నమ్మలేని నిజం ఇది.! 400 ఏళ్లుగా చుక్క నీరు లేదక్కడ.!!

- November 18, 2024 , by Maagulf
నమ్మలేని నిజం ఇది.! 400 ఏళ్లుగా చుక్క నీరు లేదక్కడ.!!

భూమ్మీద ఉన్న ఓ ప్రాంతంలో 400 సంవత్సరాలుగా వర్షం కురవలేదంటే నమ్ముతారా..? వినడానికి వింతగా ఉన్నా ఆ ప్రదేశాన్ని చూస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారు. 400 సంవత్సరాలుగా చుక్క నీరు లేని ఆ ప్రదేశం చూడటానికి ఎలా ఉంటుందంటే.. మీరు ఆ ప్రదేశానికి వెళ్తే సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్లు చూసినట్లు, అంగారక గ్రహం మీద విహరిస్తున్నట్లు కనిపిస్తుంది. 

భూమిపై అత్యంత అరుదైన ఎడారి ప్రాంతంగా ప్రసిద్ది చెందిన ఈ ఎడారిలో వర్షం కురవకుండా.. చుక్క నీరు కూడా లేకుండా నాలుగు శతాబ్దాలు గడిచిపోయాయి అంటే నమ్మగలమా..? చరిత్ర పుటల్లో దాగిన ఈ విచిత్రమైన ఎడారి ప్రదేశం లక్ష చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉందంటే నమ్మగలమా..?

ఇసుక, దుమ్ము ధూళి, రాళ్ళు రప్పలతో నిండి ఉండి తక్కువ తేమతో, అధిక ఉష్ణోగ్రతలతో ఉండే ఈ ఎడారి ప్రాంతం ఏడాది మొత్తం అత్యంత కఠిన వాతావరణంతో ఉంటుంది. మానవ మనుగడకు ఏ మాత్రం అనుకూలంగా లేని ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు, జంతువులు మాత్రమే జీవించగల ఆ ప్రదేశం పేరే అటకామా ఎడారి. ఉత్తర చీలీలో ఉన్న ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

అటకామా ఎడారి, దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో ఉన్న ఈ ఎడారి ప్రపంచంలో అత్యంత పొడి ఎడారిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వర్షపాతం దాదాపు శూన్యం. వందల సంవత్సరాలుగా ఇక్కడ చుక్క నీరు లేదు. ఈ ఎడారి ప్రాంతంలో సంవత్సరాల తరబడి వర్షం కురవదు. దీంతో ఈ ప్రదేశం నీరు లేని అంగారక గ్రహంలా కనిపిస్తుంది.

దాదాపు 1,81,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అటకామా ఎడారి చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఇసుక, ఉప్పు బేసిన్‌లు, మరియు లావా రాళ్ళు, దుమ్ము ధూళి విస్తరించి ఉంటాయి. ఈ ఎడారి ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు అంగారకగ్రహం వాతావరణాన్ని పోలి ఉండటంతో NASA వంటి అంతరిక్ష సంస్థలు తమ రోవర్‌లను పరీక్షించడానికి ఉపయోగిస్తాయి. 

అటకామా ఎడారి ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, వాలే డే లా లూనా (చంద్రుని లోయ) అనే ప్రదేశం, సాన్ పెడ్రో డే అటకామా అనే పట్టణం దగ్గర ఉంది. ఈ ప్రదేశం చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అంటే ఇక్కడ చంద్రుని మీద ఉన్నట్లే దుమ్ము ధూళి తప్ప ఇంకేమీ ఉండవు.

అటకామా ఎడారి ప్రాంతంలో వర్షం కురవకపోవడానికి ప్రధాన కారణం వర్షచ్ఛాయా ప్రభావం. ఈ ఎడారి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, తూర్పున ఆండీస్ పర్వతాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే తేమ గాలులు ఆండీస్ పర్వతాలను దాటలేవు. ఈ పర్వతాలు తేమను అడ్డుకుంటాయి, దాంతో ఆ గాలులు ఎడారి ప్రాంతానికి చేరే సమయానికి పొడి గాలులుగా మారతాయి.

మరొక కారణం హంబోల్ట్ కరెంట్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో చల్లని నీటి ప్రవాహం. ఈ కరెంట్ కారణంగా సముద్రం నుండి వచ్చే గాలులు చల్లగా ఉంటాయి. అవి ఎడారి ప్రాంతంలో తేమను తీసుకురావడంలో విఫలమవుతాయి.

అటకామా ఎడారి వాతావరణం చాలా పొడిగా ఉండటంతో ఇక్కడ జీవజాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మొక్కలు, జంతువులు మాత్రమే ఇక్కడ జీవించగల ఈ ప్రాంతంలో వర్షం కురవకపోవడానికి పర్వతాలు, సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణాలు.

అటకామా ఎడారి భూగోళంపై ఏర్పడిన ఒక ప్రత్యేకమైన సహజసిద్ధమైన ప్రదేశం. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేక గ్రహం లాంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఈ ప్రదేశం ప్రత్యేకమైన వాతావరణం, భౌగోళిక లక్షణాలు, మరియు పరిశోధనలకు అనువైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com