మార్క్సిస్టు ప్రజానాయకుడు

- November 06, 2024 , by Maagulf
మార్క్సిస్టు ప్రజానాయకుడు

తెలుగు నాట రైతాంగ విముక్తి పోరాటంలో ముందుండి నడిపించిన వ్యక్తుల్లో గుర్తొచ్చే పేరు కామ్రేడ్ కొల్లా వెంకయ్య. కొల్లా వెంకయ్య ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గుంటూరు జిల్లా, పెదనందిపాడు గ్రామంలో కృష్ణయ్య, రత్తమ్మ దంపతులకు జన్మించారు.బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం జరిపి పరాయి పాలకులకు చెమటలు పుట్టించిన గ్రామంగా పెదనందిపాడుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 

1921లో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రభావం కొల్లా వెంకయ్య పైన పడింది. 1928లో మహాత్మాగాంధీ పెదనందిపాడు వచ్చినప్పుడు పెదనాన్న కొడుకు గోవిందు, ఆ గ్రామ కాంగ్రెస్‌వాది లావు అంకమ్మ చౌదరిలతో కలిసి ఆ సభా నిర్వహణలో భాగమయ్యారు. 

ఆ పన్నుల నిరాకరణోద్యమంలో శాంతి సేన  ఏర్పడింది. శాంతి సేన సభ్యులు తలకు గాంధీ టోపీ, భుజాన సంచి ,కాంగ్రెస్ జెండా ధరించి గ్రామ గ్రామాన  తిరిగి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. మహాత్మాగాంధీ ప్రబోధించిన " అంటరాని తనానికి ,మద్యపానానికి వ్యతిరేకంగా హిందూ- ముస్లిం ఐక్యత కొరకు పెద్ద ఎత్తున ఆ ప్రాంత శాంతి సేన నాయకులు ప్రచారం గావించారు. 

పెదనందిపాడు గ్రామం చివర ఉన్న సారా దుకాణాన్ని మూయించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా రైతాంగం ముందుకు కదిలారు.అప్పటివరకూ ఊరి చెరువులోకి దిగి నీళ్ళు ముంచుకోవటం ఆ గ్రామంలో లేదు. రైతులు లేదా సూద్ర అగ్రవర్ణాలు బుంగల తోటి నీళ్లు ముంచి మాల, మాదిగలకు పోసేవారు. సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో భాగంగా, ఆ ఉద్యమ ప్రభావం వల్ల , రైతులే దగ్గరుండి మాల ,మాదిగలను చెరువులోకి దించి నీళ్లను తీసుకెళ్ళే ఏర్పాటు చేశారు. కుల విచక్షణ జాతీయోద్యమ ప్రభావంతో కొంత సడలింది.అప్పటి నుండి ఆ గ్రామంలో ఆ మార్పు కొనసాగింది.

కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా 1934 అక్టోబర్‌లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా పెదనందిపాడు, బాపట్ల ఫిర్కా ఏరియాల్లో గ్రామ గ్రామాన ప్రచారం చేశాడు. 1934లో గుంటూరు ఏసీ కళాశాలలో మాకినేని బసవపున్నయ్య, వేములపల్లి శ్రీకృష్ణ తదితరులతో కలిసి గొప్ప విద్యార్థుల సమ్మెను జరిపారు. పులుపుల వెంకట శివయ్య, పోలేపెద్ది నరసింహమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య మొదలగు కమ్యూనిస్టుల పరిచయంతో 1936లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు.  

1938 సంవత్సరంలో కొమ్మారెడ్డి సత్యనారాయణ, వాసుదేవరావు గారల నాయకత్వాన  ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు జరిగిన రైతు పాదయాత్రకు స్వాగతం పలికి, పచ్చల తాడిపర్రు ,బాపట్ల మీదుగా, ఒంగోలు వరకు  కలిసి ప్రయాణించారు. ఆ రైతు యాత్రకు పచ్చలతాడిపర్రు లో పెద్ద సభను ఏర్పాటు చేశారు. అప్పాపురం ప్రాజెక్టు సమస్యలపై,  రొంపేరు ముంపు నివారణకు, కృషి చేశారు. 

1949 చివర తెలంగాణ పోరాటానికి అండగా గుంటూరు జిల్లాలో 200 మందితో దళాలు ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి మైదాన ప్రాంత కమిటీలో కొల్లా వెంకయ్య కన్వీనర్‌గా మాదాల నారాయణస్వామి, పెడవలి శ్రీరాములు సభ్యులు. 1948 నుండి 1952 వరకు రహస్య జీవితం గడిపారు. పోలీసులు వీరి ఆచూకీ తెలుసుకొని ఆ ప్రాంత ప్రముఖనాయకుడు దండా నారాయణ స్వామిని, చివుకుల శేషశాస్త్రిని కాల్చి చంపారు. అనేక మంది రైతుకూలీ బిడ్డలను, తుమ్మలపాలెం, రేపల్లె, కృష్ణ జిల్లా లంక గ్రామాల్లోనూ  నిర్బంధించి కాల్చి చంపారు. 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లా వెంకయ్య పొన్నూరు నియోజకవర్గం నుండి గెలుపొందారు.

