కార్మిక దిగ్గజం - దత్తోపంత్ ఠేంగ్డీ

- November 11, 2024 , by Maagulf
కార్మిక దిగ్గజం - దత్తోపంత్ ఠేంగ్డీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక రంగంలో వామపక్ష ప్రాబల్యం కనిపిస్తుంది. భారతదేశంలో మాత్రం ఆ రంగంలో వారి ఆధిపత్యాన్ని బద్దలు చేయడమే కాకుండా, సైద్ధాంతిక భూమికను సహితం పటాపంచలు కావించి, దేశంలోనే అతిపెద్ద జాతీయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన మేధావి దత్తోపంత్ ఠేంగ్డీ. కార్మిక, కర్షక, ఆర్థిక, సామాజిక రంగాల్లో సంఘ్ తాత్విక పునాదులు ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేశారు ఠేంగ్డీ. సంఘానికి అనుబంధంగా స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ వంటి కార్మిక సంఘాలను స్థాపించడమే కాకుండా తన సంఘటనా చాతుర్యంతో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారు. 

దత్తోపంత్ ఠేంగ్డీ పూర్తి పేరు దత్తోపంత్ బాపూరావ్ ఠేంగ్డీ. ఒకప్పటి సెంట్రల్ బేరార్ రాష్ట్రంలోని వార్దా జిల్లా ఆర్వి అనే చిన్న పట్టణంలో బాపూరావ్ దజీబా ఠేంగ్డీ, జానకీ దేవి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను ఆర్విలో పూర్తి చేసి తర్వాత నాగపూర్ పట్టణంలో ఇంటర్మీడియట్, లా డిగ్రీని పూర్తి చేశారు. మోరిస్ కళాశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొంతకాలం నాగపూర్ పట్టణంలో లాయర్ గా పనిచేశారు.

ఠేంగ్డీ బాల్యం నుంచి జాతీయవాద భావాలను కలిగి ఉన్నారు. మరాఠా స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది బాలగంగాధర్ తిలక్ గారి సాహిత్యాన్ని చదివి ప్రేరణ పొందారు. హైస్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే "వానరసేన" పేరుతో తన తోటి విద్యార్థులను కలుపుకొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ వీరుల స్ఫూర్తితో వారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఎస్.ఆర్.ఏ)లో కొంతకాలం పనిచేశారు.

నాగపూర్ పట్టణంలో చదువుకుంటున్న సమయంలోనే ఆరెస్సెస్ కార్యకలాపాల పట్ల ఆకర్షితులై డాక్టర్జీ సమక్షంలో సంఘంలో సభ్యుడయ్యారు. డాక్టర్జీ తర్వాత సంఘ్ చాలక్ బాధ్యతలను చేపట్టిన గురూజీ గోల్వాల్కర్ గారి మార్గదర్శనంలో ప్రచారక్ బాధ్యతలను చేపట్టారు. ప్రచారక్ గా అప్పటి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన కేరళ ప్రాంతంలో రెండేళ్ళ పాటు పనిచేశారు. ఈ సమయంలోనే త్రిసూర్ కేంద్రంగా సంఘ్ కార్యకలాపాలను కేరళలో విస్తరించారు. 1944లో బెంగాల్ ప్రాంతంలో సైతం నాలుగేళ్ళ పాటు పనిచేశారు. దేశ విభజన సమయంలో శరణార్థుల శిబిరాల నిర్వహణ, మత కలహాల్లో ముస్లిం మూకల చేతిలో మృత్యువాత పడ్డ హిందూ, క్రిస్టియన్, సిక్కు కుటుంబాలకు అండగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.    

దేశంలో వామపక్ష భావజాలాన్ని విస్తరించే ప్రక్రియలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘం అఖిల భారత కార్మిక సంఘం ద్వారా  రాజకీయంగా బలపడుతున్న క్రమాన్ని గుర్తించిన కాంగ్రెస్ సైతం భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ.ఎన్.టి.యు.సి)ను స్థాపించి తన రాజకీయ భావజాలాన్ని విస్తరిస్తూ వచ్చింది. ఈ రెండు వర్గాలకు సమాంతరంగా జాతీయవాద భావజాలంతో కూడిన కార్మిక సంఘాన్ని స్థాపించే బాధ్యతను గురూజీ ఠేంగ్డీజీకి అప్పగించారు. భారత కార్మిక ఉద్యమాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన 1949లో   ఐ.ఎన్.టి.యు.సి లో చేరారు. కార్మిక ఉద్యమాల్లో ఉన్న లోటుపాట్లను అర్థం చేసుకోవడంలో ఐ.ఎన్.టి.యు.సి అనుభవం ఆయనకు పనికొచ్చింది.

కార్మిక సంఘాల్లో తలమునకలై ఉన్న సమయంలోనే జనసంఘ్ బాధ్యతల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ జనసంఘ్ నిర్వహణ కార్యదర్శిగా 1952-53 వరకు పనిచేసారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న పలు విభాగాల ఉద్యోగుల సంఘాల్లో పనిచేశారు. 1955లో ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(BMS)ను స్థాపించారు. వామపక్ష మరియు సెక్యులర్ సామ్యవాద భావజాలం పేరుతో కార్మికులను మభ్యపెడుతూ తమ రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కార్మికులను బలి పశువులను చేస్తున్నాయని ఠేంగ్డీ విమర్శించారు.

