భాజపా సారథి-జె.పి.నడ్డా
- December 03, 2024జాతీయ రాజకీయాల్లో అధికార పక్షం నుండి ప్రధాని మోడీ, హోమ్ మినిష్టర్ అమిత్ షా తర్వాత శక్తివంతమైన నేతగా వెలుగొందుతున్నారు జె.పి.నడ్డా. షా వారసుడిగా భాజపా పగ్గాలు చేపట్టి, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలకంగా కృషి చేస్తున్నారు. హిమాచల్ రాజకీయాల్లో భాజపా తరపున కీలక నేతగా వ్యవహరించిన నడ్డా మోడీ-షాల అండతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. నేడు కేంద్ర మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా జన్మదినం.
జె.పి.నడ్డా పూర్తి పేరు జగత్ ప్రకాష్ నడ్డా. 1960,డిసెంబర్ 2న బీహార్ రాజధాని పాట్నాలో హిమాచల్ మూలాలు ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నారాయణ్ లాల్ నడ్డా, కృష్ణ నడ్డా దంపతులకు జన్మించారు. నడ్డా పాట్నా కాలేజీ నుంచి డిగ్రీ, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. నడ్డా చిన్నతనంలోనే ఆరెస్సెస్ లో బాల స్వయం సేవక్ గా చేరి, సంఘంలో అంచెలంచెలుగా ఎదిగారు.
పాట్నా కాలేజీలో చదువుతున్న సమయంలో సంఘానికి అనుబంధమైన ఏబీవీపీలో చేరిన జెపి సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం హిమాచల్ యూనివర్సిటీలో లా చదువుతున్న రోజుల్లో ఏబీవీపీ తరుపున జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. 1985-90 మధ్యలో ఏబీవీపీ ఢిల్లీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా, జాతీయ సెక్రెటరీగా పనిచేశారు. భాజపా యువ నేతగా ఉన్న నితిన్ గడ్కరీ ప్రోద్బలంతో ఏబీవీపీ నుంచి భాజపాలోకి మారారు.1990-91 వరకు హిమాచల్ భాజపా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేశారు.
1991-94 భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నడ్డా, 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రలో నరేంద్ర మోడీ సహాయకుడిగా వ్యవహరించారు. 1992-12 వరకు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో నడ్డా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1993లో బిలాస్ పూర్ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికైన నడ్డా, హిమాచల్ అసెంబ్లీలో 1994-98 వరకు భాజపా శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఈ సమయంలోనే హిమాచల్ భాజపా దిగ్గజం ప్రేమ్ కుమార్ ధూమల్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
1998 ఎన్నికల్లో భాజపా అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ధూమల్ మంత్రివర్గంలో ఆరోగ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. నడ్డా 2003లో జరిగిన ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఓటమి పాలైనా, జాతీయ పార్టీ శ్రేణుల సహకారంతో పార్టీ బాధ్యతల్లో కొనసాగారు. 2007లో బిలాస్ పూర్ నుంచి మూడో సారి ఎన్నికైన నడ్డా ధూమల్ మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ & సైన్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు 2008-10 వరకు కొనసాగారు. సీఎం ధూమల్ తో వచ్చిన వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా 2010లో జాతీయ రాజకీయాల వైపు మళ్లారు.
2010లో తన రాజకీయ మార్గదర్శి నితిన్ గడ్కరీ భాజపా జాతీయ అధ్యక్షుడు కావడంతో, నడ్డా జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జాతీయ కార్యదర్శిగా భాజపా కేంద్ర కార్యాలయ బాధ్యతలను చూడడంతో పాటుగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరించారు. 2012లో రాజ్యసభకు నడ్డా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 2013లో రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరోసారి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో టీం మోడీలో నడ్డా కీలకంగా వ్యవహరించారు. 2012,2018,2024లలో వరుసగా మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
2014లో మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా 2019 వరకు పనిచేశారు. 2019లో అమిత్ షా తర్వాత భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. 2022లో రెండో సారి సైతం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2024లో మోడీ 3.0లో కేంద్ర ఆరోగ్య మరియు రసాయన, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటుగా రాజ్యసభలో భాజపా పక్షనేతగా సైతం ఎన్నికయ్యారు. భాజపా చరిత్రలో మూడు జాతీయ పదవులను చేపట్టిన ఏకైక వ్యక్తిగా నడ్డా చరిత్ర సృష్టించారు.
ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నడ్డా, హెల్త్ సెక్టార్ మీద పట్టు సాధించారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర హెల్త్ సెక్టార్లో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత నడ్డాదే. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంలో నడ్డా పాత్ర చాలా కీలకం. హెల్త్ సెక్టార్లో నడ్డాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 2014లో తన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ బాధ్యతలను మోడీ అప్పజెప్పారు. నడ్డా హయాంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్, 55 కోట్లమందికి 5 లక్షల దాక ఉచిత బీమా పథకం, మిషన్ ఇంధ్రధనుష్, తక్కువ ఖర్చుతోనే మందులను కొనుక్కునేందుకు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు వంటి వాటిలో నడ్డా పాత్ర చాలా కీలకం.
నడ్డా , మోడీ - షాల మధ్య రాజకీయంగా మంచి అనుబంధం ఉంది. మోడీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదుగుతున్న సమయంలో నడ్డా భాజపాలో చేరారు. జోషి ఏక్తా యాత్ర నిర్వహణలో మోడీకి సహాయకులుగా ఉన్న యువ నేతల్లో నడ్డా ఒకరు. 1995లో మోడీ భాజపా జాతీయ కార్యదర్శిగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను అధికారంలోకి రానీయకుండా చేయడంలో మోడీ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు నడ్డా కృషి చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు వాది సుఖ్ రామ్ సహకారంతో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేయడంతో నడ్డా మోడీకి బాగా దగ్గరయ్యారు.
మోడీ జాతీయ కార్యదర్శిగా ఉన్నంత కాలం, నడ్డా ఆయన్ను తరచూ కలుస్తూ ఉండేవారు. 2001లో మోడీ గుజరాత్ సీఎం అయిన తర్వాత, రాష్ట్ర ఆరోగ్య రంగానికి సంబంధించి నడ్డా నుంచి సలహాలు తీసుకున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. వీరిద్దరికి ఉన్న ఈ పరిచయం మూలంగానే 2014లో మోడీ ప్రధాని అయ్యాక, తన మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా తీసుకున్నారు. మోడీ - షాల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా వారికి బాగా దగ్గరయ్యారు. 2019లో షా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోగానే, తన వారసుడిగా నడ్డాను ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా సైతం పార్టీని ఆ ద్వయం కనుసన్నల్లోనే నడిచేలా చేస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!