విలక్షణ నటుడు-శుభలేఖ సుధాకర్
- November 19, 2024
తమకు అచ్చి వచ్చిన సినిమాల పేర్లనే ఇంటిపేరుగా మార్చుకొని రాణించిన వారెందరో ఉన్నారు. ‘శుభలేఖ’ సుధాకర్ కూడా అచ్చంగా అలాంటివారే! ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. నేడు సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ పుట్టినరోజు
సుధాకర్ అసలు పేరు సూరావఝ్ఝల సుధాకర్. 1960 నవంబర్ 19న సుధాకర్ జన్మించారు. చదువు పూర్తి కాగానే మనసు సినిమాల్లోకి వెళ్తానని మారాం చేసింది. మదరాసులో పాత్రల కోసం ప్రయత్నాలలో ఉండగా, కె.విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘శుభలేఖ’లో కీలక పాత్రకు ఎంపికయ్యారు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో, ఆ తరువాత ఆకట్టుకున్న పాత్ర సుధాకర్ దే! ‘శుభలేఖ’ సమయంలోనే తమిళంలో శివాజీ గణేశన్ చిత్రం ‘తునై’లోనూ నటించారు సుధాకర్. ‘శుభలేఖ’ విడుదలై మాతృభాష తెలుగులో మంచి పేరు దక్కింది. అప్పటికే ఓ సుధాకర్ చిత్రసీమలో ఉండగా, ఈ సుధాకర్ తన సినిమా ‘శుభలేఖ’ను ఇంటిపేరుగా చేసుకోవలసి వచ్చింది. ఆ పేరే ఆయనకు శుభాలు చేకూర్చింది. సోలో హీరోగా ఎప్పుడూ హిట్టు పట్టలేదు కానీ, హీరోకు సమానమైన పాత్రల్లో నటించేసి విజయాలు చూశారు.
ఇప్పుడయితే ఎంతోమంది యువదర్శకులు శుభలేఖ సుధాకర్ ను తమ చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ కు ఎంపిక చేసుకుంటున్నారు. అవి లేకపోయినా, పరభాషా నటులకు డబ్బింగ్ చెప్పడానికైనా శుభలేఖ సుధాకర్ గళాన్ని వాడేస్తున్నారు. శుభలేఖ సుధాకర్ కూడా నటన మాత్రమే చేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు ‘శుభలేఖ’ సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్ తోనూ ఇద్దరూ అలరించడం విశేషం! శుభలేఖ సుధాకర్, శైలజ దంపతులకు ఓ కుమారుడు. పేరు శ్రీకర్. ఒకప్పుడు సినిమాలలో బిజీగా సాగిన సుధాకర్, తరువాత టీవీ సీరియల్స్ లోనూ మురిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ వాలిపోతున్నారు. ప్రతీచోటా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారాయన.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







