తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు-ఉన్నవ
- December 04, 2024అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక లోటుపాటులను, వివక్షలను, కాలబాహ్యమైన సంస్కృతి, సంప్రదాయ, ఆచార, వ్యవహారాలను, మనం తయారు చేసుకున్న మను, పరాశర, యాజ్ఞవల్క స్మృతుల ద్వారా మానవ సంఘ జీవితాన్ని ఆనందమయం చేసే మార్పులు చేసుకుంటూ వచ్చాము. ఈ క్రమంలోనే నేటి అవసరాలకి అనుగుణమైన భారత రాజ్యాంగమనే, అంబేడ్కర్ స్మృతిని భారత ప్రజలమైన మనం, మనకి ఇచ్చుకుని, నవ-సమాజాన్ని, సమ-సమాజాన్ని తీర్చి దిద్దుకుంటున్నాము.ఈ క్రమంలో, అన్ని కాలాలలో, ఎంతో మంది సామాజిక సంస్కర్తలు, సమాజ జీవితాన్ని ఆనందమం చేయడానికి నిరంతరంగా తమవంతు ప్రయత్నం చేశారు. అటువంటి విశేష ప్రయత్నం చేసిన ఒక శ్రేష్ఠమైన వ్యక్తి ఉన్నవ లక్ష్మీనారాయణ. నేడు గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి.
ఉన్నవ లక్ష్మీనారాయణ 1877, డిసెంబర్ 4వ తేదీన ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని సత్తెనపల్లి ఫిర్కాలోని వేములూరుపాడు గ్రామంలో శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా పనిచేయడం మొదలు పెట్టారు. అనంతరం రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. అప్పటి సమాజంలో బారిష్టర్ వృత్తికున్న విలువను గుర్తించి 1916లో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని డబ్లిన్ యూనివర్సిటీలో బార్‌ఎట్‌లా పూర్తి చేశారు. అక్కడ చదువుతున్న సమయంలోనే ఐరిష్ హోమ్ రూల్ జాతీయ నాయకుడైన ‘డీవాలేరా’తో ఏర్పడిన పరిచయం వారిని ప్రభావితం చేసింది. స్వదేశానికి వచ్చి 1917లో మద్రాస్ హై కోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు.
ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్యాభిలాషను పెంపొందించుకున్నాడు. గుంటూరులో 1900 సంవత్సరంలో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించి ఎందరో యువకుల్లో సాహిత్యాభిలాషను పెంపొందించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి ప్రేరణతో 1902వ సంవత్సరంలో గుంటూరు పట్టణంలో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. గుంటూరులో తొలి వితంతు వివాహాన్ని జరిపించి, ఆ కార్యక్రమానికి వీరేశలింగం గారినే అధ్యక్షునిగా తీసుకువచ్చారు. వీరేశలింగంగారి కోరిక మేరకు 1906లో రాజమండ్రిలో వితంతు శరణాలయం పర్యవేక్షణ బాధ్యతను చేపట్టారు.
1912లో పూనేలో కార్వే మహిళా విద్యాలయాన్ని సందర్శించి, ఆ అవగాహన బాపట్లలో 1913లో కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా అవిరళ కృషి చేసి సభ విజయానికి దోహదం చేశాడు. ఆ సంవత్సరంలోనే విశాలాంధ్రకు సంబంధించిన న్యూస్‌ను జొన్న విత్తుల గురునాథం గారితో కలసి రూపొందించారు. గుంటూరులో స్త్రీ విద్య ప్రోత్సాహానికి 1922లో ‘శారదానికేతన్’ సంస్థ స్థాపించి ఎందరో బాలికలకు చదువుకొనే అవకాశం కల్పించారు. ఇప్పటికీ ఆ సంస్థ బాలికల విద్యాసంస్థగా ప్రగతి పథంలో నడుస్తుంది.
1923లో కాంగ్రెస్ స్వరాజ్య పార్టీలో చేరారు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులుగా ఎన్నికైన ఇద్దరిలో లక్ష్మీనారాయణ ఒకరు. కాంగ్రెస్ వాది అయినప్పటికీ, మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మొహమాటంగా విమర్శించారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పుల్లరి సత్యాగ్రహం (1921), ఉప్పు సత్యాగ్రహం (1931), క్విట్ ఇండియా ఉద్యమం (1942)లో పాల్గొని అనేక సార్లు కారాగార శిక్ష అనుభవించారు. ఆయన నడిపిన “గుంటూరు పత్రిక” సామాజిక సంస్కరణా ఉద్యమాలకు ప్రేరణా కేంద్రంగా నిలిచింది.
