రైతు బాంధవుడు - ఆచార్య ఎన్జీ రంగా
- November 07, 2024
ఆచార్య ఎన్జీ రంగా... ఈ పేరు చెబితే చాలు భారత రైతాంగం మది పులకరిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, రైతు నాయకుడిగా ఆయన దేశ ప్రజానీకానికి విశేషమైన సేవలందించారు. రైతుల సాధకబాధకాలపై బలమైన గొంతుక వినిపించారు. భారత రైతు ఉద్యమ పితామహుడిగా, రైతు బాంధవుడిగా పేరొందారు. గాంధీ పిలుపుతో ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగారు. ఏళ్ల తరబడి జైలు(jail) జీవితాన్ని గడిపారు. జమీందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. అనేక రచనలతో తనదైన ముద్ర వేశారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజల పక్షాన నిలబడి... భావితరాలకు ఆదర్శ బాట పరిచారు. నేడు రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా గారి 124వ జయంతి.
ఆచార్య రంగా గారి పూర్తి పేరు గోగినేని రంగ నాయకులు. 1900,నవంబర్ 7వ తేదీన ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలోని గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లి మరణంతో పెద్దమ్మ సంరక్షణలో పెరిగారు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్య పూర్తిచేసిన ఆయన... గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుంచి ఇంటర్ పూర్తి చేశారు. గురువు జంపని ఆంజనేయులు గారి ప్రోద్బలంతో ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి రామకృష్ణ మార్గదర్శనంలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలను ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. 1926లో ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీ-లిట్(B-lit) డిగ్రీని పొందారు. ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో ఆయనకు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.ఎస్.కృష్ణ మరియు కాట్రగడ్డ బాలకృష్ణ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కందుకూరి వీరేశలింగం జీవితం, దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాగించిన పోరాటం.. రంగాను దేశ సేవకు పురిగొల్పింది.
స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. గ్రామీణ రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన రంగా గారు, నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ అసంఘటిత రంగాలకు చెందిన చేనేత, కల్లు గీత కార్మికులు జీవన స్థితిగతులను తెలుసుకుంటూ వారి మీద నివేదికలను తయారు చేసి నాటి మద్రాస్ ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అనుభవాలను తన పాఠాలలో విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు. నాటి సమకాలీన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకున్న అనుభవాన్ని మద్రాస్ ప్రభుత్వం సైతం విశేషంగా ఉపయోగించుకుంది.
మద్రాస్ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా రంగా, రాష్ట్రమంతటా పర్యటనలు జరిపారు. కరువు, కాటకాల వల్ల రైతులు మరియు అనుబంధ రంగాల కార్మికుల కనీస అవసరాలను తీర్చుకోలేని దీన స్థితిలో ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రైతాంగాన్ని శిస్తుల పేరుతో జమిందారీ వ్యవస్థ చేస్తున్న దోపిడీని నిరసిస్తూ రైతు కూలీ ఉద్యమ రూపకల్పనకు పూనుకునేలా చేసింది. ఇదే సమయంలో రైతు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు తన అధ్యాపక పదవికి రాజీనామా చేశారు. 1930లో గాంధీ పిలుపుతో... భారత స్వాతంత్య్ర ఉద్యమం వైపు అడుగేసిన రంగా... ఖద్దరు కట్టి గాంధీ టోపీ పెట్టారు. ఇదే సమయంలో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1931లో జరిగిన వెంకటగిరి జమీందారీ రైతు ఉద్యమంలో పాల్గొన్న జైలుకు వెళ్లారు. ఈ ఉద్యమంలోనే నెల్లూరు వెంకట్రామా నాయుడు, నాగినేని వెంకయ్య, కటికనేని సోదరులు ఆయనకు సన్నిహితులయ్యారు. రైతు ఉద్యమాలను స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేశారు. ఇదే సమయంలో గుంటూరు నుంచి 1930, 1934-46 వరకు కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. కేంద్ర శాసనసభ సభ్యుడిగా జమిందారీ వ్యవస్థ రద్దు కోసం జాతీయ స్థాయిలో కృషి చేయడం ప్రారంభించారు. ఉత్తరాదికి చెందిన స్వామి సహజానంద, ఇందూలాల్ యాగ్నిక్ వంటి రైతు నాయకులతో కలిసి జాతీయ కిసాన్ సమ్మేళనాలు ఏర్పాటు చేసి లక్నో, మద్రాస్ మరియు పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.
