భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్య

- November 22, 2024 , by Maagulf
భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్య

అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అనే పదాలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిందో మహిళ.

మగవాని బ్రతుకులో.. సగపాలు తనదిగా.. జీవితం అంకితం చేసి తన శరీరంలో ఉన్న అవయవాన్ని  కొంత తన భర్తకు ఇచ్చి ప్రాణం పోసింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా శయనేషు రంభ అంటూ భార్య త్యాగం గురించి ఎంతో గొప్పగా వివరించిన సిరివెన్నెల బహుశా భార్య తన ప్రాణంతో భర్త ప్రాణాన్ని కాపాడుకోవటం గురించి రాయడం మార్చిపోయాడేమో. దానిని కూడా భర్తీ చేసి తన లివర్ తో భర్త ప్రాణాన్ని కాపాడుకుంది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ. 

లివర్ అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరంలో అనేక కీలకమైన విధులను నిర్వహిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండడం అనేది మన శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లివర్ డామేజ్ అయితే జాండిస్, హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. ఇంకా శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపించి మనిషి ప్రాణం పోవచ్చు. లివర్ ఆరోగ్యంగా ఉంటే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది ఇంకా అనేక రకాల వ్యాధుల నుండి రక్షించబడతాం. మన శరీర ఆరోగ్యంలో ఎంత కీలక పాత్ర పోషించే లివర్ నీ దానం చేసి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ. తన లివర్ నుండి కొంత తన భర్తకు ఇచ్చి ప్రాణం పోసింది.

వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్దఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు లివర్ మార్పిడి తప్పనిసరి అని చెప్పారు. డోనర్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం దొరకలేదు. కొన్నిచోట్ల అవకాశం దొరికినా లివర్ క్రాస్ మ్యాచ్ కాకపోవడంతో ఆశలన్ని వదులుకున్నారు. లివర్ చెడిపోవడం వలన తన భర్త శ్రీను ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతుండంతో లావణ్య తీవ్ర ఆవేదన చెందింది. 

తన భర్త ఆరోగ్యం కనపడని ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంది. అయినా ప్రయోజనం శూన్యం. రోజురోజుకు క్షీణించిపోతున్న ఆరోగ్యం.. కళ్ళ ముందు కోటి ప్రశ్నలు. భర్త లేకపోతే సమాజం తనని ఎలా చూస్తుందో అనే కోటి ప్రశ్నలు తన కళ్ళ ముందు కదిలాయి. ఆశలు అడుగంటిన చివరి క్షణంలో తనకు ఏమైపోయినా పర్వాలేదు తన భర్త ఆరోగ్యం బాగుంటే చాలు అనే తలంపుతో లావణ్య తన లివర్ ఇస్తానని ముందుకొచ్చింది. 

సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు లావణ్య లివర్ తన భర్తకు మ్యాచ్ అవుతుందని నిర్ధారించారు. అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, లావణ్య లివర్ నుంచి 65 శాతం తీసి, తన భర్త శ్రీనుకు అమర్చారు. ఈ శస్త్రచికిత్స ఈనెల 16న జరిగింది. ప్రస్తుతం శ్రీను మరియు లావణ్య ఇద్దరూ ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఈ సంఘటన వారి కుటుంబానికి మాత్రమే కాకుండా, సమాజానికి కూడా ఆదర్శంగా నిలిచింది.

నిజంగా మగవాడికి సహధర్మచారిణి సరిలేని వరమని, పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై, 
పతే లోకమై బ్రతికే ఆడవాళ్ళందిరికి నీ త్యాగం గొప్పది. ఏ స్వార్థమూ లేకుండా భర్తకోసం త్యాగం చేసేది ఒక్క భార్యే అని నిరూపించిన ఈ మహిళా మాతృమూర్తికి శతకోటి వందనాలు తెలుపుదాం.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com