రష్యా బోల్షివిక్ విప్లవంతో స్ఫూర్తి పొందిన తొలి తెలుగు రచయితగా ఉన్నవ ఖ్యాతి గాంచారు. ఆ ప్రభావంతో 1921లో మాలపల్లి నవలకు శ్రీకారం చుట్టి 1922లో రాయవెల్లూరు కారాగారంలో ఉన్నప్పుడు పూర్తి చేశారు. దేశభక్తి; సంఘ సంస్కరణాభిలాషతో ఆ రచన సాగించారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు వారికి చేరాలంటే వాడుకభాషలో ఉండాలన్నది ఉన్నవ సంకల్పం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడమే నవల ఫలశ్రుతి. నిజానికి ఆయన ముందునుంచీ కుల వ్యవస్థను నిరసించాడు. ‘నాయకురాలు’, ‘బుడబుక్కల జోస్యం’, ‘స్వరాజ్య సోది’, భావతరంగాలు’ వంటి రచనలతో కూడా ఉన్నవ స్వాతంత్య్రోద్యమంతో పాటు సాహిత్యోద్యమంలో కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
దేశంలో చాలా చోట్ల గాంధీ రాకకు పూర్వమే నిమ్నవర్గాల పట్ల వివక్ష తగదన్న స్పృహ వచ్చింది. అగ్రవర్ణాలవారితో హరిజనులు కలిసిమెలిసి ఉండాలని భావించి సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఉన్నవ. అంతకు మించి ఆనాటి సమాజంలో హరిజనుల గాథను ఇతివృత్తంగా తీసుకొని నవల రాయడమే గొప్ప సాహసం. ఇందులో కథా నాయకుడిపేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా రచయిత ఆదర్శ సంఘ పునరుద్ధరణకు పూనుకున్నాడు. అందువల్ల ఈ నవలకు ‘సంగ విజయం’ అనే పేరు కూడా ఉంది. సుబ్బలక్ష్మి అనే నిమ్న వర్గ యువతి మీద మునసబు మనిషి చేయి చేసుకోవడం కూడా ఇందులో ఉంది. దీనికి బాధపడిన రామదాసు చేత ‘మాలమాదిగలంటే అంత చౌక?’ అన్న మాటను కూడా ఆనాడు ఉన్నవ పలికించారు.జైలు జీవిత చిత్రణ కూడా ఇందులో ఉంది.
ఉన్నవ లక్ష్మీనారాయణ జైలు నుండి విడుదలైన తరువాత ఆధునిక ఇతిహాసంగా చెప్పే మాలపల్లి నవలను 1922లో నరసరావుపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది, వితరణశీలి, సాహిత్యాభిమాని బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ప్రచురించారు. నవలలో జాతీయోద్యమ రాజకీయ వాతావరణం, మహాత్ముని ఆశయాలు, తెలుగువారి జీవన విధానం కలసి సాగుతాయి. సాంఘిక దురాచారాలు, సత్యాగ్రహ ఉద్యమాలు, వర్గ, వర్ణ విభేదాల స్వరూపాన్ని రచయిత వర్ణించారు.
శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి “మాలపల్లి” నవలని సంపూర్ణంగా పరికించినప్పుడు, ఆయన తన పాత్రలతో…. “మొక్కాబోతే గుళ్లే లేవు, యెక్కాబోతే బళ్ళే రావు- కుడవ పూట కూళ్ళే లేవురా ఓ జ్ఞానా సంగా జదువనైనా బళ్లే లేవురా”… పనివారందరు యేకమైతిరా ప్రపంచమే మీది, ఐకమత్యమే అన్ని పనులకు ఆధారము సుండి.. అని అనిపించిన వ్యాఖ్యలు, దిగుమతి చేసుకున్న భావజాలం కాక, స్థానికంగా అప్పటికే సమాజం కోసం పోరాడిన ఎందరో సామాజిక సంస్కర్తల ఆలోచనా ధోరణినే ప్రస్ఫుటించిందనవచ్చు. పైగా అప్పటికే తల్లాప్రగడ సూర్యనారాయణ గారు “హేలావతి” (1913), వేంకటపార్వతీశ్వర కవుల “మాతృ మందిరం” (1919) వంటి నవలలు దళిత సమస్యలని స్పృశించాయి.
మాలపల్లి’ నవలను 1923లో మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. మద్రాసు శాసనమండలిలో 1926లో అయ్యదేవర కాళేశ్వరరావుగారు ‘మాలపల్లి నవల’పై నిషేధాన్ని ఎత్తివేయాలని వాదించారు. ఆయన తెచ్చిన చర్చ ఫలితంగా మద్రాసు ప్రభుత్వం 1928లో కొన్ని మార్పులతో మాలపల్లి నవల ప్రచురణకు అనుమతించింది. అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ సర్.సి.ఆర్.రెడ్డి ఆ నవలను విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించి విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. మద్రాసు ప్రభుత్వం 1936లో మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం విధించి పాఠ్యగ్రంథంగా తొలగించింది. సి.రాజగోపాలాచారి 1937లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మాలపల్లి నవలపై నిషేధపు ఉత్తరువులను రద్దుచేసింది. ఆ విధంగా ఒక కాలపు చరిత్రకు ఛాయగా ఉన్న ఈ నవల కూడా చరిత్రను సృష్టించింది. రెండుసార్లు నిషేధానికి గురైంది. కానీ, సాహిత్యప్రియుల హృదయాలలో శాశ్వతంగానే ఉంది.
గాంధేయవాదిగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్తర్తగా, గుంటూరు శారదానికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవలా సాహిత్య తాళికుడిగా గణననీయమైన కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఉన్నవ వారి సతీమణి లక్ష్మీబాయమ్మ ఆయనకు చేదోడువాదోడుగా నిలిచి సహకరించింది. ఉన్నవవారు 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపదించారు. ఆయన గతించి దశాబ్దాలు కావొస్తున్నా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!