తిరుమలలో NRI భక్తులకు ప్రత్యేక దర్శనం

- November 06, 2024 , by Maagulf
తిరుమలలో NRI భక్తులకు ప్రత్యేక దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. తిరుమల కొండలు, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత కలగలిపిన ప్రదేశం కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా, సామాజిక సేవలకు కూడా ప్రసిద్ధి చెందింది. 

అందుకే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, శ్రావణ మాసం, బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఎంతో గొప్ప మహిమ కలిగిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే విదేశాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది అదెలాగో తెలుసుకుందాం.

తిరుమలలో ఎన్నారై (NRI) భక్తులకు ప్రత్యేక దర్శనం సదుపాయం ఉంది. కోవిడ్ కారణంగా గతంలో నిలిపివేసిన ఎన్నారై దర్శనాలను తిరిగి ప్రారంభించారు. ఈ దర్శనం కోసం ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తిరుమలలోకి వచ్చిన తర్వాత డైరెక్టుగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 

ముందుగా ఎన్నారై భక్తులు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 హాల్ వద్ద ప్రత్యేక దర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించాక ఈ టిక్కెట్లను పొందడానికి భక్తులు తమ పాస్‌పోర్ట్, వీసా మరియు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వ్యవధిలో ఈ టికెట్స్ పొందవచ్చు. అయితే ఇది విదేశాల నుండి ఇండియాకు వచ్చిన 30 రోజుల్లోనే ఈ అవకాశం ఉంటుంది. కేవలం వాలిడ్ వీసా పాస్ పోర్ట్ ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇస్తారు. పాస్ పోర్ట్ ఉన్న వ్యక్తితో పాటు 12 సంవత్సరాల లోపు చిన్నారులకు కూడా ఈ టికెట్స్ ను జారీ చేస్తారు.

ఇది ఎన్నారై భక్తులకు తిరుమల శ్రీవారిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి, భక్తులు తిరుమలలోకి వచ్చిన తర్వాత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ ఎన్నారై (NRI) భక్తులు ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే అందరిలాగే ముందుగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ వెబ్‌సైట్‌లో దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 
వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక, “Special Entry Darshan” లేదా “NRI Darshan” అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఈ విభాగంలో, మీరు మీ పాస్‌పోర్ట్ మరియు వీసా వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత, మీరు అందుబాటులో ఉన్న తేదీలు మరియు సమయాలను ఎంచుకోవచ్చు.

తరువాత, మీరు మీ కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు. ప్రతి భక్తుడికి ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ మరియు వీసా వివరాలు అవసరం అవుతాయి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత, మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్ల ధరను ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. బుక్ చేసిన టిక్కెట్లను ప్రింట్ తీసుకోవడం లేదా మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం మంచిది. దర్శనం టికెట్లు PDF రూపంలో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తిరుమలలోకి వచ్చినప్పుడు, ఈ టిక్కెట్లను మరియు మీ పాస్‌పోర్ట్, వీసా వంటి గుర్తింపు కార్డులను చూపించాలి.


ఈ విధంగా ఎన్నారై భక్తులు సులభంగా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకుని లేదా స్వయంగా
తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ సేవలు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ప్రక్రియ భక్తులకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది. మరింత సమాచారం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com