1933లో తన స్వస్థలమైన నిడుబ్రోలులో రామనీడు రైతాంగ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. 1933 నుంచి 1951 వరకు ప్రతి యేడు వేసవి కాలంలో రాజకీయ శిక్షణా తరగతులను రంగా నిర్వహించారు. ఈ రాజకీయ పాఠశాలలో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, మోటూరి హనుమంతరావు వంటి దిగ్గజ కమ్యూనిస్టు నేతలు సైతం పాల్గొన్నారు. అక్కడ వ్యవసాయం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, పశు వైద్యం వంటి పలు కీలకమైన అంశాల మీద బోధనలు చేసేవారు. సమకాలీన అంశాల మీద మాక్ పార్లమెంట్ ను నిర్వహించేవారు. ఇక్కడ వివిధ రంగాలకు చెందిన పలువురు జాతీయ, అంతర్జాతీయ మేధావులు పాఠాలను భోదించారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో యువకులు తర్వాత కాలంలో రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు.
కాంగ్రెస్ నానాటికి పెరిగిపోతున్న నిరంకుశత్వ ధోరణికి వ్యతిరేకంగా దక్షిణాదిన ఉద్యమించిన మొదటి వ్యక్తి రంగా. రైతు సమస్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించడం నచ్చని ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే అసమ్మతివాదిగా కొనసాగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్ర బోస్ పక్షాన నిలిచి ఆయన గెలుపునకు రంగా కృషి చేశారు. కొద్దీ కాలం పాటు కేంద్ర శాసనసభకు కార్యదర్శిగా పనిచేశారు. 1946-51 వరకు ఉమ్మడి మద్రాస్ పీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. గాంధీజీ బ్రాహ్మణ పక్షపాత వైఖరికి నిరసనగా ఉద్యమించిన మొదటి దక్షిణ భారత నాయకుడు రంగా గారు.
బ్రాహ్మణ నేతలైన కళా వెంకట్రావు, భోగరాజు పట్టాభి సీతారామయ్యలు తమ పలుకుబడితో రంగా గారిని కాంగ్రెస్ పార్టీలో ఎదగనీయకుండా చేయడంలో సఫలీకృతం అయ్యారు. వీరిద్దరు కలిసి 1946లో జరిగిన కేంద్ర పార్లమెంట్ ఎన్నికల్లో రంగా గారి పరాజయం కోసం పనిచేసినా, గుంటూరు ప్రజల సంపూర్ణ మద్దతుతో విజయ భేరిని మోగించి, భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో రంగా గారు చేసిన పలు సూచనలు, సలహాలను రాజ్యాంగ కమిటీ ఆమోదించింది. ఈ సమయంలోనే డాక్టర్ అంబేద్కర్ తో రంగా గారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీలో గాంధీ మరణం తర్వాత వచ్చిన మార్పులు, సీనియర్లైన జయప్రకాశ్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం పంతులు, రంగా వంటి ముఖ్యనేతల పట్ల పార్టీ అవలంభించిన నిర్లక్ష్య ధోరణికి నిరసనగా వీరూ కాంగ్రెస్ కు దూరం అయ్యారు. రంగా తొలుత ప్రజా పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగినప్పటికీ వారితో ఏర్పడ్డ సైద్ధాంతిక వైరుధ్యాల కారణంగా 1951లో రైతుల సంక్షేమమే ప్రధానంగా కృషికార్ లోక్ పార్టీని స్థాపించారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమిలో రంగా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ వారికి దక్కకుండా చేయడంలో రంగా రాజకీయ చాణక్యత ప్రదర్శించారు. ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి కావడంలో రంగా గారి పాత్ర మరువలేనిది.
1955 ఎన్నికల్లో సైతం కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి రాకుండా కట్టడి చేయడంలో సఫలీకృతం అయ్యారు. తమను అధికారానికి దూరం చేసిన రంగా అంటే కమ్యూనిస్టు నేతలకు ద్వేషం ఉండేది. రంగా గారి మీద రాజకీయ దూషణల నుంచి వ్యక్తిగత దూషణలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. 1952 తోలి లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసిన రంగాను ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కుమ్మకై ఆయన్ని ఓడించారు. 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై రైతుల పట్ల నెహ్రూ సర్కార్ వ్యవహరిస్తున్న వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ చట్ట సభల ద్వారా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రంగా గారి విమర్శల దాటికి ప్రధాని నెహ్రూ సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు.