దేశంలో అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుంటే బిఎంఎస్ ను రాజకీయాలకు అతీతమైన కార్మిక ఉద్యమంగా, పార్టీ రాజకీయాలకు దూరంగా నిర్మించారు. అంతేకాదు పారిశ్రామిక వేత్తల నుండి విరాళాలు స్వీకరించే వరవడిని కూడా తిరస్కరించి, కేవలం కార్మికుల సభ్యత్వ రుసుముతో మాత్రమే పనిచేసేటట్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు. భారతీయ ఆర్ధిక ఆలోచనలు, సంస్కృతుల ప్రాతిపదికన ఉద్యమాన్ని వ్యాపింప చేశారు. కేవలం కార్మిక సంఘాలలో కమ్యూనిస్టుల ఆధిపత్యం తగ్గించి, తమ ఆధిపత్యం పెంచుకొనే ప్రయత్నం చేయకుండా, కార్మిక ఉద్యమ స్వరూపంలోనే పెను మార్పులు తీసుకు రావడానికి వారితో సైద్ధాంతిక పోరుకు దిగారు.

వర్గ ద్వేషం ఆధారిత సంఘర్షణలకు తలపడటం, పరిశ్రమలను బలవంతంగా స్వాధీన పరచుకోవడం వంటి కార్మిక ఉద్యమ ధోరణిలో మార్పు తీసుకు వచ్చారు. పారిశ్రామిక ప్రక్రియలో శ్రమకు స్వదేశీ, జాతీయవాదం ప్రాతిపదికన గౌరవప్రదమైన ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించారు.“పాశ్చాత్య నమూనా అనేది పురోగతి, అభివృద్ధిలకు సార్వత్రిక నమూనా అనే అభిప్రాయానికి మేము దృఢముగా విశ్వసిస్తున్నాము. ఆధునికీకరణ అంటే పాశ్చాత్యీకరణ అని మేము భావించము” అంటూ స్పష్టమైన అవగాహనతో అన్ని జాతీయ జీవన రంగాలలో స్వదేశీ ఆలోచనలు నింపే ప్రయత్నం చేశారు.

పేదరికం, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ‘రాజధాని ఆధారిత ఆర్థిక నిర్మాణం’కి బదులుగా ‘కార్మిక-ఆధారిత ఆర్థిక నిర్మాణం’ని డిమాండ్ చేశారు. “నిజమైన ‘ప్రపంచీకరణ’ హిందూ వారసత్వంలో ఒక భాగం అంటూ పురాతన కాలంలో మనం ఎల్లప్పుడూ మనల్ని మనం మొత్తం మానవాళిలో భాగంగా భావించామని, మన కోసం ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని మనం ఎప్పుడూ పట్టించుకోలేదని దత్తోపంత్ గుర్తు చేశారు.సామ్రాజ్యవాద దోపిడీకి, మారణహోమానికి కూడా చరిత్ర తెలిసిన వారే ‘ప్రపంచీకరణ’ గురించి మనకు ప్రబోధిస్తున్నారని అంటూ ఎద్దేవా చేశారు. సాతానులు బైబిల్‌ను ఉటంకిస్తున్నారని అంటూ గ్లోబలైజేషన్‌గా కవాతు చేస్తున్నది ఆధిపత్యవాదం అంటూ ఎండగట్టారు.

మార్క్సిజం న్యూటోనియన్ సైన్స్, డార్విన్ పరిణామవాదం, హెగెలియన్ మాండలిక వాదంపై మేధో పరాన్నజీవి మార్క్సిజం అంటూ అవహేళన చేశారు. మార్క్సిజాన్ని హిందూమతంతో పోల్చడానికి ప్రయత్నించేవారు ఈ రెండింటి పట్ల తమకున్న అజ్ఞానాన్ని మాత్రమే వ్యక్తం చేస్తుంటారని నిర్విర్ధంగా చెప్పారు.కార్మికులు విజయం సాధిస్తే కమ్యూనిస్టులు విఫలమవుతారని, రైతుల శ్రేయస్సు వారికి ప్రతికూలమని చెబుతూ శ్రామికవర్గం వైఫల్యాలు కమ్యూనిస్ట్ విజయానికి మూలస్తంభాలని అంటూ వారి సైద్ధాంతిక ప్రాతిపదికను ఎండగట్టారు.

ఇస్లాం ఏ విధమైన దేశ ఆరాధనను అనుమతించదని, ముస్లింలు జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అంటుంటారని అంటూ వారిని ఎండగట్టారు. వాస్తవానికి ముస్లిం దేశాలు అని పిలవబడే జాతీయవాదులు ఈ చెడును విజయవంతంగా ఎదుర్కొన్నారని, ఇస్లాం అసలు సిద్ధాంతాలు దేశభక్తి స్ఫూర్తికి చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన సాధికారికంగా నిరూపించారు. హిందూ ఆలోచన విధానం పట్ల స్పష్టమైన అవగాహన వ్యక్తపరిచే వారు. తన అద్భుతమైన ప్రయోజనాలను తిరస్కరించే వారిని మినహాయించి అది మొత్తం మానవజాతిని స్వీకరించగలదని అంటూ పేర్కొన్నారు.

