రవర్తుల వెంకట వరదాచార్యులు-జానకమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న భూస్వామి. బాల్యంలో ఇంట్లోనే తెలుగుతోపాటు సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లిషు, తమిళం భాషలు నేర్చుకుని వాటిపై సాధికారత సంపాదించారు. సికింద్రాబాద్ సమీపంలోని లాలాగూడ రైల్వే పాఠశాలలో 11వ ఏట అయిదో తరగతీలో చేరారు. నిజాం కళాశాలలో పి.యు.సి పూర్తి చేసి మెరిట్ మీద ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కానీ ఇంజనీరింగు రెండో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయనకు చదువు మీద ఆసక్తి తగ్గింది. వరంగల్ వెళ్లి బీ.ఎస్సీ.లో చేరారు. ఆ తర్వాత తిరిగి ఉస్మానియా నుంచి ఎల్.ఎల్.ఎం పూర్తి చేశారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన స్థానిక పూజారి గూటయ్య స్ఫూర్తితో రాఘవాచారి 15ఏళ్లలోనే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టు యోధుడు మోటూరి హనుమంతరావు గారి రచనలు రాఘవాచారిని వామపక్ష ఉద్యమంలో కార్యకర్తగా రాటుదేలడానికి తోడ్పడ్డాయి. ఉస్మానియాలో చదువుతున్న సమయంలోనే వామపక్ష విద్యార్ధి సంఘంలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, తొలుత ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విద్యార్ధి రాజకీయాల్లో వీరి ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గారు  ఉండేవారు. రాజకీయంగా వీరి మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం పరస్పర గౌరవ భావంతో మెలిగేవారు. వీరి బంధం చివరి వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది.

1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన సమయంలో సిపిఐ పక్షాన నిలిచారు. 1965లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో సభ్యుడయ్యారు.1965లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు. డిల్లీలో1969–71లో వామపక్ష అనుకూల "లింక్", "పేట్రియట్‌", "న్యూఏజ్" ఇంగ్లిష్‌ దిన పత్రికలకు కరెస్పాండెంటుగా పనిచేశారు.1971లో ఆయన విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్దీ కాలానికే వేముల పల్లి శ్రీకృష్ణ గారి స్థానంలో ఆ పత్రికకు సంపాదకులయ్యారు. 1972 నుంచి 2005 వరకు విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేశారు. సిరా కలం పేరుతో ఆయన రాసిన  సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా ఉండేవి. స్పష్టత, సంక్షిప్తత ఆయన శైలి. ‘తెలుగు పత్రికల పరిణామం-ప్రయోగాలు-ప్రయోజనం’ అన్న వ్యాసంలో తెలుగు పత్రికా రంగంలో వాడే భాష ప్రామాణీకరణ జరగలేదని విచారం వ్యక్తం చేశారు.

జనధర్మ జమీన్ రైతు, గౌతమి పత్రికలలో వచ్చిన వార్తలను సంపాదకీయాలను విశాలాంధ్రలో ప్రచురిస్తూ, సామాజిక ప్రగతిలో చిన్న పత్రికల పాత్రను విశాలాంధ్ర పాఠకులకు పరిచయం చేశారు. ఈటీవి వారి ప్రతిధ్వని చర్చా కార్యక్రమాల ప్రారంభ కాలంలో రాఘవాచారి గారు అనేక సందర్భాలలో పాల్గొన్నారు. ఆకాశ వాణిలో యాభైసంవత్సరాల పాటు అనేక రేడియో ప్రసంగాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలపైన రాఘవాచారి గారు రాసిన సమీక్షలు రేడియోలో చాలాకాలం ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. రాఘవాచారి గారి  పాత్రికేయ నిష్ఠకు ఏ ధృవపత్రమూ అక్కరలేదు.

సామాజిక ప్రగతికి జనమాధ్యమాలు చైతన్య ప్రేరణ అని ఆయన విశ్వసిస్తున్నారు. ఇప్పుడే కాదు మొదటినుంచి మాధ్యమాలు సమాజపరిణామాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సమాచారాన్ని ప్రసారం చేయడమే కాకుండా అవగాహన పెంచడానికి వర్తమాన సమస్యలపైన సరైన అభిప్రాయాన్ని నిర్మించడానికి, కావలసిన చైతన్యాన్ని సామాజిక స్పృహను పెంపొందించడానికి అక్షర కృషి చేస్తున్నవి పత్రికలు దృశ్య శ్రవణ మాధ్యమాలే అని వేరే చెప్పనవసరం లేదు. సమాజపు అంతరాత్మగా ఆలోచనాశక్తిగా మీడియా నిలబడి వెలుగుతున్నది. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం పత్రికలు ప్రయివేటు వ్యాపారుల చేతిలో చిక్కిశల్యమవుతున్నది. యజమానుల రాజకీయ విధేయతలననుసరించి వారి వ్యాపార స్వప్రయోజనాలకు మీడియా ఉపయోగపడడం న్యాయం కాదు. నిర్మాణాత్మకమైన ప్రేరణా శక్తిగా మాధ్యమాలు సామాజిక చైతన్యాన్ని పంచవలసి ఉంది అని రాఘవాచారి గారు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

ఐదు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన రాఘవాచారిని ‘నడిచే విజ్ఞాన ఖని’గా అందరూ భావిస్తారు. కార్ల్ మర్క్స్ నుంచి గాంధీ  వరకు రాజకీయ సిద్ధాంతాలు, షేక్‌స్పియర్ నుంచి కాళిదాసు వరకు సాహిత్య ఉపమానాలు ఇట్లా ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ ఒక విజ్ఞాన ధార మన మనసులో ప్రవహిస్తున్న భావన కలిగేది. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1986లో జమీన్ రైతు జర్నలిస్టు అవార్డు, 1999లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు, 2002లో రామినేని ఫౌండేషన్ నుంచి విశిష్ట పురస్కారం, 2004లో సురవరం ప్రతాపరెడ్డి స్మారక పురస్కారం, 2008లో బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు, 2009లో పాములపర్తి సదాశివరావు అవార్డు ఇలా పలు అవార్డులను అందుకున్నారు.

రాఘవాచారి గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నేత కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్న గారిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. కుటుంబ భారాన్ని మొత్తం లాయర్ గా పనిచేస్తూ జ్యోత్స్న గారే నడిపించారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారి చిన్న కుమార్తె స్కూలుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్థం తన పేరుతో" అభ్యాస విద్యాలయ" అనే వినూత్న పద్దతుల్లో విద్యాబోధన చేసే సంస్థను నెలకొల్పి మూడు దశాబ్దాలకు పైగా నిర్వహిస్తున్నారు. పెద్ద కుమార్తె అనుపమ డాక్టర్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతూ 2019, అక్టోబర్ 28న తన 81వ ఏట మరణించారు.


- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com