రష్యాలో ఉన్న సహకార వ్యవసాయ పద్దతిని భారత దేశంలో సైతం అమలు చేయాలని నెహ్రూ తలంపుతో ఉండేవారు.అయితే, సహకార వ్యవసాయ విధానం వల్ల దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని రంగా వాదిస్తూ వచ్చారు. పార్లమెంట్ లో సహకార వ్యవసాయ బిల్లును పెట్టిన సమయంలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల ఎంపీల సహకారంతో బిల్లు పాస్ కాకుండా రంగా అడ్డుకున్నారు. 1957 లోక్ సభ ఎన్నికల్లో తెనాలి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజగోపాలాచారి మరియు పలువురు మేధావులు కలిసి స్థాపించిన స్వతంత్ర పార్టీకి రంగా జవసత్వాలు సమకూర్చడమే కాకుండా, ఆ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు దీటుగా స్వతంత్ర పార్టీని బలీయమైన రాజకీయ శక్తిగా నిలబెట్టారు.
1970 ప్రారంభం నాటికి స్వతంత్ర పార్టీ బలహీన పడటం, ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిరా, రాజీవ్ గాంధీల ప్రభుత్వంలో వ్యవసాయ సంస్కరణలకు పెద్ద పీట వేసేలా వారిని ఒప్పించారు. నాబార్డ్, ఆర్ఆర్ బి వంటి బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటులో పాలుపంచుకున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి పదవిని చేపట్టాలని స్వయంగా ఇందిరా, రాజీవ్ గాంధీలు కోరినప్పటికి నిరభ్యతరంగా తిరస్కరించారు. 1957,1964,1967,1980,1984,1989లలో లోక్ సభ ఎంపీగా, 1952-56,1977-80 వరకు రాజ్యసభ ఎంపీగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 60 సంవత్సరాల పాటు పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక భారత పార్లమెంటేరియన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఆనాటి తెలుగు రాజకీయ నాయకుల్లో రంగా గారు అగ్రగణ్యులు. రైతుల సమస్యలపై పార్లమెంట్లో తన గళాన్ని వినిపించడంలో ముందుండేవారు. ఆయన్ని మార్గదర్శకంగా తీసుకున్న చౌధరి చరణ్ సింగ్, చౌధరి దేవీ లాల్ వంటి ఉత్తరాది రాజకీయ దిగ్గజ నాయకుల సైతం రైతుల సంక్షేమం కోసం తమ జీవితాంతం కృషి చేస్తూ వచ్చారు. రైతాంగం కోసం వాహిని, స్వతంత్ర పత్రికలను నడిపారు. అలాగే, ఆయన అనుచరులు నడిపిన జమీన్ రైతు వంటి పలు పత్రికలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు.
రంగా గొప్ప రచయిత కూడా, రాజకీయ, ఆర్థిక, సమకాలీన సామాజిక అంశాలపై ఆయన విరివిగా పుస్తకాలు రాశారు. రైతులకు రాజ్యాంగ నిర్మాణ, నిర్వహణ చరిత్ర కలదని 'కాకతీయ నాయకులు' పుస్తకం ద్వారా నిరూపించారు. 'ఆధునిక రాజ్యాంగ సంస్థలు' పుస్తకం ద్వారా ప్రపంచ దేశాల రాజకీయ చరిత్ర గురించి విఫులంగా వివరించారు. రైతు గ్రంథమాల పేరుతో హరిజన నాయకుడు, రైతు భజనావళి, ప్రపంచ ధనికవాదం, సామ్రాజయవాదులకు ప్రపంచ రైతాంగము సవాలు -1942, విప్లవ రైతాంగం వంటి రచనలు చేశారు. ఇవే కాకుండా ఇంగ్లీషులో భారత దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జమీందారీ రైతుల ఆర్థిక స్థితిగతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మార్గదర్శిని, దక్షిణ భారత రైతు కూలీలు వంటి 65కు పైగా పుస్తకాలను రాశారు. ఆయన ప్రతిపాదించిన ఆర్థిక విధానాల మీద ఈనాటికి పలు యూనివర్సిటీల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
