ఉత్తరప్రదేశ్: ఆసుపత్రిలో ఘోర ప్రమాదం..

- November 16, 2024 , by Maagulf
ఉత్తరప్రదేశ్: ఆసుపత్రిలో ఘోర ప్రమాదం..

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలు ఆర్పుతోంది.

ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో(ఎన్ఐసీయూ) ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు చనిపోగా, 16 మంది గాయపడ్డారు. 32 మంది చిన్నారులను కాపాడారు. అగ్ని ప్రమాదానికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇంకుబేటర్స్ లో ఉన్న పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంతా శిశువులుగా గుర్తించారు.

రాత్రి 10.30 నుంచి 10.45 గంటల సమయంలో ఎన్ఐసీయూ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎన్ఐసీయూ వెలుపల ఉన్న చిన్నారులను అధికారులు కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడ్డ శిశువులకు చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు డ్యూటీలో ఉన్న స్టాఫ్ తెలిపారు.

ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు సంతాపం తెలిపారాయన. ఈ ఘటన బాధాకరం అన్నారు యోగి ఆదిత్యనాథ్. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఒక్కసారిగా వార్డులో మంటలు చెలరేగడంతో శిశువుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయయారు. అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 37 మంది చిన్నారులను ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com