దేశ ప్రయోజనాలు మొదట వస్తాయని, ఆ పైననే పరిశ్రమలు, కార్మికుల ప్రయోజనాలు.. ఆ క్రమంలో వస్తాయని అంటూ కార్మిక ఉద్యమానికి సరికొత్త వరవడి సృష్టించారు. అన్ని పరిశ్రమలను జాతీయకరణ చేయాలనే కమ్యూనిస్టుల నినాదాన్ని తిప్పికొడుతూ ‘దేశాన్ని పారిశ్రామికీకరించండి, కార్మికులను జాతీయం చేయండి, పరిశ్రమను కార్మికీకరించండి’ అంటూ బిఎంఎస్ ప్రతిపాదించింది. `పరిశ్రమల ‘కార్మికీకరణ’ గురించి బిఎంఎస్ సూచిస్తూ కార్మికులు సమిష్టిగా పారిశ్రామిక యూనిట్లను సొంతం చేసుకునే, నిర్వహించే ఆలోచనను ప్రోత్సహించింది.

జనసంఘ్ తరుపున 1964-76 వరకు వరుసగా రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. జనసంఘ్ పార్లమెంటరీ పక్ష ఉపనేతగా సైతం పనిచేశారు. ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించిన సమయంలో అన్ని విపక్ష కార్మిక సంఘాలతో కలిసి కార్మిక ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తన తోటి కార్మిక నేత, సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ మీద ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిన సమయంలో ఆయనకు అండగా నిలిచారు.

1979లో భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా రైతు ఉద్యమ సంఘాన్ని నిర్మించారు. ఇవే కాకుండా స్వదేశీ జాగరణ్ మంచ్,  సామాజిక్ సమరసతా మంచ్, సర్వ- పంథ్ సమదార్ మంచ్, పర్యావరణ్ మంచ్ లాంటి సంస్థలను స్థాపించి వాటి అభివృద్ధికి పాటుపడ్డారు. ఇవే కాకుండా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ అధివక్త పరిషత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్, భారతీయ విచార కేంద్ర్ లాంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

దత్తోపంత్ ఠేంగ్డీ మాతృబాష మరాఠీతో పాటు సంస్కృతం, మలయాళం, బెంగాలీ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషాల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తన రచనల ద్వారా కార్మిక ఉద్యమాన్ని ప్రభావితం చేశారు. ఎంత క్లిష్టమైన అంశాన్ని అయినా సామాన్యులకు సైతం చక్కగా, సులభంగా అరమయ్యే సరళమైన భాషలో చెప్పడం ఠేంగ్డేజీ రచనా శైలిలోని ప్రత్యేకత. ఆయన రాసిన ఇంగ్లీష్‌ పుస్తకాల్లో ‘వై భారతీయ మజ్దూర్‌ సంఘ్‌?’, ‘హిస్‌ లెగసీ ఔర్‌ మిషన్‌’, ‘నేషనలైజేషన్‌ ఆర్‌ గవర్నమెంట లైజేషన్‌’, ‘కంపూటరైజేషన్‌, మోడరనైజేషన్‌ వితౌట్‌ వెస్టర్నైజేషన్‌’ వంటి విలువైన పుస్తకాలతో పాటుగా “కార్యకర్త”, “మూడో మార్గం”, “విప్లవంపై”, “హిందూ ఆర్థికశాస్త్రంలో ముందుమాటలు” “విచార్ సూత్రే’, ‘సంకేత్రేఖ’, `ఏకాత్మ మానవ్’, `ప్రగతిపత్ పర్ కిసాన్’, `సప్తక్రమ్’, `లక్ష్య ఔర్ కార్యా’ వంటి పలు సైద్ధాంతిక గ్రంధాలను రచించారు.

ఠేంగ్డీజీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.ప్రతి ఒక్కరూ సంస్థ, సిద్ధాంతాలు, లక్ష్యాలకు నిబద్దులై పనిచేయాలే గాని వ్యక్తులకు విధేయంగా పనిచేయరాదని చెప్పేవారు. అందుకే ఆయన ఎప్పుడూ, పాదాభివందనాన్ని అనుమతించ లేదు. భారతమాత సేవలో నియమబద్ద జీవితాన్ని సాగిస్తూ, తుది శ్వాస వరకూ దేశ సంక్షేమం, కార్మికుల యోగ క్షేమాలు, జాతీయవాద పురోగతి కోసం అహర్నిశలు  శ్రమించిన ఠేంగ్డేజీ తన 84వ ఏట 2004,అక్టోబర్‌ 14వ తేదీన  బ్రెయిన్ హెమరేజ్ కారణంగా పుణెలో తుదిశ్వాస విడిచారు.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com