రంగా గారు రాజకీయాల్లో ఉన్నత పదవులను అధిరోహించనప్పటికీ, వారితో సమానంగా ప్రజల ప్రేమాభిమానాలను అందుకున్నారు. ఆయనకు అనుచర వర్గం కూడా తక్కువేవి కాదు, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అసంఖ్యాకమైన అనుచరులు ఉండేవారు. గౌతు లచ్చన్న, వి.వి రమణ, భీశెట్టి అప్పారావు, నీరుకొండ రామారావు, సుంకర సత్యనారాయణ, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, కందుల ఓబుల్ రెడ్డి, చేగిరెడ్డి బాలిరెడ్డి, పాటూరి రాజగోపాల్ నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, రాటకొండ నరసింహ రెడ్డి, బండారు రత్నసభాపతి, ఎన్వీ నాయుడు, నాగినేని వెంకయ్య, నెల్లూరు వెంకట్రామా నాయుడు వంటి ఉద్దండులు ఆయన వెన్నంటి ఉండేవారు. వీళ్ళలో అత్యధికులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
రైతు కూలీ ఉద్యమం ద్వారా ఆయనకు పాటూరి రాజగోపాల నాయుడు, గౌతు లచ్చనలు దగ్గరయ్యారు. రంగా రాజకీయ జీవితంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం.రంగా అరెస్ట్ అయిన సమయంలో రైతు ఉద్యమాలను వీరు దగ్గరుండి నడిపించారు. ముఖ్యంగా రాజన్నగా ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లాకు చెందిన పాటూరి రాజగోపాల నాయుడు గారైతే రంగా గారి చివరి శ్వాస వరకు అటు రాజకీయంగా, వ్యక్తిగతంగా అండగా నిలిచారు. ఎంతలా అంటే రాజన్న కుటంబమే రంగా గారి అసలైన కుటుంబం అనేలా వారిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడింది. ఇంక లచ్చన్న గారి విషయానికి వస్తే, రంగా గారి అడుగుజాడల్లో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. రాజకీయంగా ఒకానొక దశలో వీరి దార్లు వేరుపడినా పరస్పరం గౌరవభావంతో కూడిన ప్రేమాభిమానాలు వీరిద్దరి మధ్య కొనసాగింది.
రంగా గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, నిడుబ్రోలుకు దగ్గర్లో ఉన్న మాచవరం గ్రామానికి చెందిన వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతుల కుమార్తె భారతీదేవి గారిని వివాహం చేసుకున్నారు. తనతో పాటుగా ఆమెను ఇంగ్లాండ్ తీసుకెళ్లి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రస్కిన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్సులో చదివించారు. రైతు సేవలో తరించేందుకు తన భార్య అనుమతితో సంతానాన్ని వద్దనుకున్నారు. రంగా గారితో పాటుగా భారతీదేవి గారు సైతం స్వాతంత్య్ర మరియు రైతు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆమె సొంతంగా వ్యవసాయం చేస్తూ పంటలు సైతం పండించారు. ఆకలితో అలమటించే ఆర్తులు మరియు దీన జనుల పాలిట అన్నపూర్ణ దేవిగా కొనియాడబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా భారతీదేవి గారు పనిచేశారు.
జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రంగా గారు చివరి శ్వాసవరకు ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నీతివంతమైన.. నిరాడంబర జీవితాన్ని గడిపారు. రైతాంగానికి వీరు చేసిన విశిష్టసేవలకు తార్కాణంగా 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" పురస్కారంతో సత్కరించింది. 1991లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
1995, జూన్ 8వ తేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన 'గోభూమి'లో తన 95వ యేట కన్నుమూశారు. ఆయన గుర్తుగా 1997, జూలై 27న పార్లమెంట్లో రంగా గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని'ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా నామకరణ చేసారు.2001లో ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తపాలాశాఖ ప్రత్యేక స్మారక బిళ్లను విడుదల చేసింది. రాజకీయ ప్రస్థానంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నా అచంచలమైన దీక్ష, పట్టుదలతో రైతుల సంక్షేమమే పరమావధిగా తన చివరి శ్వాస వరకు పాటుపడ్డ మహనీయుడు ఆచార్య ఎన్జీ రంగా.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