1956లో తెలంగాణతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా వెంకయ్య స్థానిక సంస్థల నుండి ఎన్నికైనారు. 1962లో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి. రంగాను ఓడించి, పార్లమెంట్‌లో నెహ్రూ ప్రశంసలను కూడా వెంకయ్య పొందారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు వెంకయ్య మార్క్సిస్టు పార్టీ వైపు వెళ్లారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1967 చివరలో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కొరకు ఉద్యమించారు.  భూసంస్కరణల చట్టాల రూపకల్పన కొరకు, ఆ తదనంతరం వాటి అమలు కొరకు  సుదీర్ఘకాలం చట్ట సభలలోనూ, బయటా కృషి చేశారు.1968లో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి మార్క్సిస్టు పార్టీ నుండి బయటకు వచ్చారు.

1975లో అత్యవసర పరిస్థితిలో అరెస్టయి, 1977లో విడుదలయ్యారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని బలపరిచినందుకు పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి విశాఖ సెషన్స్ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత హైకోర్టు దానిని రద్దు చేసింది. పార్వతీపురం కుట్ర కేసు విచారణ సందర్భంలో విశాఖ సెషన్స్ ప్రత్యేక కోర్టులో ‘మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం మా మౌలిక సిద్ధాంతమని’ ఆయన ప్రకటించారు. ఆ మౌలిక సిద్ధాంతపత్రంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, బీటీ రణదీవే సిద్ధాంతపరంగా ఎలా తప్పు చేస్తున్నారో చెప్పారు.  

1977లో జైలు నుంచి విడుదలైన తరువాత, నల్లమడ ముంపు నివారణ కోసం గొప్ప ఉద్యమం నిర్మించారు. 1973 భూగరిష్ఠ పరిమితి చట్టం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1980లో గ్రామీణ పేదల సంఘాన్ని స్థాపించి భూ సంస్కరణల కోసం పోరాడారు. 1986లో భూ సంస్కరణల చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 1991లో తీర్పు రాగా, దాని అమలు కోసం జీవిత పర్యంతం పోరాడారు.ఆయన అనేక సిద్ధాంత రచనలు చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉన్నది. వెంకయ్య నిరంతర అధ్యయనశీలి. కుల సమస్య పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుల సమస్య వర్గ సమస్యతో ముడిపడి ఉన్నదనేది ఆయన నిశ్చితాభిప్రాయం.

చారు మజుందార్ వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా ఇటువంటి వ్యక్తిగత హింసావాదం కార్యక్రమం వచ్చిందని, అది ఆనాడు సిద్ధాంతపరంగా తప్పు అని తమకు తెలియలేదని, 1970లో సిపిఐ (ఎంఎల్) పార్టీ ప్రతినిధి వర్గానికి చైనా సలహాలు వచ్చిన తరువాతనే తాము ఆ తప్పును గ్రహించామని ఆయన చెప్పారు. అదేవిధంగా, ఆయన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో భారత సాంఘిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని గురించి, భారత సమాజంలోని కుల వ్యవస్థ సంక్లిష్టతను గురించి, క్రింది కులాల పట్ల అగ్రవర్ణ శక్తుల కాఠిన్యత గురించి తన మౌలిక సిద్ధాంత గ్రంథంలో సమాజ పరిణామాన్ని గొప్పగా వివరించారు.  

భారతదేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం అని ఆయన అభిప్రాయం. నేడు భారతదేశం నయా వలస పరిణామ క్రమంలో ఉన్నదనేది అభిప్రాయం నేడు బలమైన చర్చగా ఉన్నది. సామ్రాజ్యవాదం విషయంలో సిపిఐ (ఎంఎల్) పార్టీలు చెప్పినట్లు ఒకనాటి రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదం నేడు లేదు. జన చైనా కూడా నేడు సామ్రాజ్యవాద దేశంగా మారిందనేది విప్లవ కమ్యూనిస్టుల అభిప్రాయం. మార్క్సిజం ప్రాపంచిక దృక్పధంగా అంగీకరించే సిపిఐ, సిపిఐ (ఎం)లతో సిద్ధాంత చర్చ జరుపుతూ, ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేయవచ్చు అనేది కొల్లా వెంకయ్య అభిప్రాయం.

మార్క్సిజం –లెనినిజం–మావో ఆలోచనా విధానం అంగీకరించే విప్లవ సంస్థలు పార్టీలతో సూత్రబద్ధమైన ఐక్యత జరపటం కోసం, కమ్యూనిస్టులను ఐక్యతను చేయడం కోసం దేశం మొత్తం అన్ని కమ్యూనిస్టు విప్ల సంస్థల తోటి ఆయన చర్చలు జరిపారు. విప్లవ కమ్యూనిస్టుల ఐక్యతకొరకు, భూ సంస్కరణల అమలు కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి కొల్లా వెంకయ్య. 

ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో,జాతీయోద్యమంలోను, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, మార్క్సిస్టు-లెనినిస్టు ఉద్యమంలోను ఆయన గడించిన విశేష అనుభవం తో కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కొరకు ఆయన కడదాకా కృషిచేశారు.రాజకీయ ప్రస్థానంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నా అచంచలమైన దీక్ష పట్టుదలలతో జీవించిన అలుపెరగని ప్రజా సేవకుడిగా వెంకయ్య  నేటి తరానికి ఆదర్శం. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com